చేనేత కార్మికులకు నాబార్డ్ అండ

24 Nov, 2014 00:19 IST|Sakshi

దుబ్బాక: ఆత్మహత్యలు, ఆకలి చావులు నివారించి, చేనేత కార్మికులకు నాబార్‌‌డ అండగా ఉంటుందని నాబార్డ్ ఏజీఎం రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. దుబ్బాక చేనేత సహకార సంఘాన్ని ఆదివారం ఆయన సందర్శించి, చేనేత కార్మికుల స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత రంగాన్ని నమ్ముకున్న వృత్తి దారులకు ఉత్పత్తిదారుల అభివృద్ధి నిధి కింద సాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. చేనేత కార్మికులకు శిక్షణ, ఎగుమతులు, దిగుమతుల సాధ్యసాధ్యాలపై అవగాహన కల్పించేందుకు నాబార్డ్ కృషి చేస్తుందన్నారు.

చేనేత ఉత్పత్తులను నూతన ఒరవడిలో తయారు చేయడానికి నాబార్డ్  చేనేత కళాఖండాలపై అధ్యయనం చేపట్టిందన్నారు. దుబ్బాక సొసైటీలో తయారు చేస్తున్న షర్టులు, టవల్స్ చాలా బాగున్నాయన్నారు. దుబ్బాక చేనేత సహకార సంఘం ఇచ్చే ప్రాజెక్టు రిపోర్టు ఆధారంగానే నాబార్డ్ సాయం చేస్తుందన్నారు. చేనేత రంగాన్ని బ్యాంకులతో అనుసంధానం చేయడానికి నాబార్డ్ కృషి చేస్తుందన్నారు. అంతకుముందు సొసైటీలోని రికార్డులను పరిశీలించి చైర్మన్‌కు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో చైర్మన్ బోడ శ్రీనివాస్, కార్యదర్శి కాల్వ లక్ష్మీనారాయణ, సభ్యులు కూరపాటి బాల్‌రాజు, చింత శేఖరం, గవ్వల దుబ్బరాజం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు