ఐటీఐల బలోపేతంపై దృష్టి

27 Feb, 2016 04:01 IST|Sakshi
ఐటీఐల బలోపేతంపై దృష్టి

కొత్త కోర్సులు  ప్రవేశపెట్టాలని కార్మికశాఖ నిర్ణయం
సింగపూర్ తరహాలో తీర్చిదిద్దేందుకు ప్రణా
ళి

 సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లను మరింత బలోపేతం చేసే దిశగా కార్మికశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా మానవ వనరులను తయారు చేసి, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను పెంపొందించడం కోసం పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ ఓవర్‌సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) ద్వారా విదేశాలలో ఉద్యోగ అవకాశాల కల్పనకు మంచి స్పందన  లభించడంతో ఐటీఐ కాలేజీలను బలోపేతం చేయాలని కార్మికశాఖ నిర్ణయించింది. కార్మిక, హోంశాఖల మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో దుబాయ్‌లో జరిపిన పర్యటన ద్వారా టామ్‌కామ్ దాదాపు 1150 మందికి ఉద్యోగ అవకాశాల కోసం విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. త్వరలో పదివేల మందికి ఉద్యోగ అవకాశాల కల్పనకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీఐలను నైపుణ్య కేంద్రాలుగా మార్చాలని కార్మికశాఖ నిర్ణయించింది.

అందుకు అనుగుణంగా శిక్షణ విధానంలో మార్పులు తీసుకురావడంతోపాటు కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇప్పుడు అందిస్తున్న కోర్సులకు అదనంగా మార్కెట్‌లో  డిమాండ్ ఉన్న ఇంటీరియర్ డిజైన్, బ్యూటీషియన్ వంటి కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అలాగే కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తూ, నూతన యంత్ర సామాగ్రి కొనుగోలు చేయాలని కార్మికశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సింగపూర్‌లో కొనసాగుతున్న పారిశ్రామిక శిక్షణ సంస్థల తరహాలో రాష్ట్రంలోని ఐటీఐలను తీర్చిదిద్దాలని యోచిస్తోంది. అందుకోసం ఈ ఏడాది మొదటి ప్రయత్నంలో భాగంగా రూ.350 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

మరిన్ని వార్తలు