రేవంత్‌పై నాన్‌బెయిలబుల్ కేసు

1 Jun, 2015 02:56 IST|Sakshi
రేవంత్‌పై నాన్‌బెయిలబుల్ కేసు

మీడియాతో ఏసీబీ డీజీ ఏకే ఖాన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రూ.50 లక్షలతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ డీజీ ఎ.కె.ఖాన్ తెలిపారు. ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీఫెన్‌సన్ రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగి ట్రాప్ చేసినట్లు తెలిపారు. ‘‘రేవంత్‌రెడ్డి ప్రలోభపెడుతున్నారంటూ మాకు వచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీతో విచారణకు ఆదేశించాం. ఆదివారం రేవంత్ రూ.50 లక్షలు స్టీఫెన్‌సన్‌కు ఇస్తూ పట్టుబడ్డారు. రేవంత్‌తో పాటు, డబ్బు లు తెచ్చిన బిషప్ సెబాస్టియన్ హరి, ఉదయ్‌సింహలను అదుపులోకి తీసుకున్నాం.
 
 అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 12, ఐపీసీ సెక్షన్ 120డి, 34 (లంచం ఇవ్వజూపడం, మూకుమ్మడిగా ప్రలోభానికి గురిచేయడం) కింద కేసు నమోదు చేసుకుని అరెస్టు చేశాం. వీరితోపాటు, ఇంతకు ముందు ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఈ డీల్ గురించి మాట్లాడిన మాథ్యూస్ జెరూసలం అనే వ్యక్తిపైనా కేసు నమోదు చేశాం. అతను మా అదుపులో లేడు. రూ.50 లక్షలు కూడా రికవరీ చే శాం’’ అని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పంపిస్తేనే వచ్చానన్న రేవంత్ వ్యాఖ్యలపై విచారణలో అన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు. ‘‘సాక్షాలన్నీ దొరికాయి. వాటిని, ప్రాథమిక ఆధారాలను పరిశీలించాకే కేసు నమోదు చేశాం. విచారణ అనంతరం రేవంత్‌ను జడ్జి ముందు ప్రవేశపెడతాం’’ అని వివరించారు. స్వాధీనం చేసుకున్న మొత్తం ఎక్కడినుంచి వచ్చిందనేది కూడా విచారణలో తెలుస్తుందన్నారు.
 
 డీజీపీని కలిసిన టీడీపీ నేతలు: రేవంత్ అరెస్టు నేపథ్యంలో టీడీపీ నేతలు ఎర్రబెల్లి తదితరులు డీజీపీ అనురాగ్‌శర్మను కలిశారు. న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్‌ను చంపే కుట్ర జరుగుతోందని, కావాలనే కేసులో ఇరికించారని ఫిర్యాదు చేశారు. కాగా చంద్రబాబు అందుబాటులో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.

మరిన్ని వార్తలు