తొమ్మిది గంటలే !

31 Jan, 2018 15:36 IST|Sakshi
మెండోరా శివారులో కాకతీయ కాలువకు అమర్చిన పంపుసెట్లు, పైప్‌లైన్‌

కాకతీయ కాలువపై ఫీడర్‌లకు విద్యుత్‌ సరఫరా కుదింపు

నీటిపారుదల, విద్యుత్‌ అధికారుల మధ్య అవగాహన

కాలువ నుంచి నీటి తరలింపునకు పంపుసెట్లను అమర్చుకున్న రైతులు

24 గంటల విద్యుత్‌తో పెరిగిన నీటి వినియోగం

దిగువ ప్రాంతానికి తగ్గిపోతున్న నీరు 

మోర్తాడ్‌/బాల్కొండ : కాకతీయ కాలువకు ఇరువైపులా ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లకు సంబంధించిన ఫీడర్‌లకు 24 గంటలకు బదులు తొమ్మిది గంటల విద్యుత్‌ను సరఫరా చేయా లని ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు నిర్ణయించారు. భారీ నీటిపారుదల శాఖ అధికారులు, విద్యుత్‌ అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు రెండు రోజుల నుంచి వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లకు పగటి పూట తొమ్మిది గంటలు మాత్రమే విద్యుత్‌ అందిస్తున్నారు. రబీ సీజను కోసం శ్రీరాంసాగర్‌ ప్రాజె క్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా ఉమ్మడి కరీంనగర్, వరంగల్‌ జిల్లాలకు నీటి సరఫరా కొనసాగుతోంది. అయితే కాకతీయ కాలువ పరిసరాల్లోని వ్యవసాయ క్షేత్రాలకు సాగునీటిని అందించుకోవడానికి రైతులు కాలువకు పంపుసెట్లను అమర్చుకున్నారు.

గతంలో షిఫ్టింగ్‌ విధానంలో వ్యవసాయానికి రోజు తొమ్మిది గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేసేవారు. అలాంటి సమయంలో విద్యుత్‌ సరఫరా ఉన్నప్పుడు మాత్రమే కాకతీయ కాలువ నుంచి రైతులు నీటిని పంట పొలాలకు తరలించేవారు. ఇప్పుడు 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరా కొనసాగుతుండటంతో పంపుసెట్లు నిరంతరం పని చేస్తున్నాయి. కాలువకు దగ్గర ఉన్న పంట పొలాలకే కాకుండా దూరంగా ఉన్న పంట పొలాలకు కూడా పైప్‌లైన్‌ను వేసుకుని రైతులు నీటిని సరఫరా చేసుకుంటున్నారు. దీంతో ఎక్కువ నీరు స్థానికంగానే వినియోగం అవుతోంది. ఇటీవల నాలుగు టీఎంసీల నీటిని కాకతీయ కాలువ ద్వారా విడుదల చేస్తే ఉమ్మడి కరీంనగర్, వరంగల్‌ జిల్లాలకు ఒక్కటే టీఎంసీ నీరు చేరినట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి నీరు చేరే సరికి పరిమాణం తగ్గిపోవడంతో ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు.

దీనికి కారణం కాకతీయ కాలువపై కొందరు రైతులు పంపుసెట్లు ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా నీటిని సరఫరా చేసుకోవడమే కారణం అని గుర్తించిన అధికారులు 24 గంటల విద్యుత్‌కు బ్రేక్‌ వేయాలని భావించారు. కాలువ వెంట రైతులు ఏర్పాటు చేసుకున్న పంపుసెట్లను తొలగిస్తే తీవ్ర వ్యతిరేకత  వచ్చే అవకాశం ఉంది. పంపుసెట్లను తొలగించడం కంటే విద్యుత్‌ సరఫరాను నియంత్రించడమే మేలు అని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. విద్యుత్‌ అధికారులతో చర్చించారు. జిల్లాలోని మెండోరా, ముప్కాల్, ఏర్గట్ల, కమ్మర్‌పల్లి మండలాల్లోని పలు గ్రామాల రైతాంగం కాకతీయ కాలువపై జీవీసీ–1 పరిధిలో సుమారు 2300 పంపుసెట్లను ఏర్పాటు చేసుకుని రైతులు నీటిని సరఫరా చేసుకుంటున్నారు. దాదాపు 20 విద్యుత్‌ ఫీడర్‌ల నుం చి విద్యుత్‌ సరఫరా అవుతోంది.ఈ ఫీడర్‌ల ద్వారా సరఫరా అయ్యే విద్యుత్‌ను అధికారులు కుదించారు. ప్రస్తుత యాసంగిలో కాకతీయ ద్వార ఎల్‌ఎండీ వర కు 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని అధి కారులు ప్రకటించారు. కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగిన అన్ని రోజుల పాటు తొమ్మిది గంటలు మాత్రమే విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు.  రైతులు అంగీకారం తెలపడం విశేషం.

పంపు సెట్లు ఎందుకు...
కాకతీయ కాలువకు పంపు సెట్లను అమర్చుకునే అవకాశం రైతులకు ఎందుకు ఇచ్చారంటే... కాలువ నిర్మాణంలో ఆయా గ్రామాలకు చెందిన చెరువులు రెండు వైపులా చీలి పోయాయి. దీంతో ఆయకట్టుకు నీటి వనరుల సౌకర్యం లేకుండా పోయింది. అంతే కాకుం డా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి లిప్టులను నిర్మిస్తుంది. ఇక్కడ ఎలాంటి లిప్టులు అవసరం లేకుండానే రైతులు స్వచ్ఛందంగా పంపు సెట్లు నిర్మించుకుని ఆయకట్టుకు నీటి సరఫరా చేసుకుంటున్నారు. పంపు సెట్లకు నిరంతరం నీటి సరఫరా కోసం కాకతీయ కాలువ ద్వార నిరంతరం లీకేజీ నీటి సరఫరా చేయాలని గతంలో ప్రత్యేక జీవో కోసం రైతులు ధర్నాలు చేశారు. అప్పటి పాలకులు ప్రత్యేక కృషి చేశారు. 50 క్యూసెక్కుల నీరు నిరంతరం నీటి సరఫరా చేయడానికి జీవో కూడ జారీ అయినట్లు అప్పటి పాలకులు ప్రచారం సైతం చేశారు.  
అధికారుల ఆదేశాల మేరకే ..
కాకతీయ కాలువ వెంట ఉన్న ఫీడర్‌లకు రోజుకు తొమ్మిది గంటల పాటు మాత్రమే విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. అధికారుల ఆదేశాలను పాటించి విద్యుత్‌ సరఫరా కుదించాం. రైతులు కూడా సహకరిస్తున్నారు.
– బాబా శ్రీనివాస్, ఏఈ, ఎన్‌పీడీసీఎల్‌ ఏర్గట్ల సెక్షన్‌

 

మరిన్ని వార్తలు