వేతనం రూ.400 జరిమానా..రూ.500

3 Apr, 2019 07:00 IST|Sakshi

గార్డు విధులకు రాకుంటే రూ.500 ఫైన్‌

నిమ్స్‌లో వింత నిబంధన

నోరు మెదిపేందుకు జంకుతున్న కాంట్రాక్టర్లు

సోమాజిగూడ: నిమ్స్‌ ఆసుపత్రిలో సెక్యూరిటీ కాంట్రాక్టు విషయంలో యాజమాన్యం వింత నిబంధనను అమలు చేస్తోంది.రెండేళ్లకోసారి సెక్యూరిటీ గార్డుల సరఫరాకు నిమ్స్‌ యాజమాన్యం ప్రవేట్‌ ఏజన్సీల నుంచి టెండర్లను ఆహ్వానిస్తోంది. ఆయా టెండర్లలో తక్కువ ధరకు కోట్‌ చేసిన వ్యక్తులకు కాంట్రాక్టు అప్పగిస్తారు. అంతవరకు బాగానే ఉన్నా  అక్కడినుంచే అసలు కథ మొదలవుతోంది. నిమ్స్‌ యాజమాన్యం నుంచి సెక్యూరిటీ కాంట్రాక్టు పొందిన వ్యక్తి  నుంచి రోజుకు 150 మంది గార్డులను మూడు షిప్టుల్లో ఆసుపత్రిలో డ్యూటీలో ఉంచాలని నిబంధన ఉంది. అయితే గార్డుల సరఫరాకు అనుమతి పొందిన సెక్యూరిటీ ఏజెన్సీకి అక్కడినుంచే కష్టాలు ప్రారంభవుతున్నాయి. అనుకోని పరిస్థితుల్లో గార్డులు విధులకు హాజరు కాలేకపోతే నిమ్స్‌ యాజమాన్యం ఎందరు గార్డులు విధులకు గైర్హాజరైతే అంత మందికి..రూ.500 చొప్పున ఫైన్‌ విధిస్తూ కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేస్తుండటంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. కాంట్రాక్టు వదులుకోలేక నిమ్స్‌ యాజమాన్యం విధించి షరతులను అంగీకరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చేతులెత్తేసిన పాత కాంట్రాక్టర్‌
రెండేళ్ల పాటు నిమ్స్‌ ఆసుపత్రికి సెక్యూరిటీ గార్డుల సరఫరాకు సాయిరాయ్‌ సెక్యూరిటీ ఏజన్సీ యాజమాన్యం నుంచి కాంట్రాక్టు పొందింది. ఏడాది పాటు గార్డుల సరఫరా చేసిన సదరు ఏజన్సీ ..నిమ్స్‌ పెద్దలతో నెలకొన్న వివాదం కారణంగా 2018 అక్టోబర్‌లో కాంట్రాక్ట్‌ నుంచి తప్పుకుంది. నిమ్స్‌ యాజమాన్యం సకాలంలో గార్డుల సరఫరాకు సంబందించి బిల్లులను మంజూరు చేయకపోవడం..గార్డుల గైర్హాజరుకు విధించే ఫైన్లను తట్టుకోలేక వారు చేతులెత్తేశారు. ఒక్కో గార్డుకు రోజుకు అక్షరాల రూ.400 వేతనంగా చెల్లిస్తుండగా, జరిమానాగా రూ.500 వందలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఫైన్లు చెల్లించలేక సదరు ఏజెన్సీ తప్పుకోవడంతో...టెండర్ల సమయంలో రెండో స్థానంలో ఉన్న ఏషియన్‌ సెక్యూరిటీ ఏజెన్సీకి నామినేషన్‌ పద్దతిలో సెక్యూరిటీ గార్డుల సరఫరా కాంట్రాక్టును అప్పగించారు. అక్టోబర్‌లో కాంట్రాక్ట్‌   తీసుకున్న ఏషియన్‌ సెక్యూరిటీ ఏజెన్సీకి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బిల్లులు మంజూరు చేయలేదు. ఈ విషయమై యాజమాన్యాన్ని గట్టిగా అడిగితే ఎక్కడ ఇబ్బంది పెడతారోనని ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పీఎఫ్‌ సక్రమంగా చెల్లించడం లేదు  
సెక్యూరిటీ గార్డుల సరఫరాకు సంబంధించి బిల్లుల విషయమై నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌ను వివరణ కోరగా...సదరు ఏజెన్సీ గార్డులకు సంబంధించి ప్రావిడెంట్‌ ఫండ్‌ సక్రమంగా చెల్లించడం లేదన్నారు. అన్ని అంశాలు పరిశీలించిన అనంతరం బిల్లులు మంజూరు చేస్తామని తెలిపారు.– డాక్టర్‌ మనోహర్, నిమ్స్‌ డైరెక్టర్‌

మరిన్ని వార్తలు