ఎన్టీఆర్‌ పురస్కారానికి ‘నగెన్‌’ ఎంపిక

3 May, 2019 01:51 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న లక్ష్మీపార్వతి. చిత్రంలో కేవీ రమణాచారి తదితరులు 

ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ అస్సామీ కథకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, అస్సామీ పత్రికల సంపాదకుడు ‘నగెన్‌ సైకియా’ను 2019 ఎన్టీఆర్‌ జాతీయ సాహితీ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ నందమూరి లక్ష్మీ పార్వతి వెల్లడించారు. ట్రస్ట్‌ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారితో కలిసి ఆమె గురువారం లక్డీకాపూల్‌లోని సెంట్రల్‌ కోర్టు హోటల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2006లో ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్ట్‌ను స్థాపించామని తెలిపారు. 2007 నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 26 భాషల్లోని ప్రముఖులకు ఏటా పురస్కారాలు అందిస్తున్నామన్నారు.

గతంలో ఎస్‌ఎల్‌ ఖైరప్ప (కన్నడం), సచ్చిదానందన్‌ (మలయాళం), అశోక్‌ మిత్రన్‌ (తమిళం), మహా శ్వేతాదేవి (బెంగాలీ), మనోజ్‌ దాస్‌ (ఒరియా), నేమాడి బాలచందర్‌ (మరాఠీ), జిలానీ బానో (ఉర్దూ), డాక్టర్‌ రఘువీర్‌ చౌదరి (గుజరాతీ) తదితరులను ఎంపిక చేశామని పేర్కొన్నారు. తెలుగుకు సంబంధించి ఆవత్స సోమసుందరం, రవ్వా శ్రీహరి, డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, కాళీపట్నం రామారావు తదితర భాషా సాహితీవేత్తలకు పురస్కారాలు అందజేశామన్నారు. కేవీ రమణాచారి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ జయంతి రోజైన ఈ నెల 28న నగెన్‌ సైకియాకు పురస్కారాన్ని ప్రదానం చేస్తామని తెలిపారు. పురస్కారం కింద రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రంతో పాటు, జ్ఞాపికను బహూకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతల సంఘం అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, న్యాయ నిర్ణేతల సంఘం సభ్యులు  డాక్టర్‌ సూర్య ధనుంజయ్, డాక్టర్‌ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు