8 బ్లాకులతో.. నూతన సచివాలయం

3 Feb, 2015 01:47 IST|Sakshi
8 బ్లాకులతో.. నూతన సచివాలయం

 తొమ్మిది అంతస్తులతో సీఎం పేషీ భవనం.. అందులోనే ప్రజా సంబంధాల విభాగం, సీఎస్ కార్యాలయం
 300 సీట్ల సామర్థ్యంతో సమావేశ మందిరం
 మంత్రుల కోసం ఎనిమిది అంతస్తులతో ఆరు బ్లాకులు
 ఏడెనిమిది అంతస్తులతో మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్
 అధునాతన వసతులు, సౌకర్యాలతో ఏర్పాట్లు
 పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాల్సిందిగా
 అధికారులకు సీఎస్ ఆదేశం

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని ఎర్రగడ్డలో నిర్మించనున్న నూతన సచివాలయాన్ని ఎనిమిది బ్లాకులుగా చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అందులో ముఖ్యమంత్రి పేషీ కోసం ఏడు నుంచి తొమ్మిది అంతస్తుల వరకు ఉండే ఒక బ్లాకును, ఇతర మంత్రిత్వ శాఖల కోసం ఆరు బ్లాకులు, పార్కింగ్ కోసం ఒక మల్టీలెవల్ పార్కింగ్ బ్లాకును నిర్మించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం ఆర్‌అండ్‌బీ అధికారులతో సమావేశమయ్యారు. నూతన సచివాలయం నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాల్సిందిగా ఆదేశించారు. మొత్తం ఎనిమిది బ్లాకులుగా నూతన సచివాలయాన్ని నిర్మించనున్నారు. ఇందులో ముఖ్యమంత్రి కోసం ఏడు నుంచి తొమ్మిది అంతస్తులుండే ప్రత్యేక బ్లాక్ ఉంటుంది. ఇందులోనే దిగువన ప్రజా సంబంధాల విభాగం ఉండనుండగా.. దానిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయనకు సంబంధించిన ఇతర విభాగాల కార్యాలయాలు ఉంటాయి. వీటితోపాటు మూడొందల మంది కూర్చునే సామర్థ్యంతో ప్రత్యేక సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్, మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక హాల్‌లు ఉంటాయి. ముఖ్యమైన అతిథులతో భేటీ అయ్యేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తారు. వీటన్నింటినీ పూర్తి అధునాతన  వసతులతో ఏర్పాటు చేయనున్నారు. ఇక మంత్రుల కోసం ఆరు బ్లాకులను విడివిడిగా నిర్మించనున్నారు. ఇవి ఒక్కొక్కటి 6 నుంచి 8 అంతస్తులతో ఉంటాయి. ఈ బ్లాకుల్లో ఒక్కో మంత్రిత్వ శాఖకు రెండు అంతస్తుల చొప్పున కేటాయిస్తారు. వాటిల్లో మంత్రి, ఆ శాఖ కార్యదర్శి, విభాగాధిపతుల కార్యాలయాలు ఉంటాయి. భవిష్యత్ అవసరాలను అనుసరించి అంతస్తుల సంఖ్యను పెంచుతారు.
 
 మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్..
 
 ప్రస్తుత సచివాలయంలో పార్కింగ్‌కు సరైన ఏర్పాట్లు లేవు. ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ వాహనాలు నిలుపుతున్నారు. ఒక్కోసారి లోపల స్థలం సరిపోక సచివాలయం వెలుపల రోడ్డుపక్కన కూడా వాహనాలను నిలుపుతున్నారు. ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా నూతన సచివాలయంలో ప్రత్యేకంగా మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తారు. ర్యాంపుల మీదుగా వాహనాలు పైఅంతస్తుల్లోకి చేరుకుంటాయి. దీనిని ఏడెనిమిది అంతస్తులతో నిర్మించాలని భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు