ఎంపీ టికెట్‌ తేలేది నేడే..!

21 Mar, 2019 11:08 IST|Sakshi

ఎంపీ టికెట్‌ దక్కించుకునేదెవరో? 

ఇప్పటికే పూర్తయిన అభ్యర్థుల ఎంపిక కసరత్తు 

గోప్యత పాటిస్తున్న రాజకీయ పార్టీలు 

సాక్షిప్రతినిధి, ఖమ్మం: పార్లమెంట్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంటే.. జిల్లాలో మాత్రం ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరనే ఆతృతే ఇంకా కొనసాగుతోంది. విభిన్న రాజకీయ పరిస్థితులున్న జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై గట్టి కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారు కొలిక్కి వచ్చినా.. ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక అంశం ఒక పట్టాన తేలడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్‌ దాఖలుకు ముహూర్తం ముంచుకొస్తున్నా.. జిల్లాలో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో ఆయా పార్టీల్లో ఉత్కంఠ కొద్దిరోజులుగా కొనసాగుతూనే ఉంది.

నామినేషన్‌ వేసేందుకు రెండు రోజులే గడువు ఉండడంతో ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ వంటి పార్టీలు గురువారం ఖమ్మం నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినా.. ఖమ్మం నుంచి ఎవరిని పోటీ చేయించాలనే అంశంపై ఇక్కడ నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసే నేతలు ఎవరో దాదాపు తేటతెల్లమైనా.. ఖమ్మం విషయంలో మాత్రం పడిన చిక్కుముడి మాత్రం వీడని పరిస్థితి. ఖమ్మం ఎంపీ, టీఆర్‌ఎస్‌ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు చివరి నిమిషంలోనైనా తమకు టికెట్‌ వస్తుందనే విశ్వాసం వ్యక్తం చేస్తుండగా.. టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, కాంట్రాక్టర్‌ గరికపాటి వెంకటేశ్వరరావు(ఆర్టీసీ) వంటి పేర్లు ప్రచారంలో ఉండగా.. రెండు రోజులుగా టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేరు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీ అధినేత ఎవరి వైపు మొగ్గు చూపుతారు.. ఈ స్థానం ఎవరిని వరిస్తుందనే అంశం పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక కాంగ్రెస్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.  


ఒకే తరహా గోప్యత.. 
టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు మాత్రం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి ఒకే తరహా గోప్యతను పాటిస్తుండడంతోపాటు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని ప్రకటించాకే.. తమ అభ్యర్థిని ప్రకటించాలనే నియమం విధించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రాష్ట్రస్థాయిలో ఖమ్మం నియోజకవర్గం మరోసారి రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నట్లయింది. ఇక రెండు రోజులే నామినేషన్‌ దాఖలుకు గడువు ఉండడంతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీలు తమ అభ్యర్థులను ఖరారు చేసేందుకు తుది కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం మధ్యాహ్నం వరకు ఖమ్మం ఎంపీగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరో అధికారికంగా ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పటికే కాంగ్రెస్‌ టికెట్‌ ఎవరికి లభిస్తుందనే అంశంపై రోజుకో రీతిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అనేక మంది ముఖ్య నేతలు అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పారిశ్రామికవేత్త వద్దిరా>జు రవిచంద్ర, కాంగ్రెస్‌ నాయకుడు రాయల నాగేశ్వరరావు తదితరులు దరఖాస్తు చేసుకోగా.. 2009లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని అధిష్టానం వద్ద పట్టుబట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

దీంతో తాజాగా రేణుకాచౌదరి, పోట్ల నాగేశ్వరరావు పేర్లు సామాజిక వర్గం నేపథ్యంలో అధిష్టానం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను మూడు రోజుల క్రితమే ప్రకటించిన కాంగ్రెస్‌.. వ్యూహాత్మకంగానే ఖమ్మం అభ్యర్థి ప్రకటన అంశాన్ని వాయిదా వేస్తోందని.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వం ఖరారయ్యాక జరిగే పరిణామాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిని ప్రకటించడం వల్ల ప్రయోజనం ఉంటుందనే భావనలో ఉన్నట్లు ఆయా పార్టీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.  


బీజేపీదీ అదే వ్యూహం.. 
ఇక బీజేపీ సైతం ఇదే తరహా వ్యూహంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దేశస్థాయిలో బీజేపీకి సానుకూల పవనాలున్న దృష్ట్యా వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తులను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే వ్యూహంతో ఆ పార్టీ ఉన్నట్లు ప్రచారమవుతోంది. ఇప్పటికే సీపీఎం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌ నాయకుడు బి.వెంకట్‌ను పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది. సీపీఎంకు సీపీఐతోపాటు జనసేన, బీఎస్పీ వంటి పార్టీలు మద్దతు ఇస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

అయితే సీపీఐ తన వైఖరిని మాత్రం ఇంకా రాష్ట్రస్థాయిలో స్పష్టం చేయలేదని.. ఒకటి, రెండు రోజుల్లో సీపీఐ తమ పార్టీవిధానాన్ని వెల్లడించే అవకాశం ఉందని రాజ కీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లా లో రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన తెలుగుదేశం పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే సాహ సం చేయలేని పరిస్థితి నెలకొందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్న టీడీపీ శ్రేణులు లోక్‌సభ ఎన్నికలపై వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ఇక ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్న నామా నాగేశ్వరరావు జిల్లాలోని టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో ఇప్పటికే సమావేశమై.. తనకు సహకరించాలని కోరినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు