పెట్రోల్, డీజిల్‌ వాహనాల నిషేధం అక్కర్లేదు

24 Sep, 2019 03:18 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ వాహన విక్రయాలు సహజంగానే పెరుగుతున్నాయి

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌ వాహనాలను నిషేధించాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ. ఎలక్ట్రిక్‌ వాహన (ఈవీ)విక్రయాలు సమజంగానే ఊపందుకుంటున్నాయని చెప్పారు. వచ్చే రెండేళ్లలో అన్ని బస్సులు ఎలక్ట్రిక్‌ రూపంలోనే ఉంటాయన్నారు. 2030 తర్వాత దేశంలో ఈవీ విక్రయాలనే అనుమతించాలన్నది నీతి ఆయోగ్‌ సిఫారసు. 150సీసీలోపు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను 2025 తర్వాత ఈవీ రూపంలో అనుమతించాలని కూడా సిఫారసు చేసింది. కాకపోతే మంత్రులు గడ్కరీ, ధర్మేంద ప్రధాన్‌ వంటి వారు తర్వాత ఈ ప్రతిపాదనలను ఖండించారు. ఎంఎస్‌ఎంఈల్లో ఇంధన సామర్థ్యం అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన జాతీయ సదస్సులో సోమవారం పాల్గొన్న సందర్భంగా మంత్రి గడ్కరీ ఈ అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు.

‘‘ఎలక్ట్రిక్‌ కార్లు, బైక్‌లు, బస్సుల అమ్మకాలు సహజంగానే పెరుగుతున్నాయి. వాటి అమ్మకాలను తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదు. అలాగే, పెట్రోల్, డీజిల్‌ వాహనాలను నిషేధించాల్సిన అవసరం కూడా లేదు. రెండేళ్లలో అన్ని బస్సులు ఎలక్ట్రిక్, బయో ఎథనాల్, సీఎన్‌జీతో తిరిగేవే ఉంటాయి’’ అని గడ్కరీ వివరించారు. వ్యవసాయ వ్యర్థాలు (వరిగడ్డి వంటివి) వంటి వాటితో విద్యుత్తును తయారు చేసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ఆ విద్యుత్తును వాహనాలకు వినియోగించుకోవడం ద్వారా, రైతుల ఆదాయం పెంచుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఈ గడ్డిని రైతులు వృథాగా కాల్చేస్తున్నారని, దీనివల్ల వాయు, భూ కాలుష్యం పెరుగుతున్నట్టు చెప్పారు. ఎన్‌టీపీసీ సంస్థ ద్వారా ఇప్పటికే ఈ తరహా వ్యర్థాల సమీకరణను ప్రారంభించినట్టు తెలిపారు.  

ఎంస్‌ఎంఈలకు తక్కువ రేటుకు రుణాలు
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈలు) తక్కువ రేటుకే రుణాలు అందించేందుకు గాను ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నట్టు నితిన్‌ గడ్కరీ తెలిపారు. ‘‘అధిక మూలధన వ్యయ సమస్య ఉంది. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు 2–3 శాతంగా ఉన్నాయి. కొన్ని దేశాల్లో అయితే ఒక్క శాతమే. కానీ, మన దేశంలో ఎంఎస్‌ఎంఈ రుణాలపై 11–14 శాతం వరకు వడ్డీ రేట్లు అమలవుతున్నాయి. నిధుల వ్యవయాలను తగ్గించాల్సిన అవసరం ఉంది’’ అని వివరించారు. రవాణా వ్యయాలను తగ్గించగలిగితే ఎగుమతులు ప్రస్తుత స్థాయికి రెట్టింపునకు పైగా పెరుగుతాయన్నారు.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా