లక్ష్యానికి చేరువ..  

11 Feb, 2019 10:16 IST|Sakshi

నల్లగొండ అగ్రికల్చర్‌ : జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఆదాయ లక్ష్య సాధనలో ముందంజలో ఉన్నాయి. ఈ ఏడాది మార్కెట్‌ కమిటీలకు తెల్లబంగారమే అధిక ఆదాయాన్ని సమకూర్చింది. జిల్లాలో మొత్తం తొమ్మిది వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. మిర్యాలగూడ, దేవరకొండ, నిడమనూరు, హాలియా నల్లగొండ, నకిరేకల్, చిట్యాల, చండూరు, వీటీనగర్‌(మాల్‌) వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు 2018–19 ఆదాయ లక్ష్యం రూ.27.85 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు అంటే జనవరి నెల పూర్తి నాటికి రూ.18 కోట్ల 69లక్షల 56 వేల ఆదాయం సమకూరింది. ఇంకా పత్తిని కొనుగోలు చేసిన కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ), ఆయా వ్యవసాయ మార్కెట్‌లు, ఇతర కేంద్రాల ద్వారా ఖరీఫ్‌ ధాన్యాన్ని కొనుగోలు చేసిన సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ల నుంచి సుమారు రూ.13 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. అవి మార్చిలోగా జమచేస్తే జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఆదాయం లక్ష్యానికి మించి వచ్చినట్లు అవుతుంది.

ఇవీ... మార్కెట్‌లకు ఆదాయ మార్గాలు
జిల్లాలో రైతులు పండించిన వరిధాన్యం, కందులు, పెసర, పత్తి, ఇతర పప్పుధాన్యాలను ఆయా మార్కెట్‌ పరిధిలో  కొనుగోలు చేసిన వ్యాపారులు, మిల్లర్లు, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు, కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వారి నుంచి ఒకశాతం కమీషన్‌ను ఆయా మార్కెట్‌లకు చెల్లించాల్సి ఉంటుంది. అందులో జిల్లాలో మార్కెట్‌లకు ఆదాయాన్ని సమకూర్చేది కేవలం వరిధాన్యం, తరువాత తెల్లబంగారమే. గత ఖరీఫ్‌లో జిల్లాలో సుమారు 2లక్షల 69 వేల హెక్టార్లలో పత్తిని రైతులు సాగు చేయగా, రెండవ స్థానంలో వరిని 70 వేల 458హెక్టార్లలో సాగు చేశారు. ఖరీఫ్‌లో నాగార్జునసాగర్‌ ఎడమకాలువతో పాటు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని విడుదల చేయడంతోపాటు పత్తికి అనుకూలమైన వర్షాలు కురిశాయి. దీంతో వరితోపాటు పత్తి దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చింది. దీంతో మార్కెట్‌లకు కమీషన్‌ల రూపంలో భారీగా ఆదాయం సమకూరింది. 

బకాయిలు వస్తే లక్ష్యం చేరినట్లే
కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతోపాటు సివిల్‌ సప్లయ్‌ నుంచి రూ.13 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉంది. అవి వస్తే మేము ఈ సంవత్సరం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లే. మార్చి వరకు బకాయిలు వచ్చే అవకాశం ఉంది. పత్తితోపాటు వరిధాన్యం మీద వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు బాగా ఆదాయం వచ్చింది. –ఎంఏ అలీం, జిల్లా మార్కెటింగ్‌ అధికారి

మరిన్ని వార్తలు