'ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవు'

25 Oct, 2015 19:25 IST|Sakshi
సాక్షి, హైదరాబాద్ : అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్ధిని గెలిపిస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్, టీడీపీలకు అభ్యర్ధులే దొరకడం లేదని, ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా భాన్సువాడ నియోజవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కార్యకర్తలను ఉద్ధేశించి మంత్రి ప్రసంగించారు. 
 
వరంగల్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్, టీడీపీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలు ఎన్ని రాజకీయ ఎత్తుగడలు వేసినా తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన అభిప్రాయ పడ్డారు. సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తున్నామని, ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా అభివృద్ధి పథకాలు తీసుకున్నామని, సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని మంత్రి పోచారం పేర్కొన్నారు. నారాయణ ఖేడ్ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లోనూ విజయం టీఆర్‌ఎస్‌దే అని ఇప్పటికే అన్ని గ్రామాలూ మద్దతు పలుకుతున్నాయని మంత్రి వివరించారు. 
మరిన్ని వార్తలు