నిమ్స్‌ తరహా ఫీజుల వసూలుపై సర్కార్‌ యోచన  

18 May, 2019 01:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వాసుపత్రుల్లో సాయంత్రం ఔట్‌ పేషెంట్‌ (ఓపీ) సేవలను విస్తరించాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. అవసరమైతే నిమ్స్‌ తరహాలో సాయంత్రం వచ్చే రోగుల నుంచి నామమాత్రంగా ఫీజు వసూలు చేసే అంశాన్నీ పరిశీలిస్తోంది. ఫలితంగా రోగులకు వైద్య సేవలు విస్తరించడంతో పాటు, వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసుపై దృష్టిపెట్టకుండా నివారించొచ్చని భావిస్తోంది. అంతేకాదు సాయంత్రం ఓపీ సేవలు విస్తరిస్తే అనేకమంది రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారని సర్కారు భావిస్తోంది. ఏరియా, జిల్లా, బోధన ఆసుపత్రులన్నింటిలోనూ ఓపీ సేవలను సాయంత్రం విస్తరించే అంశంపై ఇటీవల వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

రెండు షిఫ్ట్‌ల విధానం.. 
ఉన్న వనరులతోనే ప్రభుత్వ ఆసుపత్రు లను అత్యంత మెరుగ్గా నడపాలని సర్కారు యోచిస్తోంది. ప్రస్తుతం నిమ్స్‌లో మధ్యాహ్నం వరకు ఓపీ ఉంటుంది. సాయంత్రం మళ్లీ ఓపీ నిర్వహిస్తారు. ఉదయం ఓపీ ఉచితం. సాయంత్రం మాత్రం కన్సల్టెంటు ఫీజు కింద ప్రతి రోగి నుంచి రూ.500 వసూలు చేస్తారు. అందులో సగం అంటే రూ.250 డాక్టర్‌కు ఇస్తారు. అయితే మిగిలిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ మధ్యాహ్నమే ముగుస్తుంది. అందుకే సాయంత్రం ఓపీ సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తున్నారు. వాస్తవానికి ఉద్యోగుల కోసం సాయంత్రం ఓపీ తెరవాలని గతంలోనే నిర్ణయించారు. కానీ అది అమలు కావట్లేదని అధికారులు అంటున్నారు. ఇప్పుడు ఇతరులకూ సాయంత్రం వైద్య సేవలు అందించేలా, నామమాత్రపు ఫీజు వసూలు చేసేలా చేయాలని భావిస్తున్నారు. అయితే సాయంత్రం ఓపీ పద్ధతిని కొందరు వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే సాయంత్రం ప్రైవేటు ప్రాక్టీసు ఉన్న వైద్యులకు షిఫ్ట్‌ విధానం ఇబ్బందిగా మారనుంది. 
 

మరిన్ని వార్తలు