గిదేం ఎంపిక..!

26 Nov, 2014 03:03 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల : జిల్లాలో సమస్యలతో సతమతమవుతున్న మారుమూల గ్రామాలు అనేకం ఉన్నాయి. ఎన్ని దశాబ్దాలు గడిచినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. మోదీ సర్కారు ప్రవేశపెట్టిన సంసద్ గ్రామ్ యోజన పథకానికి ఇలాంటి మూడు గ్రామాలను ఎంపిక చేసుకుంటే నిరుపేదల బతుకుల్లో అభివృద్ధి బాటలు వేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జిల్లాలోని ఎంపీలు గోడం నగేష్, బాల్కసుమన్ ఎంపిక చేయనున్న గ్రామాల విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ దండేపల్లి మండల పరిధిలోని గూడెం గ్రామాన్ని ఎంపిక చేశారు. మారుమూల గ్రామాలతో పోల్చితే ఈ గ్రామం కాస్తోకూస్తో అభివృద్ధి బాటలో ఉంది. పాలక వర్గం లేదనే ఒకే ఒక్క కారణంతో ఈ పంచాయతీని ఎంపిక చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభివృద్ధికి నోచుకోని గ్రామ పంచాయతీల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

సంసద్ గ్రామ యోజన పథకం కింద ఆదర్శ గ్రామ పంచాయతీలను ప్రతిపాదించి నివేదికలు పంపాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిం ది. గ్రామ పంచాయతీల ఎంపిక బాధ్యత ఎంపీలు, కలెక్టర్లకు అప్పగించింది. ఎంపీలు తన నియోజకవర్గ పరిధిలోని మూడు పంచాయతీలను దత్తత తీసుకుని.. ఆ గ్రామాల్లో సుపరిపాలన, సామాజిక, ఆర్థిక, పర్యావరణ, కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి, పాఠశాలలు, రోడ్ల నిర్మాణం, మెరుగైన వైద్యం ఇతర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

 ఈ క్రమంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని గూడెం గ్రామ పంచాయతీని ఎంచుకున్నారు. అభివృద్ధి దశలో ఉన్న ‘గూడెం’కు బదులు.. అనేక సమస్యలున్న గ్రామ పంచాయతీలను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేస్తే.. పథక లక్ష్యం నెరవేరేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎంపీ తీసుకున్న నిర్ణయంపై మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ గ్రామాల ఎంపిక విషయంలో స్థానిక  అధికారుల అభిప్రాయాలను ఎంపీలు పరిగణలోకి తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని..
 - బాల్క సుమన్, ఎంపీ పెద్దపల్లి
 గూడెంలో ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయాభివృద్ధితోపాటు ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గ్రామాన్ని దత్తత తీసుకున్న. దశలవారీగా నా పరిధిలోని అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలను అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తా.

మరిన్ని వార్తలు