ఎందుకు సృష్టించారు?

15 Sep, 2023 02:10 IST|Sakshi

లష్కరే తోయిబాకు అనుబంధంగా పుట్టుకొచి్చన ‘ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’

ఉగ్ర మూకకు పాకిస్తాన్‌ సైన్యం, ‘ఐఎస్‌ఐ’ అండదండలు..

భారత భద్రతా సిబ్బంది, జమ్మూకశ్మీర్‌ మైనారీ్టలపై టీఆర్‌ఎఫ్‌ గురి

జనవరిలో యూఏపీఏ కింద నిషేధం విధించిన భారత ప్రభుత్వం

► జమూకశ్మిర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో బుధవారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆర్మీ కల్నల్, మేజర్, డీఎస్పీ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని సృష్టించింది. ముష్కరుల దుశ్చర్యకు దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముగ్గురు ఉన్నతాధికారులను బలి తీసుకున్న రాక్షస మూక కోసం వేట ముమ్మరంగా సాగుతోంది.

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురి మరణానికి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌(టీఆర్‌ఎఫ్‌) కారణమని ప్రాథమికంగా గుర్తించారు. పాకిస్తాన్‌ ప్రభుత్వ అండదండలతో ఈ ‘ప్రతిఘటన దళం’ రాక్షస దళంగా చెలరేగిపోతోంది. ప్రస్తుతం జమ్మూకశ్మిర్‌ అధికార యంత్రాంగానికి పెనుసవాలుగా మారింది. భద్రతా సిబ్బందితోపాటు సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ టీఆర్‌ఎఫ్‌? దాని పుట్టుపూర్వోత్తరాలేమిటో తెలుసుకుందాం..  

టార్గెట్‌ కశ్మిరీ పండిట్లు..  
జమ్మూకశ్మిర్‌కు స్వయం ప్రతిపత్తి కలి్పస్తున్న ఆర్టికల్‌ 370ని భారత ప్రభుత్వం 2019 ఆగ స్టులో రద్దు చేసి పారేసింది. ఈ పరిణామాన్ని ఉగ్రవాదులు ఏమాత్రం జీరి్ణంచుకోలేకపోయారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన కొంత కాలానికే అదే సంవత్సరం ‘ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ పురుడు పోసుకుంది. పురుడు పోసింది లష్కరే తోయిబా నాయకత్వమే. నిఘా వర్గాలకు దొరక్కుండా ఆన్‌లైన్‌ ద్వారా సభ్యులను చేర్చుకోవడం, నిధులను సేకరించడం మొదలుపెట్టారు.

ఇతర ఉగ్రవాద ముఠాల్లోని కొందరు సభ్యులు సైతం టీఆర్‌ఎఫ్‌లో చేరిపోయారు. పాకిస్తాన్‌ సైన్యంతోపాటు పాకిస్తాన్‌ నిఘా సంస్థ ‘ఐఎస్‌ఐ’ మద్దతు కూడా దొరకడంతో కశ్మీర్‌ లోయలో టీఆర్‌ఎఫ్‌ అత్యంత చురుగ్గా మారిపోయింది. కార్యకలాపాలను ఉధృతం చేసింది. పదుల సంఖ్యలో ఉగ్రవాద దాడులకు పాల్పడింది. టీఆర్‌ఎఫ్‌ ప్రధాన లక్ష్యం భారత జవాన్లు, జమ్మూకశ్మిర్‌లోని మైనారీ్టలే. కశ్మిరీ పండిట్లను అంతం చేయడమే ధ్యేయంగా దాడులకు దిగుతోంది.

పాక్‌ నుంచి ఆయుధాలు, డ్రగ్స్‌ స్మగ్లింగ్‌  
టీఆర్‌ఎఫ్‌ అరాచకాలు పెరిగిపోతుండడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఈ ఏడాది జనవరిలో టీఆర్‌ఎఫ్‌పై నిషేధం విధించింది. సంస్థ కమాండర్‌ షేక్‌ సజ్జాద్‌ గుల్‌ను యూఏపీఏలోని నాలుగో షెడ్యూల్‌ కింద ఉగ్రవాదిగా ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోని రోజ్‌ అవెన్యూ కాలనీకి చెందిన షేక్‌ సజ్జాద్‌ గుల్‌ చిన్నప్పటి నుంచి ఉగ్రబాట పట్టాడు.

