ముచ్చర్లలో ‘ఫార్మా’ సరికాదు

4 Dec, 2014 23:41 IST|Sakshi
ముచ్చర్లలో ‘ఫార్మా’ సరికాదు

డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్

ఇబ్రహీంపట్నం: ముచ్చర్లలో ఫార్మా పరిశ్రమ నెలకొల్పడం వల్ల ఇక్కడి ప్రశాంతమైన పర్యావరణానికి పెనుప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉందని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. సీరిస్ పరిశ్రమ నెలకొల్పడం మూలంగా రంగారెడ్డి జిల్లాలోని జీటిమెట్ల, సరూర్‌నగర్ మండలాల్లో ఇప్పటికే వాతావరణ కాలుష్యం ఏర్పడిందని, ఎంతో మంది ప్రజలు ఫ్లోరైడ్‌బారిన పడి అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాలను నెలకొల్పాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగాల భర్తీపై ఎక్కడా మాట్లాడని ముఖ్యమంత్రి.. పరిశ్రమల ఏర్పాటు ప్రకటనలు, పర్యటనలతో నిరుద్యోగ యువతను భ్రమల్లోకి నెడుతున్నారన్నారు. ఎంతోమంది యువకుల బలిదానాలకు చలించి యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, విద్యార్ధుల బలిదానాలను, మేధావుల పోరాటాలను అపహాస్యం చేస్తూ సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజావ్యతిరేక పాలనపై ప్రజలు విసుగెత్తి పోతున్నారని, గతంలో కొనసాగిన కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారని వెల్లడించారు.

మరిన్ని వార్తలు