మే 9నుంచి ‘ప్రాజెక్టుల బాట’

28 Apr, 2015 04:27 IST|Sakshi

- బీజేపీ జాతీయ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్:
తెలంగాణ జిల్లాల్లోని ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మే 9 నుంచి ప్రాజెక్టుల బాట కార్యక్రమం ప్రారంభిస్తానని బీజేపీ జాతీయ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నాగర్‌కర్నూలు మార్కెట్ యార్డులోని గోపాల్‌రెడ్డి స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ సమావేశాల కోసం ఆర్టీసీ బస్సులను తీసుకెళ్లి సామాన్య ప్రజలకు ఇక్కట్లు కలిగించటం ఎంతవరకు సమంజసమన్నారు. రెండురోజుల క్రితం నిర్వహించిన టీఆర్‌ఎస్ ప్లీనరీతో జనాలకు ఒరిగిందేమీ లేదని, కేసీఆర్ ప్రసంగం ఆవు కథ మాదిరిగా ఉందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, కరెంట్‌తో ప్రజలను హిప్నటైజ్ చేస్తున్నారని అన్నారు. పోయిన రబీలో రైతులు 8.25 లక్షల హెక్టార్లలో పంట సాగుచేస్తే ఈ రబీలో 4.37 లక్షల హెక్టార్లలో సాగు చేశారని, దీంతో కరెంట్ వాడకం సగం తగ్గిందని అన్నారు. ముందస్తుగా టీఆర్‌ఎస్ నాయకులు కరెంట్ కష్టాలు తప్పవన్న ప్రకటనలతో రైతులు భయపడి పంటలను సాగు చేయలేదన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మించాలని, ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మిషన్ కాకతీయ పథకం మంచిదే అయినా చెరువులు ఎలా నిండుతాయో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.

మిషన్ కాకతీయ ద్వారా తీసిన మట్టిని ఇటుక వ్యాపారులకు అమ్ముకుంటున్నారన్నారు. మిషన్ కాకతీయ పథకంలో జరిగే అవినీతితో టీఆర్‌ఎస్ పార్టీ అంతం కాక తప్పదని అన్నారు. ఏ వాగ్దానాలపై గెలిచారో వాటిని పక్కన పెట్టి కమీషన్ల పథకాలు కొనసాగిస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్ల కోసమే ఈ  ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ అవలంభిస్తున్న విధానాలతో బర్‌బాత్ తెలంగాణ అవుతుందని అన్నారు. సమావేశంలో సింగిల్‌విండో చైర్మన్ వెంకట్రాములు, బీజేపీ నాయకులు అర్ధం రవి, అర్జునయ్య, షఫి, నసీర్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు