‘రికార్డు స్థాయిలో సరుకు రవాణా’

1 Feb, 2019 00:20 IST|Sakshi

పలువురు ఉద్యోగులను అభినందించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం  

సాక్షి,హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఈ ఆర్థిక ఏడాది 100 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌(జీఎం) ఆర్‌.కె కుల్‌శ్రేష్ట గురువారం మీడియాకు తెలిపారు. రికార్డు స్థాయిలో సరుకు రవాణాకు కృషి చేసిన అధికారులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సరుకు రవాణాలో అత్యధిక రికార్డు సాధించడానికి దక్షిణ మధ్య రైల్వే పనితీరు, సామర్థ్యమే కారణమన్నారు.

మొత్తం 100.052 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేసి గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. రవాణా అయిన వాటిలో బొగ్గు 53.555 టన్నులు, సిమెంట్‌ 22.948, ఎరువులు 5.374, ఇనుప ఖనిజం 5.183, ఆహార ధాన్యాలు 3.925, స్టీల్‌ ప్లాంట్ల ముడి సరుకు 2.275, ఇతర సరుకు రవాణా 5.07 టన్నులుగా నమోదైనట్లు తెలిపారు. గతేడాది ఆదాయంతో పోలిస్తే 26% పెరిగి రూ.1764 కోట్ల అధికంగా ఆదాయ వృద్ధి సాధించిందన్నారు. ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ ఎన్‌. మధుసూదన్‌రావు మాట్లాడుతూ...సింగరేణి సంస్థ అందించిన సహకారం వల్లనే పెద్ద ఎత్తున బొగ్గు రవాణా సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా చీఫ్‌ ఫ్రైట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ బి.నాగ్యా, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ఉద్యోగులను ఆయన ప్రశంసించారు. 

మరిన్ని వార్తలు