TS Adilabad Assembly Constituency: 'ఆ నలుగురు ఎమ్మెల్యేలు.. ఒకప్పుడు ఉపాధ్యాయులే..'
Sakshi News home page

'ఆ నలుగురు ఎమ్మెల్యేలు.. ఒకప్పుడు ఉపాధ్యాయులే..'

Published Thu, Oct 26 2023 7:50 AM

- - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: బోథ్‌ ఎస్టీ అసెంబ్లీ రిజర్వుడ్‌ స్థానంలో 38ఏళ్ల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసిన వారే ఎమ్మెల్యేలుగా గెలుపొందుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 14మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా దీంట్లో నలుగురు ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారే కావడం విశేషం.

► బజార్‌హత్నూర్‌ మండలంలోని జాతర్ల గ్రామానికి చెందిన గోడం రామారావు ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి మొదటిసారిగా 1985లో టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 1989లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందాడు.

► రామారావు తనయుడు గోడం నగేష్‌ 1986లో బజార్‌హత్నూర్‌ మండలంలోని విఠల్‌గూడలో గిరిజన పాఠశాల్లో ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరాడు. 1994లో బోథ్‌ మండలంలోని పార్డీ ఆశ్రమ పాఠశాల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందాడు. ఉమ్మడి అంధ్రప్రదేశ్‌లో గిరిజన శాఖ మంత్రిగా పనిచేశాడు.

1999లో రెండోసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర జీసీసీ చైర్మన్‌గా పనిచేశాడు. 2009 టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్‌ విజయం సాధించాడు. నాల్గోసారి 2004 టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరి ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందాడు. 2019 పార్లమెంట్‌ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి ఓటమి చెందాడు.

► నార్నూర్‌ మండల కేంద్రానికి చెందిన రాథోడ్‌ బాపురావు 1986లో ఆదిలాబాద్‌ మండలంలోని చింతగూడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నియమితులయ్యాడు. 2009లో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014 టీఆర్‌ఎస్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. 2018లో రెండోసారి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్‌కి రాజీనామా చేశారు.

► బోథ్‌ మండలంలోని నాగుగూడ గ్రామానికి చెందిన సోయం బాపూరావు 1987లో మహదుగూడలో గిరిజన శాఖ ఉపాధ్యాయుడిగా నియమితుడయ్యాడు. వివిద పాఠశాల్లో విధులు నిర్వహిస్తూనే తుడుం దెబ్బలో ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేశాడు. 2004 ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ నుంచి బోథ్‌ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందాడు. 2014లో టీడీపీ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యాడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా పోటీ గెలుపొందాడు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నాడు.

Advertisement
Advertisement