లక్ష కోట్లతో మిషన్‌ హైదరాబాద్‌

25 Sep, 2017 01:10 IST|Sakshi

మరో భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు సీఎం కేసీఆర్‌ యోచన

మిషన్‌ భగీరథ పూర్తయ్యాక శ్రీకారం చుట్టే అవకాశం

వచ్చే రెండేళ్లూ నగరం అభివృద్ధిపైనే ఫోకస్‌

అధికారులు, గ్రేటర్‌ నేతలతో ఇప్పటికే సీఎం మంతనాలు

సాక్షి, హైదరాబాద్‌: మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ తరహాలో త్వరలోనే మరో భారీ మిషన్‌ తలపెట్టేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిద్ధమవుతున్నారు. రాజధాని నగరం హైదరాబాద్‌ రూపురేఖలు మార్చేలా భారీ అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు. విశ్వనగరాన్ని తలపించేలా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఏకంగా రూ.లక్ష కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీటిని అందించే మిషన్‌ భగీరథ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే కొత్త ప్రాజెక్టు ప్రకటించాలని సీఎం యోచిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధి లక్ష్యంగా చేపట్టే కార్యక్రమం కావటంతో ‘మిషన్‌ హైదరాబాద్‌’ పేరుతో ఈ ప్రాజెక్టును ప్రకటించే అవకాశాలున్నాయి.

ఇప్పటికే ఈ కార్యక్రమం రూపురేఖలు, కార్యాచరణ రూట్‌మ్యాప్‌పై అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం సమాలోచనలు చేశారు. కొత్త రాష్ట్రంలో అధికారం చేపట్టాక ఇంటింటికీ తాగునీరు  అందించేందుకు రూ.40 వేల కోట్లతో మిషన్‌ భగీరథ పథకం చేపట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌లోగా ఈ పనులన్నీ పూర్తవుతాయని ముఖ్యమంత్రి ధీమాతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోగా ఇంటింటికీ నల్లా నీటిని అందించకపోతే ఓట్లు అడగబోమని సీఎం చేసిన సవాలుకు అనుగుణంగానే ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగాయి. మరోవైపు రూ.25 వేల కోట్ల అంచనాలతో చేపట్టిన  మిషన్‌ కాకతీయ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం కూడా ఆశించిన ఫలితాలను అందించింది. ఈ కార్యక్రమం దేశంలోనే వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. దీంతో అదే స్థాయిలో మిషన్‌ హైదరాబాద్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి.. నిర్ణీత గడువులోగా అమలు చేయాలని సీఎం భావిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు మంజూరు చేయాలని కోరుతూ పంపిన ప్రతిపాదనలన్నీ సీఎం ఇదే కారణంతో పక్కన పెట్టినట్లు సమాచారం. ‘‘ఇప్పుడు చిన్నచిన్న అభివృద్ధి పనులు, ప్రతిపాదనలు వద్దు. భారీ మిషన్‌ తరహాలో అభివృద్ధి చేద్దాం. వచ్చే రెండేళ్లు హైదరాబాద్‌ అభివృద్ధిపైనే ఫోకస్‌ చేద్దాం’’ అని ఇటీవల తనను కలసిన ఎమ్మెల్యేలతో సీఎం అన్నట్టు తెలిసింది.

సమస్యలకు విరుగుడు!
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ను సవాలక్ష సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్న వాన పడితే చాలు రోడ్లన్నీ చెరువులవుతున్నాయి. గంటల కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. నిజాం కాలం నాటి డ్రైనేజీ పైపులు ఒత్తిడికి లోనై పగిలిపోతున్నాయి. వీటన్నింటికి తోడు పదేపదే పాడయ్యే రోడ్లు.. ఇవన్నీ హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి హోదాకు చేటు తెచ్చి పెడుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌ జనాభా గణనీయంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో నగరంలో అంతర్జాతీయ పెట్టుబడులు రావాలంటే మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు.

