దేవాదాయ శాఖలో ఔట్‌సోర్సింగ్‌ బాగోతం!

19 Oct, 2017 01:10 IST|Sakshi

     దొడ్డి దారిన అర్చకుల నియామకం

     ఏజెన్సీలు లేకుండానే నేరుగా వేతనాల చెల్లింపు

     వేతన సవరణ కసరత్తులో వెలుగుచూసిన బాగోతం

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బందిని ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించుకోవటం సాధారణం. వారి వేతన మొత్తాన్ని సిబ్బందిని సరఫరా చేసిన ఏజెన్సీకి ప్రతినెలా ప్రభుత్వం చెల్లిస్తుంది. తన కమీషన్‌ మినహాయించుకుని సిబ్బందికి ఆ సంస్థ వేతనాలు చెల్లిస్తుంది. అయితే అర్చకులను సరఫరా చేసే సంస్థ అంటూ ఇప్పటివరకు లేదు.. కానీ పలు దేవాలయాలకు ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో అర్చకులను సరఫరా చేసినట్లు నియామకాలు జరిపేశారు. అసలు అర్చకులను సరఫరా చేసే ఏజెన్సీలే లేనప్పుడు దేవాదాయ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ అర్చకులు ఎలా వచ్చారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆలస్యంగా వెలుగులోకి...
అక్రమంగా నియమించిన అర్చకుల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతన సవరణ కోసం ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దేవాదాయ శాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఇక్కడే అసలు బాగోతం బట్టబయలైంది. దీంతో ఔట్‌సోర్సింగ్‌ పేరుతో నియమితులైన అర్చకులకు వేతన సవరణ చేయకుండా ఆపేయాలని ఆ శాఖ కమిషనర్‌ భావిస్తుండటంతో.. సదరు అర్చకులు ఇప్పుడు ఆందోళనలో పడ్డారు.

అక్రమాలకు నిదర్శనం..
సాధారణంగా నియామకాలు చేపట్టేప్పుడు అర్హతలను ప్రాతిపదికగా చేసుకుంటారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఇది అమలవుతున్నా, దేవాదాయ శాఖలో మాత్రం అడ్డగోలుగా వ్యవహారాలు నడుస్తున్నాయి. సొంతంగా దేవాలయ పాలకమండళ్లే అడ్డగోలుగా నియామకాలు జరుపుతుండటంతో అర్హతలను పరిశీలించే పద్ధతే లేకుండా పోయింది. డబ్బులు దండుకుని సిబ్బందిని నియమించటం అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే ఈ ఔట్‌సోర్సింగ్‌ వ్యవహారం చోటుచేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. కొన్ని దేవాలయాల్లో అర్చకుల అవసరముందని ఆయా ఆలయాల నుంచి ప్రతిపాదనలు పంపారు. దాన్ని పరిశీలించిన అప్పటి అధికారులు అనుమతిచ్చేశారు. ఈక్రమంలో ఔట్‌ సోర్సింగ్‌ పేరుతో భారీ సంఖ్యలో అర్చకులను నియమించినట్లు రికార్డుల్లో రాసేశారు. కానీ.. ఏజెన్సీ పేరు, చిరునామా లాంటి వివరాలు ఎక్కడా లేవు. ఆలయ రిజిస్టర్లలో అర్చకుడి పేరు వేతన మొత్తం నమోదు చేశారు. అప్పటి నుంచి వారు అలాగే కొనసాగుతున్నారు.

ఇప్పుడు వేతన సవరణ కోసం ఒక్కో అర్చకుడి వివరాలు సేకరిస్తున్న సమయంలో వారు ఔట్‌ సోర్సింగ్‌గా నియామకమైనట్లు గుర్తించారు. ఇటు అధికారులు, అటు పాలక మండళ్లు ఎడాపెడా డబ్బులు వసూలు చేసి ఈ నియామకాలు చేపట్టినట్టు తెలుస్తోంది. అభ్యంతరాలు రాకుండా తాత్కాలిక పద్ధతిపై నియమిస్తున్నట్లు చెప్పుకొనేందుకు ఔట్‌సోర్సింగ్‌ అంశాన్ని తెరపైకి తెచ్చి ఉంటారని, అందరికీ డబ్బులు ముట్టడంతో దీనిపై అప్పట్లో ఎవరూ ప్రశ్నించి ఉండరన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై కొందరు అర్చకులను ప్రశ్నిస్తే.. అసలు ఔట్‌సోర్సింగ్‌ సంగతే తమకు తెలియదని, తమను ఆయా నిర్వాహకులు, ఈఓలు నియమించారని పేర్కొన్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నేరుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించే విధానం సాధ్యం కాదని, ఇప్పుడు వేతన సవరణలో వారిని ఎలా పరిగణనలోకి తీసుకుంటామని కమిషనర్‌ ప్రశ్నించినట్లు తెలిసింది. ఎవరో చేసిన అక్రమాలకు అర్చకులను బలిచేయటం సరికాదని అర్చక సంఘాలు పేర్కొంటున్నాయి. వారిని సాధారణ అర్చకులుగానే భావించి వేతన సవరణ జరపాలని కోరుతున్నాయి.

అర్హతలు లేకుండానే..
చాలా దేవాలయాల్లో పూజావిధానం తెలియని వారిని కూడా అర్చకులుగా నియమించారు. సాధారణంగా అర్చకులుగా నియమించాలంటే వేద పండితులై ఉండనప్పటికీ, షోడశోపచార పూజలు చేయటం వచ్చిన వారిని నియమిస్తారు. కానీ ఈ కనీస అర్హతలను కూడా చూడకుండానే నియమించిన దాఖలాలెన్నో. చాలా దేవాలయాల్లో కనీసం గణపతి పూజ కూడా రాని వారిని నియమించేశారు. డబ్బులు ముట్టచెబితే చాలు అర్హతల పరిశీలన కూడా అవసరం లేకుండా గుడ్డిగా నియామకాలు జరిపేశారు.

మరిన్ని వార్తలు