ఎక్కడో...ఏమో!

28 May, 2015 01:28 IST|Sakshi
ఎక్కడో...ఏమో!

- ఓటర్ల కోసం అధికారుల వెదుకులాట
- చిరునామా మార్పులు, ఇళ్లకు తాళాలు
- జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్ నెం:040-21111111
సాక్షి, సిటీబ్యూరో:
నిన్నమొన్నటి వరకూ బంజారాహిల్స్‌లో ఉన్న ఓ కుటుంబం... ప్రస్తుతం దిల్‌సుఖ్‌నగర్‌కు మారింది. చింతల్‌లో ఉన్న మరో కుటుంబం ఇంటికి తాళాలు కనిపిస్తున్నాయి. వారు ఎక్కడికెళ్లారో తెలుసా అని చుట్టు పక్కల వారిని అడిగితే... ‘మాకేం తెలుసు?’ అనే సమాధానం వినిపిస్తోంది... ఈ ‘లెక్క’ తేల్చేదెలాగో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇదీ జీహెచ్‌ఎంసీలోని ఓటర్ల  తీరు. అధికారిక లెక్కల ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య 83.78 ల క్షలు. వారిలో 10.03 లక్షల మంది చిరునామాలు మారాయి. వారెక్కడున్నారో కనుక్కోలేక అధికారులు తిప్పలు పడుతున్నారు. ఇళ్లకు తాళాలు వేసిన వారు మరో 2.90 లక్షల మంది. వీరు నగరం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయారా? తాత్కాలికంగా ఇతర ప్రదేశాలకు వెళ్లారా? అన్నది తెలుసుకోలేక సతమతమవుతున్నారు.

ఫోన్‌లో సమాచారం....
డిసెంబర్‌లోగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించనుండడంతో లోటుపాట్లకు తావులేకుండా ఓటరు జాబితా రూపొందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఓటరు ఐడీ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నారు. నగరంలో ఆధార్ కార్డులు లేని వారు ఇంకా 99 వేల మంది ఉన్నారు. చిరునామాలు మారినవారు, ఇళ్లకు తాళాలు వేసిన వారు దాదాపు 13 లక్షల మంది ఉన్నారు. వీరిని జాబితా నుంచి తొలగించేందుకు తర్జనభర్జనలు పడుతున్నారు.

ఒకవేళ తొలగిస్తే మళ్లీ ఫిర్యాదులొస్తాయనే తలంపుతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాళాలు వేసిన ఇళ్లను మూడు పర్యాయాలు పరిశీలించాలని... చిరునామా మారిన వివరాలు సైతం బహిరంగంగా ప్రకటించాకే... జాబితాలోంచి తొలగించాలని ఉన్నతాధికారుల నుంచి ఇటీవలే స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో ప్రస్తుతానికి తొలగింపు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.

మొత్తం పరిశీలన పూర్తయ్యాక ఫోన్ నెంబర్లు ఉంటే ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారమిచ్చి, లేని పక్షంలో స్థానిక ఎన్నికల కార్యాలయాల్లో ప్రదర్శించి... ఆ తర్వాతే చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. వచ్చే నెల 10వ తేదీలోగా ఈ కార్యక్రమాలు పూర్తిచేయాలని భావిస్తున్నప్పటికీ... జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఆధార్‌తో అనుసంధానంపై ప్రజల సందేహాల నివృత్తికి జీెహ చ్‌ఎంసీ కాల్ సెంటర్ నంబర్ 040-21 11 11 11 అందుబాటులోకి తెచ్చారు.

మరిన్ని వార్తలు