ఆక్రమణలు సాగిపోయాయి

2 Oct, 2014 02:58 IST|Sakshi

62 ఎకరాల్లో విస్తరించిన ‘సాగి’ చెరువు...1993 వరకూ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే నిర్వహణ. కోదాడ పట్టణానికి సమీపంలో ఉండడం, భూములకు విలువ పెరగడంతో కబ్జాదారుల కన్ను ఈ చెరువుపై పడింది.  ఓ సర్వేయర్, నీటిపారుదలశాఖలో పనిచేసిన ఓ ఉద్యోగి, శ్రీరంగాపురం గ్రామానికి చెందిన నేత ఆక్రమణ పర్వానికి తెరలేపారు. ఇంకేముంది ఆ చెరువు ఆనవాళ్లే నేడు కనిపించకుండా పోయాయి. చెరువుల పునరుద్ధరణ విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండడంతో కబ్జాకోరల్లో చిక్కుకున్న సాగి చెరువుకు విముక్తి లభిస్తుందేమో వేచి చూడాల్సిందే.     
 
 కోదాడ గ్రామ పంచాయతీలోని శ్రీరంగాపురం గ్రామాన్ని ఆనుకొని సర్వేనంబర్లు 753, 755, 756, 757, 758, 552, 553లలో సాగి చెరువు విస్తరించి ఉన్నట్లు పాతరికార్డులను బట్టి తెలుస్తోంది. సాగర్ కాల్వ రావడంతో ఈ చెరువు అవసరం లేకపోవడం, దీనికింద సాగువుతున్న భూములు ఇళ్ల ప్లాట్లుగా మారడంతో నాడు కోదాడ రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సర్వేయర్, నీటిపారుదలశాఖలో పని చేసిన ఓ ఉద్యోగి, శ్రీరంగాపురం గ్రామానికి చెందిన ఓ నాయకుడు చెరువు కబ్జాకు తెరతీశారు. ముందస్తుగా రెవెన్యూ కార్యాలయంలోని రికార్డులను మాయం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆ తరువాత చెరువులో నీరు నిలువఉండకుండా చేసేందుకు రాత్రి సమయాల్లో అలుగుతో పాటు కట్టను కూడా సగానికిపైగా తొలగించారు. అనంతరం చెరువు భూమితోపాటు మునక భూమిని కబ్జా చేశారు. చెరువు కింద భూములను ఇళ్ల ప్లాట్లుగా మార్చడంతో పైభాగంలో చెరువు లేకుంటే తమ భూములకు మరింత విలువ వస్తుందని రైతులు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో అక్రమార్కుల పని సులువైంది.
 
 రెవెన్యూ రికార్డులు మాయం
 సాగిచెరువు వివరాలను కొందరు రెవెన్యూ అధికారులు కావాలనే మాయం చేశారు. కానీ నీటి పారుదల శాఖ వద్ద, పంచాయతీరాజ్ శాఖ వద్ద ఈ చెరువుకు సంబంధించిన వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ చెరువు కట్ట 520 మీటర్ల పొడవు ఉండగా దీనిలో సగానికి పైగా ఆక్రమణదారులు తొలగించారు. ఐబీ అధికారులు ఈ చెరువు కింద సాగవుతున్న 82.18 ఎకరాల భూమికి 40ఏళ్లుగా శిస్తు వసూలు చేస్తున్నారు. 1993 వరకు చెరువు కట్ట నిర్వహణను పంచాయతీరాజ్ శాఖ చూసినట్లు రికార్డులో స్పష్టంగా ఉంది. ఫైల్‌నంబర్ బీ/1285/93 ప్రకారం శ్రీరంగాపురం సాగి చెరువు కట్ట 520 మీటర్లు ఉందని ఇది బలహీనంగా ఉండడంతో రాతితో రివిటింగ్ చేయాలని స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. చెరువు విస్తీర్ణం మునకతో సహా 62 ఎకరాలు ఉందని దీనికి రెండు తూములు , అలుగు ఉన్నట్లు అధికారులు ఆ రిపోర్టులో పేర్కొన్నారు.
 
 రూ. 10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కూడా..
 ఈ చెరువు భూమితోపాటు ఇందులో మునకగా ఉన్న భూదానభూమి, అసైన్డ్ భూమి కూడా ఆక్రమణకు గురైంది. సర్వేనంబర్ 753లో రెండు ఎకరాల పది గుంటలు, సర్వేనంబర్ 758 లో 22 గుంటలు,  దీంతోపాటు చెరువు శిఖంలో సర్వేనంబర్లు 755, 756, 757 లలో నాలుగు ఎకరాలు షేక్‌సింద్‌లకు ఏక్‌సాల్ పట్టాలు ఇచ్చారు. వీరంతా చెరువులో నీరులేనప్పుడు సాగు చేసుకోవాల్సిఉంది. అక్కడే కోదాడ మాజీ సర్ప ంచ్ సర్వేనంబర్ 753లో భూదానబోర్డుకు ఇచ్చిన ఎకరం 38 గంటల భూమి ఉంది. షేక్‌సింద్‌లకు ఇచ్చిన భూమి మొత్తం 6 ఎకరాల 30 గుంటలు ప్రస్తుతం వేరేవారి చేతుల్లోకి వెళ్లింది. ఈ ప్రభుత్వ భూమి విలువే దాదాపు రూ.10 కోట్లకు పైగా ఉంటుంది. ఇక భూదానభూమిని కూడా కొందరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
 
 ఇప్పటికీ చెరువు ఆనవాళ్లు..
 రెవెన్యూ రికార్డుల్లో శ్రీరంగాపురం సాగి చెరువును మాయం చేసినప్పటికీ అక్కడ చెరువు ఉన్నట్లు ఇప్పటికీ ఆ ప్రదేశంలో స్పష్టమైన ఆనవాళ్లు ఉన్నాయి. గ్రామానికి చెందిన 50 సంవత్సరాలు పైబడిన వారిని ఎవరిని అడిగినా చెరువు గురించి చెబుతారు. ఈ చెరువుకట్టను కబ్జాదారులు సగం తొలగించగా మరికొంత భాగాన్ని పేదలు చదును చేసి ఇళ్లు నిర్మించుకున్నారు. ఈ చెరువు పై భాగం నుంచి ఇటీవల బైపాస్‌రోడ్డు నిర్మించారు. బైపాస్‌రోడ్డు కోసం 2003లో సర్వే చేసిన సమయంలో సర్వే రిపోర్టులో సాగి చెరువు ఉన్నట్లు మ్యాప్‌తో సహా చీఫ్ ఇంజినీర్లు స్పష్టంగా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు