ఆస్పత్రి బయటే మహిళ ప్రసవం

9 Dec, 2018 12:21 IST|Sakshi
చికిత్స పొందుతున్న తల్లి, బాబు

గైనకాలజిస్ట్‌ అందుబాటులో లేరని నల్లగొండకు రిఫర్‌సాగర్‌ ఆస్పత్రి వద్ద ఘటన

గైనకాలజిస్ట్‌ అందుబాటులో లేడని నల్లగొండకు రెఫర్‌ చేసిన డ్యూటీ డాక్టర్‌

సాగర్‌ కమలానెహ్రూ ఆస్పత్రిలో ఘటన

సాక్షి, నాగార్జునసాగర్‌ : ఆస్పత్రి ఆరుబయటే ఓ మహిళ ప్రసవించింది. పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి ఇక్కడ కాన్పు చేయలేమని నల్లగొండకు తీసుకెళ్లాలని సిబ్బంది చెప్పడంతో.. వారు ఆసుపత్రి బయటకు రాగానే అక్కడే కాన్పు అయ్యింది.

ఈ సంఘటన నాగార్జునసాగర్‌ కమలా నెహ్రూ ఆస్పత్రి వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండలం జాల్‌తండాకు చెందిన విమోజకు శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు సాగర్‌ తీసుకొచ్చారు. డ్యూటీలో ఉన్న డాక్టర్‌ అరవింద్‌ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌ లేడని.. గర్భిణి విమోజ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని నల్లగొండకు తీసుకెళ్లాలని రెఫర్‌ చేశాడు.

ఆమె నొప్పి ఎక్కువగా ఉందని చెప్పినా.. డాక్టర్, సిబ్బంది పట్టించుకోకుండా నల్లగొండకు వెళ్లమని ఒత్తిడి చేశారు. వారు ఆస్పత్రి బయటకు వెళ్లగానే నొపులు ఎక్కువై అక్కడే కాన్పు అయ్యింది. మగబిడ్డకు జన్మనిచ్చింది. తండాకు చెందిన ఆడవాళ్లే కాన్పు చేశారు. అనంతరం తల్లీ బిడ్డను ఆస్పత్రిలోకి అనుమతించారు. పురిటి నొప్పులతో ఇబ్బందులు పడుతున్నా.. కనికరం చూపని డాక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భర్త మోతీలాల్‌ డిమాండ్‌ చేశారు.

ఈ ఘటనపై డాక్టర్‌ అరవింద్‌ను వివరణ కోరగా.. తల్లి వద్ద రక్తం సరిపోయేంత లేకపోవడంతో పాటు గైనకాలజిస్ట్‌ అందుబాటులో లేకపోవడంతోనే నల్లగొండకు రెఫర్‌ చేసినట్లు తెలిపారు. అంబులెన్స్‌ మాట్లాడి తీసుకెళ్లడం ఆలస్యం కావడంతో ఇక్కడే డెలివరీ అయ్యిందని ఆ సమయంలో మా సిబ్బందిని వారు దగ్గరకు రానివ్వలేదని పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు