ఎన్టీపీసీ.. స్థలాన్వేషణ

15 Jul, 2014 03:01 IST|Sakshi
ఎన్టీపీసీ.. స్థలాన్వేషణ

4వేల మెగావాట్ల    విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు
అంతర్గాంలో వేరుు      ఎకరాల ప్రభుత్వ భూమి
 సింగరేణిభూమి వినియోగంపై   అనుమానాలు

 
 గోదావరిఖని :
 రామగుండంలో కొత్తగా నిర్మించనున్న 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల కోసం ఎన్టీపీసీ యాజమాన్యం స్థలసేకరణ మొదలుపెట్టింది. ఇటీవల హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎన్టీపీసీ సీఎండీ అరూప్‌రాయ్ చౌదరి కలిసి రామగుండంలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. తొలి ప్లాంట్‌ను 39 నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఎక్కడ ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలనే విషయమై ఎన్టీపీసీ యాజమాన్యం స్థలసేకరణ కోసం అన్వేషణ ప్రారంభించింది. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఐదు ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సుమారు నాలుగు వందల ఎకరాల స్థలం అవసరమవుతుంది. రామగుండంలోని ప్రస్తుత ఎన్టీపీసీ ప్లాంట్‌కు సమీపంలోనే ఈ స్థలాన్ని సేకరించేందుకు అధికారులు నిర్ణయించారు. మండలంలోని అంతర్గాంలో వెయ్యి ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంది.

అందులో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయాలనే ఆలోచన తో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ స్థలంలో ఎన్టీపీసీ ప్లాంట్లు పెడితే అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అది కుదరని పక్షంలో సింగరేణి స్థలాన్ని ఇందుకు వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అవసరమైతే ప్రభుత్వపరంగా సింగరేణి స్థలాన్ని ఇప్పించేందుకు సిద్ధమని సీఎం కేసీఆర్ ఎన్టీపీసీ అధికారులకు హామీ ఇచ్చారు. ఒకవేళ ఆ అవసరం వస్తే మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో బొగ్గు వెలికితీసిన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఓసీపీ జీవితకాలం మరో ఆరేళ్లుంది. దానిని కేటాయించేందుకు ఇప్పుడే హామీ ఇస్తారా అన్న అనుమానంగా ఉంది. సదరు స్థలాన్ని కేటాయించినట్లయితే.. ఓసీపీలో భూగర్భంలో మట్టిని వెలిసితీసేందుకు పేలుడు పదార్థాలను ఉపయోగించడంతో భూమి పొరల్లో గట్టితనం ఉండదు. మందుగుండు పేలుడు ధాటికి మట్టి పలుచగా మారిపోతుంది. బొగ్గును వెలికితీసిన తర్వాత ఏర్పడిన గొయ్యిలో మట్టిని నింపినప్పటికీ గట్టితనం ఉండదు. విద్యుత్ ప్లాంట్ నిర్మాణం ఇలాంటి భూమిలో చేపట్టడం సాధ్యపడదు. విద్యుత్ ప్లాంట్‌లో చిమ్నీలు, బాయిలర్లు, ఇతర ఎత్తై కట్టడాలను నిర్మించాలంటే భూమి గట్టితనంతో ఉండాలి. దీంతో ఎన్టీపీసీ అధికారులు మేడిపల్లి ప్రాంతంలోని భూమిని తిరస్కరించే అవకాశాలున్నాయి. ఒకవేళ సింగరేణి సంస్థ ద్వారా మైనింగ్ జరిగిన ప్రాంతంలో కాకుండా కొత్త ప్రాంతంలో భూసేకరణ జరిపించి ఎన్టీపీసీకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటే భూసేకరణ సింగరేణికి సమస్యగా మారింది. భూగర్భంలో బొగ్గునిక్షేపాలున్న చాలాచోట్ల భూసేకరణకు స్థానిక ప్రజలకు అడ్డుచెప్పడంతో బొగ్గుగనులు, ఓసీపీలను యాజమాన్యం ప్రారంభించలేకపోతోంది. ఈ తరుణంలో సింగరేణి సంస్థకు 400 ఎకరాలు సేకరించడం తలనొప్పిగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ తరుణంలో ఎన్టీపీసీ యాజమాన్యమే తమకు అనుకూలంగా ఉండే ప్రాంతం కోసం ఇప్పటినుంచే రహస్యంగా అన్వేషణ మొదలుపెట్టింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఎన్టీపీసీ యాజమాన్యం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
 
 

మరిన్ని వార్తలు