భారీగా నిధుల సమీకరణ
గతంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల సమయంలోనే ప్రభుత్వం హైదరాబాద్‌ అభివృద్ధికి భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రాథమికంగా రూపొందించిన అంచనాల ప్రకారం రూ.83,950 కోట్ల వ్యయంతో ప్రత్యేక ప్రాజెక్టు రిపోర్టు తయారు చేశారు. హైదరాబాద్‌ను సుందర నగరంగా మార్చాలంటే ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తేనే సాధ్యమవుతుందని సీఎం భావిస్తున్నారు. అందుకే ఈ మిషన్‌కు ఏకంగా రూ.లక్ష కోట్లు వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. విదేశీ రుణ సంస్థలు, బ్యాంకుల నుంచి రుణసాయం తీసుకోవటంతోపాటు వీలైనన్ని మార్గాల్లో నిధులు సమీకరించేందుకు వ్యూహరచన చేశారు. మొత్తం ప్రాజెక్టు అమలుకు నాలుగేళ్ల వ్యవధి పడుతుందని, కొన్ని పనులను వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.

రోడ్లు, రవాణాపైనే ప్రధాన ఫోకస్‌
కొత్త మిషన్‌లో భాగంగా ప్రధానంగా రోడ్లు, రవాణాపై దృష్టి సారిస్తారు. ఇప్పటికే మెట్రో రైలు ప్రారంభానికి సిద్ధమవుతోంది. నవంబర్‌లో మెట్రో మొదటి దశ ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మెట్రో రెండో దశ, ఎంఎంటీఎస్‌ విస్తరణను కొత్త ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్నారు. వీటితోపాటు స్ట్రాటెజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా ప్‌లై ఓవర్, స్కై వేలు, హైదరాబాద్‌ పరిసర పట్టణాలను కలిపే కౌంటర్‌ మాగ్నెట్‌ రోడ్లు, అత్యాధునిక బస్‌బేలు, పార్కింగ్‌లు, పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మిస్తారు. పర్యాటక ప్రాంతాల వద్ద విదేశీయులను ఆకర్షించేలా ఏర్పాట్లతోపాటు అక్కడ ఉండే స్టాల్స్, తోపుడుబండ్లను కూడా ప్రభుత్వమే డిజైన్‌ చేసి ఇవ్వనుంది. స్టార్‌ హోటళ్లు, మాల్స్‌లతోపాటు హుస్సేన్‌సాగర్‌ పరిసరాలను అందంగా తీర్చిదిద్దుతారు. మిషన్‌ హైదరాబాద్‌లో భాగంగా పాత, శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలను కొన్నింటిని పరిరక్షిస్తారు. కొన్నింటి స్థానంలో అదే నమూనాలో కొత్తవి నిర్మిస్తారు. తెలంగాణ సంçస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే కల్చరల్‌ సెంటర్లు, థీమ్‌ పార్కులు ఏర్పాటు చేస్తారు. అత్యాధునికంగా కూరగాయలు, నాన్‌వెజ్‌ మార్కెట్లు, మినీ కమ్యూనిటీ హాల్స్‌ నిర్మిస్తారు. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థ, జంక్షన్‌లను అభివృద్ధి చేస్తారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ను అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తారు.

మిషన్‌ హైదరాబాద్‌ ప్రాథమిక అంచనాలివీ..(రూ.కోట్లలో)
రోడ్లు, రహదారులు             25,783
ఈస్ట్‌ వెస్ట్‌ మూసీ రోడ్‌         7,775
హెచ్‌ఎండీఏ గ్రిడ్‌ రోడ్లు         6,000
మౌలిక వసతుల కల్పన        13,998
ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్డిలు           42
మూసీ రివర్‌ ఫ్రంట్‌        2,966
డబుల్‌ బెడ్రూం ఇళ్లు        7,788
శ్మశాన వాటికలు        25
హుస్సేన్‌ సాగర్‌ సుందరీకరణ    141.50
నీటి సరఫరా            12,531
డ్రైనేజీ వ్యవస్థ        6,900 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు