అనర్హులు 10,379

5 Jan, 2019 09:51 IST|Sakshi

సర్పంచో.. వార్డు సభ్యుడో కావాలని కలలు కన్నారు... కలిసొచ్చిన రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకుందామనుకున్నారు... ఇందుకు కుటుంబసభ్యులు, బంధుమిత్రుల ప్రోత్సాహం దొరికింది... ఇంకేం 2013లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో బరిలోకి దిగారు... ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి... గెలిచిన వారు సంబరాలు చేసుకున్నారు.. ఓడిపోయిన వారు రాజకీయాలు కలిసిరావంటూ తమని ఓదార్చుకున్నారు... అయితే తిరకాసు వచ్చి పడింది... కొందరు గెలిచిన వారు సైతం ఎన్నికల సంఘానికి తమ ఖర్చు లెక్కలు చెప్పకపోగా.. ఓడిపోయిన వారైతే ఆ ఊసే ఎత్తలేదు.. ఫలితంగా ఎన్నికల సంఘం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 10,379 మంది 2020 వరకు ఎన్నికల్లో పోటీకి అనర్హులంటూ 2018 జనవరి 2న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అయోమయంలో పడిన ఆనాటి అభ్యర్థుల పరిస్థితి తాజా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌తో ఆందోళనకరంగా మారింది. ఈ అనర్హుల జాబితా ఉమ్మడి జిల్లాలోని జిల్లా పంచాయతీ అధికారుల వద్ద ఉంది. ఈ విషయంలో తదుపరి ఉత్తర్వులు వెలువడకపోతే పాత ఉత్తర్వులనే ప్రామాణికంగా తీసుకుని ఒకవేళ వారు నామినేషన్‌ వేసినా పరిశీలనలో తిరస్కరించే అవకాశం ఉంది. 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: గత స్థానిక సంస్థల ఎన్నికల్లో లెక్కలు చూపని అభ్యర్థులకు 2017 డిసెంబర్‌ చివరి వారంలో మరోసారి కలెక్టర్లు, పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఎన్నికల ఖర్చు లెక్కలు చెప్పని వారిపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. లెక్కలు చెప్పని వారిని 2020 సంవత్సరం వరకు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా వేటు వేసేలా ఆ ఉత్తర్వులో పేర్కొంది.

వేటుపడ్డ వారిలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 10,379 మంది ఉన్నారు. ఇందులో ఆరుగురు సిట్టింగ్‌ సర్పంచ్‌లు ఉండగా, 1203 మంది పోటీ చేసి ఓడిపోయిన వారు, వార్డు మెంబర్ల అభ్యర్థులు 9170 మంది ఉండగా, 949 మంది సిట్టింగ్‌ వార్డు సభ్యులు ఉన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థులు 45, ఎంపీటీసీ అభ్యర్థులు 371 మంది కాగా, కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోటీ చేసిన మరో 815 మంది ఈ జాబితాలో ఉన్నారు. సర్పంచ్‌ల్లో వారికి ఎన్నికల సంఘం నోటీస్‌లు జారీ చేసినా ప్రయోజనం లేకపోవడంతో 2020 నవంబర్‌ వరకు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారి ఆశలు ఆడియాశలు కాగా సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే అత్యధికం...
ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఎందులోనైనా ఓ ప్రత్యేకతను చాటుకుంటోంది. చివరకు ఎన్నికల్లోనూ తమ తప్పిదాల్లో నెంబర్‌ వన్‌గా నిలిచింది. 2013, 2014లలో జరిగిన రూరల్, అర్బన్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన వారు ఇప్పటివరకు ఎన్నికల జమ, ఖర్చుల లెక్కలు చెప్పని వారు 10,379 మంది ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఉన్నారు. అందులో ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న ఆరుగురు సర్పంచ్‌లతో పాటు 949 మంది వార్డు సభ్యులు ఉన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీ చేసిన అభ్యర్థులంతా ఫలితాలు వెలువడిన 40 రోజుల్లో ఎన్నికల ఖర్చుల వివరాలు ఎన్నికల సంఘానికి అందజేయాలి.

ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలో చూసిచూడనట్లు వ్యవహరించినా ఈసారి మాత్రం చాలా కఠినంగానే వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి జమ, ఖర్చుల వివరాలు సమర్పించని వారిపై అనర్హత వేటు వేయాలని నిర్ణయించింది. స్థానిక సంస్థలకు చెందిన వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్‌ అభ్యర్థులు అందులో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన వారందరికి ఖర్చుల లెక్కలు సమర్పించాలని అధికారులు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో వారిపై కఠిన చర్యలు చేపట్టారు.
 
2020 వరకు పోటీకి అనర్హులు
ఎన్నికల ఖర్చుల వివరాలు చెప్పని వారిపై మూడేళ్ల వరకు 2020 నవంబర్‌ వరకు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. అందులో ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వారు 955 మంది ఉన్నారు. సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులతో పాటు 57 జెడ్పీటీసీ స్థానాల నుంచి పోటీ చేసిన 45 మంది, 817 ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసిన 371 మందిపైనా అనర్హత వేటు పటింది. అదే విధంగా ఉమ్మడి జిల్లాలోని రెండు కార్పొరేషన్లు సహా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నుంచి పోటీ చేసి లెక్కలు చూపని 815 మంది అభ్యర్థులకు నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో అత్యధికంగా రామగుండం కార్పొరేషన్‌లో 363 మంది ఉండగా, కరీంనగర్‌లో 132 కాగా, హుజూరాబాద్‌ నగర పంచాయతీలో ఒక్కరే ఉన్నారు. అనర్హత వేటు మిగతా అభ్యర్థులు జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, సిరిసిల్ల, వేములవాడ, జమ్మికుంటల నుంచి ఉన్నారు. అనర్హత వేటు పడిన వారిలో ఆందోళన వ్యక్తమవుతుండగా, సర్పంచ్‌ అభ్యర్థి రూ.40 వేలు, వార్డు మెంబర్‌ అభ్యర్థి రూ.6 వేల వరకు.. ఇలా అందరికీ వ్యయాన్ని చూచించినా ఎన్నికల సంఘం.. ఆ లెక్కలు చూపని అభ్యర్థులపై చర్యలకు దిగడం చర్చనీయాంశంగా మారింది.

కొత్త ఉత్తర్వులు వెలువడే వరకు పాతవే ప్రామాణికం
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ లెక్కలు చెప్పనందుకు చర్యల కింద 2020 నవంబర్‌ వరకు పోటీ చేసే అర్హత కోల్పోయారు. ఈ విషయంలో కొత్త ఉత్తర్వులు వెలువడే వరకు పాత ఉత్తర్వులే అమల్లో ఉంటాయి. ఈసీ నియమావళి ప్రకారం ఒక్కో అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాలన్న నిబంధనలు ఉన్నాయి. ఆ మేరకు ఎన్నికల వ్యయాన్ని సమర్పించాలనే బాధ్యతను విస్మరించిన వారికి నోటీసులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది.  – సీహెచ్‌. మనోజ్‌కుమార్, ఇన్‌చార్జి డీపీవో, కరీంనగర్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా