కోతుల వీర విహారం

1 Feb, 2018 14:24 IST|Sakshi

  కాలనీవాసులపై దాడులు చేస్తున్న కోతులు

   భయాందోళనలో  ప్రజలు

  ఇళ్ల నుంచి బయటకు వెళ్లని పరిస్థితి

   పట్టించుకోని అధికారులు 

అచ్చంపేట రూరల్‌ : అచ్చంపేటలోని వివిధ కాలనీల్లో కోతుల బెడద తీవ్రమైంది. ఒంటరిగా ఉన్న మనుషులపై ప్రత్యక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. వా రంలో 10మందికి పైగా కోతులు దాడి చేసి గాయపర్చాయి. ఆదర్శనగర్‌ కాలనీ లో చిన్న పిల్లలపై దాడులు చేస్తున్నాయి. మధ్యాహ్నపాఠశాల నుం చి ఇంటికి తినడానికి వచ్చిన విద్యార్థులపై కోతులు దాడి చేసి గాయపర్చుతున్నాయి. 


ఆదర్శనగర్‌ కాలనీలో..


ఈనెల 29న ఆదర్శనగర్‌ కాలనీలో ఓ విద్యార్థి వెంట పడి కోతులు దాడి చేశాయి. పరుగెత్తుకుంటూ ఓ ఇంట్లోకి వెళ్లినా కోతులు వదల్లేదు. కాళ్లు, చేతులపై దాడి చేశాయి. ఇది చూసిన కాలనీవాసులు భయాందోళనకు గురై ఇంటి నుంచి బయటకు వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్లినా కర్రలు చేతిలో పట్టుకుని వస్తున్నారు. ఒకప్పుడు ఇళ్లలోకి వచ్చి ఆహార పదార్థాలు ఎత్తుకెళ్లే కోతులు ప్రస్తుతం దాడులు చేయడంతో భయాందోళనకు గురవుతున్నారు. ఇంటిలో ఉన్న మహిళలు తలుపులు మూసుకుని ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 


ఆర్టీసీ సిబ్బందిపై..


అలాగే బుధవారం ఉదయం ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న సిబ్బందిపై కోతులు దాడి చేశాయి. సెక్యూరిటీ గార్డు, ఉద్యోగి సుఖ్‌జీవన్‌రెడ్డిపై దాడి చేసి గాయపర్చాయి. సుఖ్‌జీవన్‌రెడ్డి చేతులు, చెవులను కొరికివేశాయి. ఎడమ చెవిని కోతి కొరకడంతో చెవి భాగం కింద పడింది. ఆర్టీసీ కార్మికులు కర్రలు చేతిలో పట్టుకుని పనులు చేస్తున్నారు. అందరూ ఒకే దగ్గర కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడు కోతులు దాడులు చేస్తాయో అని భయాందోళనలో కార్మికులు ఉన్నారు. 


కోతులను పట్టుకునేవాళ్లను పిలిపించాం


కాలనీలో కోతులు దాడులు చేస్తున్నాయని ఫిర్యాదులు చాలా వచ్చాయి. కోతులను పట్టుకునే వాళ్లను పిలిపించాం. గురువారం నుంచి కోతులను పట్టుకునే పనిలో వారుంటారు. కాలనీవాసులు భయాందోళనకు గురి కాకుండా కోతులను పట్టుకుని పట్టణానికి దూరంగా వదిలేస్తాం. 
నాయిని వెంకటస్వామి, నగరపంచాయతీ కమిషనర్, అచ్చంపేట


పట్టించుకోని అధికారులు... 


కోతుల బెడద నుంచి తప్పించాలని పలుమార్లు నగరపంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. గతంలో ఓసారి కోతులను పట్టుకునే వారిని పిలిపించి పట్టుకుని పట్టణానికి దూరంగా పంపించారని, ప్రస్తుతం అలాంటి చర్యలు నగరపంచాయతీ అధికారులు చేపట్టడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.  

మరిన్ని వార్తలు