Hydrogen Bus: కొత్త రకం బస్సు.. దేశంలో తొలిసారి 

19 Aug, 2023 20:59 IST|Sakshi

దేశంలో ఇప్పటి వరకూ ఎన్నో రకాల బస్సులను చూశాం. డీజిల్‌ నడిచే బస్సులతోపాటు ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్‌ బస్సులు కూడా పెరుగుతున్నాయి. అయితే దేశంలో తొలిసారిగా కొత్త రకం బస్సు పరుగులు తీయనుంది. అదే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సు. అత్యంత ఎత్తైన హిమాలయాల్లోని లేహ్ రోడ్లపై తిరగనుంది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్‌ను ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) చేపట్టింది.

కార్బన్-న్యూట్రల్ లడఖ్‌ను సాధించే దిశగా ఎన్‌టీపీసీ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్, సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. లేహ్ ఇంట్రాసిటీ రూట్లలో ఆపరేషన్ కోసం ఐదు ఫ్యూయల్ సెల్ బస్సులను అందజేస్తున్నట్లు కంపెనీ ప్రకటన తెలిపింది. మూడు నెలలపాటు ఉండే ఫీల్డ్ ట్రయల్స్, రోడ్‌వర్తీనెస్ టెస్ట్‌లు, ఇతర చట్టబద్ధమైన ప్రక్రియల్లో భాగంగా మొదటి హైడ్రోజన్ బస్సు ఆగస్టు 17న లేహ్‌కు చేరుకుంది.

దేశంలో హైడ్రోజన్ ఇంధన బస్సులను వినియోగించడం ఇదే మొదటిసారి. 11,562 అడుగుల ఎత్తులో గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా 1.7 మెగావాట్ల ప్రత్యేక సోలార్ ప్లాంట్‌ను ఎన్టీపీసీ ఏర్పాటు చేసింది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో ప్రతికూల వాతావరణానికి సరిపోరిపోయేలా ఈ బస్సులను రూపొందించారు. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించి గ్రీన్‌ హైడ్రోజన్‌ టెక్నాలజీలో అగ్రగామిగా నిలవాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ బస్సుల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను 2020 ఏప్రిల్‌లో దక్కించుకున్న అశోక్ లేలాండ్ సంస్థ.. ఒక్కొక్కటి రూ. 2.5 కోట్లకు అందజేసింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ బస్సుల్లో ఛార్జీలు సాధారణ డీజిల్ బస్సుల్లో ఛార్జీల మాదిరిగానే ఉంటాయి. దీనివల్ల వాటిల్లే నష్టాన్ని ఎన్టీపీసీనే భరించనుంది.

మరిన్ని వార్తలు