కొందరికే వెలుగు

20 Jan, 2019 12:53 IST|Sakshi

గీసుకొండ(పరకాల): కంటి వెలుగు పథకం కొందరికే వెలుగునిచ్చింది.. పరీక్షలు చేసి చేతులు దులుపుకోవడమే వైద్యాధికారులకు అలవాటుగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరి చూపును కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విధితమే. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన ఈ కార్యక్రమం అనుకున్న రీతిలో ముందుకు సాగడం లేదు. కంటి పరీక్షలు చేయించుకుని కంటి అద్దాలు, ఆపరేషన్లు అవసరం ఉన్న వారు వాటి కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. పీహెచ్‌సీలు, హెల్త్‌ సబ్‌సెంటర్లతో పాటు గ్రామాల్లోని ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్ల చుట్టూ తిరుగుతున్నారు.  కంటి వెలుగు కార్యక్రమం ద్వారా నేత్ర పరీక్షలు నిర్వహించి అద్దాలు, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని అధికారులు చెప్పడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిం చింది.

గత ఏడాది ఆగస్టులో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కంటి పరీక్షలు చేయించుకోవడానికి జనం కంటి వెలుగు శిబిరాలకు అధికంగా వస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా పరీక్షలు చేయించుకున్న వారికి అద్దాలను పంపిణీ చేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. ముఖ్యంగా వృద్ధుల నుంచి శిబిరాలకు విశేష స్పందన కనిపిస్తోంది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు, సిబ్బంది చీటీలను బాధితుల చేతిలో పెట్టి ఆపరేషన్ల గురించి ఊసెత్తడం లేదు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళితే వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని కంటి వెలుగు శిబిరాలపై ఆశలు పెట్టుకున్న వారి నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోలేక పోతోంది.

జిల్లా వ్యాప్తంగా ‘కంటి వెలుగు’లెక్క..
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమాచారం మేరకు జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 2,72,758 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 1,10,729 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో దూరదృష్టి లోపం ఉన్నవారు 38,139 మంది కాగా కేవలం 13,867 మందికి కంటి అద్దాలు(ప్రిస్కిప్షన్‌ గ్లాసెస్‌) ఇప్పటివరకు పంపిణీ చేశారు. అలాగే 50,895 మందికి రీడింగ్‌ గ్లాసెస్‌ పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. కాగా కంటి ఆపరేషన్ల కోసం జిల్లాలో 21,695 మంది ఎదురు చూస్తున్నారు. వీరిలో కొందరు వరంగల్‌ ప్రాంతీయ కంటి ఆస్పత్రిలో ఆపరేషన్లు చేయించుకున్నారని, అధికారులు చెబుతున్నా వారి వద్ద వీటికి సంబంధించిన సమాచారం లేదు. జయ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు వికటించడంతో ప్రభుత్వం ఆపరేషన్ల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అందుకే తొందరపడి ఆపరేషన్లు చేయించడం లేదని, పరీక్షల శిబిరాలు ముగిసిన తర్వాత నిపుణులైన వైద్యుల టీంలను ఏర్పాటు చేసి విడతల వారిగా ఆపరేషన్లు చేయిస్తామని చెబుతున్నారు.

ఫిబ్రవరి మొదటి వారం వరకు ‘కంటి వెలుగు’
కంటి వెలుగు కార్యక్రమాన్ని ఫిబ్రవరి మొదటి వారం వరకు కొనసాగిస్తాం. అన్ని గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలను పూర్తి చేస్తాం. దూరపు చూపు కంటి అద్దాల పంపిణీ గ్రామాల్లో లబ్దిదారులకు విడతల వారిగా జరుగుతోంది. ఆపరేషన్ల విషయంలో నిపుణులైన వైద్యులతో టీంలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఆపరేషన్లు చేయిస్తాం. – డాక్టర్‌ సీహెచ్‌.మధుసూదన్, డీఎంహెచ్‌ఓ 

>
మరిన్ని వార్తలు