‘పంచాయతీ’కి రెడీ

23 Dec, 2018 08:21 IST|Sakshi
గోదాములో సిద్ధంగా ఉన్న బ్యాలెట్‌ బాక్సులు (ఫైల్‌)

ఆదిలాబాద్‌అర్బన్‌: గ్రామపంచాయతీ ఎన్నికల నగారా త్వరలో మోగనుందా..? హైకోర్టు ఆదేశాల ప్రకారం వచ్చే జనవరి 10లోగా ఎన్నికల నిర్వహణ పూర్తి కానుందా.? ప్రస్తుతం ఇటు రాష్ట్ర ప్రభుత్వం.. అటు ఎన్నికల సంఘం వేగంగా చేస్తున్న ఏర్పాట్లను బట్టి చూస్తుంటే అవుననే సమాధానమే వస్తోంది. నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదలైన ఎన్నికలకు సిద్ధమని పంచాయతీరాజ్‌ శాఖ ఇది వరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 8లోగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

జనవరిలో నిర్వహించే పంచాయతీ ఎన్నికలకు అవసరమయ్యే బ్యాలెట్‌ బాక్సులను అధికారులు సిద్ధం చేశారు. బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లు, బీసీ ఓటర్ల గణన, ఫొటో ఓటర్ల జాబితాను పూర్తి చేసి స్థానిక పోరుకు సిద్ధంగా ఉంచారు. రెండు రోజుల క్రితం రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు శిక్షణ ఇచ్చిన యంత్రాంగం తాజాగా స్టేజ్‌–2 అధికారుల శిక్షణ కూడా పూర్తి చేసి ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా రెడీ అయింది. కాగా, రిజర్వేషన్లలో బీసీలకు 23.81 శాతం, ఎస్సీలకు 20.46 శాతం, ఎస్టీలకు 5.73 శాతం ఖరారు చేయాలని కలెక్టర్లకు, డీపీవోలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని కేటగిరిల్లో మహిళలకు  50 శాతం స్థానాలను కేటాయించాలని ఆదేశాల్లో స్పష్టం చేయడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు.

బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం 
పంచాయతీ ఎన్నికలకు ఉపయోగించే బ్యాలెట్‌ బాక్సులు సిద్ధమయ్యాయి. గత జూన్‌లో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామనడంతో కలెక్టరేట్‌లోని స్టోరేజ్‌ రూంలో ఉన్న బ్యాలెట్‌ బాక్సులను బయటకు తీసి దుమ్ముదులిపేశారు. మన జిల్లాలో సరిపడా బాక్సులు లేకపోవడంతో మహారాష్ట్ర నుంచి తెప్పించారు. వీటన్నింటీని ఆదిలాబాద్‌ మార్కెట్‌యార్డులో గల గోదాములో భద్రంగా దాచారు. అక్కడ బాక్సులకు రంగులు వేయడం, తుప్పు పట్టిన, రంధ్రాలు పడిన బాక్సులను రిపేరు చేసి సిద్ధం చేశారు.

అయితే జిల్లాలో ప్రస్తుతం 6,636 బ్యాలెట్‌ బాక్సులు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. ఆదిలాబాద్, బోథ్‌ రెండు నియోజకవర్గాల్లో కలిపి 467 గ్రామ పంచాయతీలు ఉండగా, 3,822 వార్డులు ఉన్నాయి. ఒక్కో వార్డుకు ఒక్కో బాక్సు చొప్పున 3,822 బాక్సులు అవసరం అవుతాయి. సర్పంచ్‌ స్థానానికి ఒకటి చొప్పున మరో 467 బాక్సులు అవసరమనుకున్న సరిపడేంత సిద్ధంగా ఉంచారు. కాగా, ఇది వరకే బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ పూర్తి అయింది. రెండు కలర్‌లో ఉన్న బ్యాలెట్‌ పేపర్లను జిల్లా పరిషత్‌ కార్యాలయంలో గల స్ట్రాంగ్‌రూంలో భద్రపర్చారు.

అధికారులకు శిక్షణ పూర్తి..  
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 500 మంది (స్టేజ్‌–2) రిటర్నింగ్‌ అధికారులు నియామకం అయినట్లు పంచాయతీ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉండగా, 465 పంచాయతీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. స్టేజ్‌–2 అధికారులు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించనున్నారు. ఒక్కో పంచాయతీకి ఒక్కరు లేదా ఇద్దరు చొప్పున ఎన్నికల విధులు నిర్వర్తిస్తారు. కాగా, స్టేజ్‌–1 రిటర్నింగ్‌ అధికారులు క్లస్టర్‌కు ఒకరు చొప్పున ఎన్నికల విధులు నిర్వర్తించగా, స్టేజ్‌–2 అధికారులు పంచాయతీకి ఒకరు లేదా ఇద్దరు చొప్పున బాధ్యతలు చేపట్టనున్నారు. ఒక్కో క్లస్టర్‌ పరిధిలో నాలుగు నుంచి ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

అంటే ఒక్కో క్లస్టర్‌కు తొమ్మిది లేదా 11 మంది రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. స్టేజ్‌–1 అధికారులకు ఇది వరకే శిక్షణ ఇవ్వగా, స్టేజ్‌–2 అధికారులకు శనివారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)గా కొత్తగా నియామకమైన సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణకు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. శిక్షణలో ఎన్నికల విధులు, బాధ్యతలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. కాగా, నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి ఫలితాలు తేలే వరకు ఈ అధికారులు కీలకపాత్ర పోషించనున్నారు.

మరిన్ని వార్తలు