అనువైనది లేదు!

24 Sep, 2019 03:26 IST|Sakshi

రాష్ట్రంలోని ప్రధాన నదీజలాల్లో జలరవాణాకు అనుకూల పరిస్థితుల్లేవు

భద్రాచలం–నాసిక్‌ మార్గంపై మాత్రం ఆశాభావం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జలరవాణాకు ద్వారాలు మూసుకున్నట్లే! రోడ్డు, రైలు మార్గాల రద్దీ, పర్యావరణ సమతుల్యత దృష్ట్యా జలరవాణాకు పెద్దపీట వేయాలని కేంద్రం భావిస్తుండగా, రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేవు. బీమా, తుంగభద్ర, మంజీరా, కృష్ణాల్లో జల రవా ణాకు అనువైన పరిస్థితులు లేవని, గోదావరిలో కొంత అనుకూలత ఉందని  ఇరిగేషన్‌ శాఖ జాతీయ అంతర్గత జలరవాణా సంస్థకి నివేదిక అందించింది. అధ్యయన వివరాలు..

జలరవాణా చౌక
దేశ వ్యాప్తంగా 101 నదుల్ని జలమార్గాలుగా మార్చాలని కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. నదులను రవాణా మార్గాలుగా మార్చడం వల్ల సాధారణ ప్రజల ఆర్థిక వృద్ధి మెరుగుపడుతుందని, రోడ్డు, రైలు రవాణాతో పోల్చుకుంటే నీటి రవాణా ఎంతో తక్కువ ఖర్చుతో కూడుకున్నదని కేంద్రం చెబుతోంది. కిలో మీటరు దూరానికి నీటి రవాణా ఖర్చు 30పైసలే కాగా, రైల్వే రూపాయి, రోడ్డు రవాణా రూ.1.50 పైసలు ఖర్చు అవుతుంది. 

మంజీరా నదిపై...
మంజీరాపై సింగూర్‌ నుంచి కందకుర్తి వరకు 245 కి.మీ. జలమార్గంలో ఏడాది పొడవునా నీటి లభ్యత ఉండదు. నీటి లభ్యత ఉన్న సమయాల్లోనూ ఎప్పటికప్పుడు సాగు, తాగు అవసరాలకు మళ్లిస్తున్నందున రవాణాకు కావాల్సిన మట్టం ఉండదు. పుట్టీల ద్వారా స్థానిక రవాణా చేసే అవకాశం మాత్రమే ఉంది.

వెయిన్‌గంగ–ప్రాణహిత మార్గంలో...
వెయిన్‌గంగ–ప్రాణహిత మార్గంలోనూ జలమార్గాల అభివృద్ధికి అవసరమైన భౌగోళిక పరిస్థితులు లేవు.


ఏడింటికి ప్రతిపాదనలు
తెలంగాణలో ఏడు జాతీయ మార్గాలను కేంద్రం ప్రతిపాదించింది. ఇక్కడి జల రవాణా సాధ్యాసాధ్యాలు, హైడ్రోగ్రాఫిక్‌ అధ్యయనాలు, సాంకేతిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఐడబ్ల్యూఏఐ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. 

పెనుగంగ–వార్థా మార్గంలో
పెనుగంగ–వార్థా మార్గంలో వేసవిలో తగినంత నీటి లభ్యత ఉండదు. అవసరమైన నీటిమట్టాలను నిర్వహించాలంటే నేవిగేషన్‌ లాక్స్, బ్యారేజీని నిర్మించాల్సి ఉంటుంది. ఈ పరీవాహకంలోని పరిశ్రమల అవసరాలు, ప్రజా రవాణాకు మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో రోడ్డు, రైల్‌ మార్గాలు అనువుగా ఉన్నందున ఇక్కడ జలరవాణా అవసరం లేదు. 

భీమా, తుంగభద్ర, కృష్ణాలో..
భీమా, తుంగభద్ర నదీపరీవాహకంలో ఎక్కడా పట్టణాలు లేనందున అక్కడ ఈ మార్గాలు చేపట్టాల్సిన అవసరం లేదు. కృష్ణానదిపై వజీరాబాద్‌ నుంచి కర్ణాటకలోని గలగాలి ప్రాంతం వరకు ఏడాది పొడవునా నీటి లభ్యత ఉండదు.

రాజమండ్రి–భద్రాచలం–నాసిక్‌పైనే ఆశలన్నీ..
గోదావరిపై భద్రాచలం నుంచి ఏపీలోని రాజమండ్రి మీదుగా కాకినాడ తీరం వరకు ఒక మార్గాన్ని గతంలో ప్రతిపాదించగా, తెలంగాణలో గోదావరి పరీవాహక జిల్లాలైన వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్‌కు ప్రయోజనం లేదని తెలంగాణ ప్రభుత్వం అప్పటి కేంద్ర నౌకాయాన మంత్రి గడ్కరీ దృష్టికి తెచ్చింది. దీంతో భద్రాచలం–మహారాష్ట్రలోని నాసిక్‌  మార్గాన్ని అధ్యయనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై ప్రస్తుతం అధ్యయనం సాగుతోంది.

మరిన్ని వార్తలు