నిండుకుండలా సాగర్ జలాశయం

12 Sep, 2014 02:47 IST|Sakshi

 నాగార్జునసాగర్ :నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. వారంరోజుల వ్యవధిలోనే రోజుకు రెండు నుంచి నాలుగు అడుగులకు నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. గురువారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 586 అడుగులకు చేరింది. గరిష ్టనీటిమట్టానికి కేవ లం నాలుగుల అడుగుల దూరంలోనే ఉంది. ఎగువ నుంచి 12 టీఎంసీల నీరు వచ్చి చేరితే వచ్చే 24గంటల్లో ఎప్పుడైనా సాగర్ క్రస్ట్‌గేట్లు ఎత్తే అవకాశముంది.  కృష్ణాపరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఉపనపదులు పరవళ్లు తొక్కుతున్నాయి. అకస్మాత్తుగా వరద రావడం, మధ్యలో ఆగిపోతుండడంతో ఉపనదుల ద్వారా వచ్చే వరదనీటిని అధికారులు అంచనా వేయలేకపోతున్నారు.
 
 గతేడు ఆగస్టు 7న గేట్లు ఎత్తింది...
 గత ఏడాది ఆగస్టుమాసంలోనే సాగర్ జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో అదేనెలలో 7వ తేదీన ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు. అప్పుడు సాగర్ జలాశయ నీటిమట్టం  583.40 అడుగులు. అనంతరం స్థానికంగా కురిసిన వర్షాలకు ఉపనదులు పొంగిపొర్లి కృష్ణానదిలోకి వరదనీరు భారీగా వచ్చి చేరింది. దీంతో మరోమారు గేట్లు ఎత్తారు.   
 
 24 గంటల్లో ఎప్పుడైనా..
 వచ్చే వరద ఉధృతి ఇలాగే కొనసాగితే వచ్చే 24గంటల్లో ఏక్షణంలోనైనా నాగార్జునసాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్‌గేట్లు ఎత్తే అవకాశాలున్నట్లు  డ్యాం ఎస్‌ఈ విజయభాస్కర్‌రావు గురువారం రాత్రి తెలిపారు. వరదనీటి విషయమై సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దిగువన  కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్స్యకారులు చేపలు పట్టేందుకు నదిలో వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అదేమాదిరిగా కృష్ణానదిలో  మోటర్లు పెట్టి సాగుచేసుకునే రైతులు  విద్యుత్ మోటర్లను పైకి తీసుకోవాలని సూచించారు. ఈమేరకు ఆయా గ్రామ కార్యదర్శులుకు సమాచారం అంద జేశారు.
 
 టెయిల్‌పాండ్ వద్ద పెరిగిన వ రద ఉధృతి
 అడవిదేవులపల్లి(దామరచర్ల) : నాగార్జునసాగర్ డ్యాం దిగువన 24వ కిలోమీటర్ వద్ద  కృష్ణానదిపై నిర్మిస్తున్న టెయిల్‌పాండ్ వద్ద గురువారం ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. అయితే వరద ఉధృతి వల్ల డ్యాం నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం లేదని డ్యాం డీఈ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. క్రస్టగేట్ల వద్ద కాంక్రీట్ కోటింగ్ మొదటి విడత పూర్తయిందని, సాగర్ గేట్లు ఎత్తితే రెండోవిడత వేయాల్సిన కాంక్రీట్ కోటింగ్ పనులకు అంతరాయం ఏర్పడుతుందని డీఈ చెప్పారు.
 

మరిన్ని వార్తలు