బోర్లు కాదు.. కందకాలు తవ్వండి

21 May, 2015 02:25 IST|Sakshi
బోర్లు కాదు.. కందకాలు తవ్వండి

వర్షపు నీటిని ఒడిసిపట్టుకున్నప్పుడే
భూగర్భ జలనిధి పెరుగుతుంది
‘సాక్షి’-తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు

 
నల్లగొండ: మెట్ట ప్రాంతాలకు చెందిన రైతులు తరి పంటలు పండించేందుకు బోర్లు తవ్వకుండా కాంటూరు కందకాలను తవ్వుకోవాలని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవడమే భూగర్భ జలనిధి సంరక్షణకు ఏకైక మార్గమని వారు రైతులకు సూచించారు. ‘సాక్షి’, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక  సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం వర్షపు నీటి వినియోగంపై జిల్లాలోని పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రం, జిల్లాకేంద్రంలోని డ్వామా కార్యాలయంలో రైతులకు అవగాహన సదస్సులు జరిగాయి.

ఈ సద స్సుల్లో భాగంగా వాటర్‌షెడ్‌ల పరిధిలోని రైతాంగానికి ఇరువురు సీనియర్ ఇంజనీర్లు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు చేసే పని అవి చేసుకుంటూ వెళ్లిపోతాయని, వాటి కోసం ఎదురు చూడకుండా తమ పొలాల్లో పంటలను పండించేందుకు రైతులు స్వయంగా ఏం చేయాలనే దానిపై ఆలోచించాలని కోరారు. ప్రాజెక్టులు కట్టేంత వరకు రైతు జాతి బతికి ఉండాలంటే ప్రతి రైతూ తన పొలంలో కందకాలు తవ్వుకునేందుకు పూనుకోవాలని అన్నారు. బోర్ల జిల్లాగా పేరు పడ్డ నల్లగొండ జిల్లాలో కాగితాలపై ఎన్ని ప్రాజెక్టులున్నా, ఎన్ని వాగులు, వంకలు పారినా రైతుల పంటలకు నీళ్లు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు అనేక కారణాలున్నాయని, అయితే ఈ కారణాలను వెతుక్కుంటూ కూర్చోవడం కన్నా తానే తన పొలంలో భూగర్భ జలాలను సంరక్షించుకోవడం ద్వారా వరుసగా రెండేళ్లు కరువు వచ్చినా పంటలు పండించుకోవచ్చని చెప్పారు. ఈ కందకాల తవ్వకం ద్వారా భూగర్భ జలమట్టం పెరిగితే ఫ్లోరోసిస్ పీడ కూడా విరగడవుతుందన్నారు.

చంద్రమౌళి మాట్లాడుతూ.. వాన వచ్చినప్పుడు వచ్చే వరదను ఒడిసిపట్టుకోకుండా వరదే కదా అని వదిలేస్తే భూగర్భ జలాలు పెరగవని, అప్పుడు ఎన్ని ఫీట్లు బోర్లు వేసినా నీళ్లు పోయవని చెప్పారు. కందకాల తవ్వకం ద్వారా సాగు ఫలప్రదమవుతుందని ప్రయోగాలు చెపుతున్నాయని, కందకాలు తవ్వుకున్న రైతులు నీళ్లకు ఇబ్బందులు పడకుండా వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. ‘సాక్షి’ సాగుబడి డెస్క్ ఇన్‌చార్జి పంతంగి రాంబాబు ఈ అవగాహన సదస్సులకు సమన్వయకర్తగా వ్యవహరించగా, జడ్పీ చైర్మన్ ఎన్.బాలూనాయక్, జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ కె.దామోదర్‌రెడ్డి, విశ్రాంత ఇంజనీర్ ఎల్లారెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లాలోని 8 మండలాలకు చెందిన రైతులు ఈ సదస్సుల్లో పాల్గొన్నారు.
 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా