ఓటేసింది @ 9,33,124

9 Dec, 2018 12:19 IST|Sakshi

జిల్లావ్యాప్తంగా 85.98 శాతం పోలింగ్‌

ఈసారి అత్యధికంగా ఓట్లు వేసిన మహిళలు

ఇతరులు 76 మంది ఉండగా..ఓటేసింది ఒక్కరే..

ఫలించిన ఎన్నికల కమిషన్‌ ప్రచారం  

సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 9,33,124 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం జరిగిన పోలింగ్‌లో ఓటర్లు తమ చైతన్యాన్ని చూపారు. పురుషుల కన్నా మహిళలు కొంతమేరకు ఎక్కువ మంది ఓట్లు వేశారు. ఎన్నికల కమిషన్‌ విస్తృతంగా నిర్వహించిన చైతన్య, అవగాహన కార్యక్రమాలు బాగానే పనిచేశాయని చెప్పొచ్చు. దీంతో ఓటు హక్కు విలువ తెలుసుకున్న ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి కనబరిచారు.  
జిల్లావ్యాప్తంగా 10,85,179 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 9,33,124 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 85.98 శాతం పోలింగ్‌ నమోదైంది. గత 2014 ఎన్నికలతో పోలిస్తే ఎక్కువగా జరిగినట్లే లెక్క. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో 81.28 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికల్లో పురుషులు 4,57,761 మంది ఓటు వేయగా.. మహిళలు 4,75,362 మంది ఓటు వేశారు. అయితే ఇతరులు 76 మంది ఉండగా.. కేవలం ఒక్కరు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
ఓటర్లలో చైతన్యం.. 
ఈ ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పురుషులు 5,32,499 మంది ఉండగా.. 4,57,761 మంది ఓటు వేశారు. అంటే 85.96 శాతం మంది పురుషులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మహిళలు 5,52,604 మంది ఉండగా.. వారిలో 4,75,362 మంది ఓటు వేశారు. అంటే 86.02 శాతం మంది ఓటు వేశారు. ఇదిలా ఉండగా.. ఇతరులు 76 మంది ఉండగా.. వీరిలో కేవలం ఒక్కరు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధిరలో ఆ ఒక్క ఓటు వేశారు. ఎన్నికల కమిషన్‌ ఈసారి ఓటింగ్‌ శాతాన్ని పెంచడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి ఓటు హక్కు ప్రాముఖ్యతను వివిధ మార్గాల ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా వివరించింది. అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి.. ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల సమర్థులైన అభ్యర్థులను మనమే ఎన్నుకునే అవకాశం కలుగుతుందని వివరించింది. అలాగే ఓటు హక్కు ఎందుకు వినియోగించుకోవాలనే దానిపై కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కరపత్రాలు, పోస్టర్ల ద్వారా గ్రామాలు.. పట్టణాల్లో ప్రచారం కల్పించారు. ప్రజలు ఓటు హక్కు విలువ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్‌ అధికారులతో కూడళ్ల వద్ద అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఫలించడంతోనే ఓటింగ్‌ శాతం పెరిగింది. అయితే మధ్యాహ్నం వరకు మందకొడిగా పోలింగ్‌ సాగడంతో ఇటు అభ్యర్థులు.. అటు అధికారులు కొంత నిరాశ చెందారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోలింగ్‌ బూత్‌లకు ఓటర్ల రాక క్రమక్రమంగా పెరిగింది. దీంతో సాయంత్రం సమయంలో అత్యధికంగా పోలింగ్‌ జరగడంతో ఎక్కువ పోలింగ్‌ శాతం నమోదైంది.

మధిరలో అత్యధికంగా 91.65 శాతం.. 
జిల్లాలోని మధిర నియోజకవర్గంలో అత్యధికంగా 91.65 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ 2014 ఎన్నికల్లో 89.5 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 2,03,132 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 1,86,173 మంది ఓటు వేశారు. 92,378 మంది పురుషులు, 93,794 మంది మహిళలు, ఇతరులు ఒకరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాలేరులో 90.99 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ 2014 ఎన్నికల్లో 90.04 శాతం ఓటింగ్‌ జరిగింది. ఈసారి ఇక్కడ 2,08,544 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 1,89,761 మంది ఓటు వేశారు. వారిలో పురుషులు 91,885 మంది ఉండగా.. మహిళలు 97,876 మంది ఉన్నారు. వైరాలో 88.83 శాతం పోలింగ్‌ నమోదైంది. 2014లో 87.45 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఈసారి ఇక్కడ 1,76,825 మంది ఓటర్లు ఉండగా.. 1,57,067 మంది ఓటు వేశారు. వారిలో 77,903 మంది పురుషులు, 79,164 మంది మహిళలు ఉన్నారు.  సత్తుపల్లిలో 88.65 శాతం ఓటింగ్‌ నమోదైంది. 2014లో ఇక్కడ 85.2 శాతం ఓటింగ్‌ జరిగింది. ఈసారి 2,22,711 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 1,97,443 మంది ఓటు వేశారు. వీరిలో పురుషులు 98,116 మంది.. 99,327 మంది మహిళలు ఉన్నారు. ఖమ్మంలో 73.98 శాతం పోలింగ్‌ నమోదైంది. 2014 ఎన్నికల్లో 70.57 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి ఇక్కడ 2,73,967 మంది ఓటర్లు ఉండగా.. 2,02,680 మంది ఓటు వేశారు. వీరిలో 97,479 మంది పురుషులు.. 1,05,201 మంది మహిళలు ఉన్నారు.    

>
మరిన్ని వార్తలు