2018 జూన్‌లో జరిగిన కశ్మిరీ జర్నలిస్టు షుజాత్‌ బుఖారీ హత్య వెనుక అతడి హస్తం ఉన్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. టీఆర్‌ఎఫ్‌ లష్కరే తోయిబాకు అనుబంధంగా వ్యవహరిస్తోందని రాజ్యసభలో కేంద్ర హోంశాఖ ప్రకటించింది. భద్రతా సిబ్బందిని, మైనార్టీలను హత్య చేయడంతోపాటు పాకిస్తాన్‌ భూభాగం నుంచి ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌కు పాల్పడుతోందని, అక్కడి నుంచి ఉగ్రవాదులను భారత్‌లోకి చేరవేస్తోందని వెల్లడించింది.

ఎందుకు సృష్టించారు?  
ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నందుకు గాను పాకిస్తాన్‌ను పారిస్‌కు చెందిన ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్‌్కఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) గ్రే లిస్టులో చేర్చింది. దీంతో నిషేధిత ఉగ్రవాద సంస్థలకు నేరుగా నిధులు అందించే మార్గం మూసుకుపోయింది. నిధులు ఆగిపోవడంతో లష్కరే తోయిబా, దాని అధినేత హఫీజ్‌ సయీద్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర య్యాయి. అందుకే లష్కరే తోయిబాకు అనుబంధంగా ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ను సృష్టించా రు. పాకిస్తాన్‌ సర్కారు నేరుగా టీఆర్‌ఎఫ్‌కు నిధులు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఉగ్రవాద సంస్థ అని గానీ, మతపరమైన సాయుధ దళం అని గానీ చెప్పకుండా స్థానిక ప్రతిఘటన దళంగా మభ్యపెట్టడానికి టీఆర్‌ఎఫ్‌ అని నామకరణం చేసినట్లు స్పష్టమవుతోంది.
 
ఉధృతంగా చేరికలు..
ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022లో జమ్మూకశ్మిర్‌లో భద్రతా దళాలు 90కిపైగా అపరేషన్లు నిర్వహించాయి. ఈ ఆపరేషన్లలో 42 మంది విదేశీ ఉగ్రవాదులు సహా మొత్తం 172 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో 108 మంది టీఆర్‌ఎఫ్‌కు చెందినవారే కావడం గమనార్హం. అలాగే 2022లో దాదాపు 100 మంది యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరగా, వీరిలో ఏకంగా 74 మంది కేవలం టీఆర్‌ఎఫ్‌లోనే చేరడం గమనార్హం. దీన్నిబట్టి టీఆర్‌ఎఫ్‌ నుంచి ఎదురవుతున్న ముప్పును అర్థం చేసుకోవచ్చు.

నిషేధించిన మరుసటి రోజే ‘హిట్‌ లిస్ట్‌’..  
భారత్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 44 ఉగ్రవాద సంస్థలను ప్రభుత్వం యూఏపీఏ కింద నిషేధించింది. వీటన్నింటిలో టీఆర్‌ఎఫ్‌ అత్యంత చురుగ్గా పని చేస్తున్నట్లు గుర్తించారు. నిషేధం విధించిన మరుసటి రోజే ఈ సంస్థ ‘హిట్‌ లిస్ట్‌’ విడుదల చేసింది. అందులో ఉన్న వ్యక్తులందరినీ అంతం చేస్తామని హెచ్చరించింది. సామాన్య యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించడానికి టీఆర్‌ఎఫ్‌ సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటోంది.

‘సైకలాజికల్‌ ఆపరేషన్లు’ చేస్తోంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిని ప్రేరేపిస్తోంది. యువకుల మనసు మార్చేసి ఉగ్రవాదులుగా తయారు చేస్తోంది. టీఆర్‌ఎఫ్‌ జమ్మూకశ్మిర్‌లోని మైనార్టీ సిక్కులను కూడా లక్ష్యంగా చేసుకుంది. ప్రత్యేక పోలీసు అధికారులుగా(ఎస్పీఓ) పనిచేస్తున్న సిక్కు యువకులపై రాస్ట్రియ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ఏజెంట్లు అనే ముద్ర వేస్తోంది. టీఆర్‌ఎఫ్‌ దాడుల్లో సిక్కులు సైతం బాధితులుగా మారుతున్నారు. టీఆర్‌ఎఫ్‌ ముష్కరులు భారత భద్రతా దళాలపై యుద్ధమే సాగిస్తున్నారని చెప్పొచ్చు. అధునాతన ఆయుధాలతో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడుతున్నారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు