అభ్యర్థుల్లో ఆందోళన !  

24 Dec, 2018 07:03 IST|Sakshi
జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు

చుంచుపల్లి:  గ్రామపంచాయతీ జూనియర్‌ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ హైకోర్టు ఆదేశాలతో సందిగ్ధంలో పడినట్లు కనిపిస్తోంది. అనేక ఏళ్లుగా ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అక్టోబర్‌ 10న రాత పరీక్ష నిర్వహించింది. ఇటీవలే ఫలితాలు కూడా వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 479 పంచాయతీల్లో ఖాళీగా ఉన్న 387 కార్యదర్శుల పోస్టులు ఈ కొత్త ఉద్యోగాలతో  భర్తీ కానున్నాయి.

అయితే ఇటీవల ప్రకటించిన ఫలితాలలో అవకతవకలు జరిగాయని, ఈ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా ఉందని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో నియామక ఉత్తర్వులను నిలిపివేయాలని గత బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు నియామకాలు జరుపవద్దని కోర్టు ఆదేశించింది. దీంతో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల కొలువులకు ఎంపికైన అభ్యర్థులు ఆందోళనలో పడ్డారు. జిల్లాలో ఎంపికైన 387 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయింది. అయితే కోర్టు ఉత్తర్వులతో వారిలో కొంత నిరాశ ఎదురైంది. 

నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు..  
జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఎంపిక జాబితాలో ఒకే అభ్యర్థి నంబరును పలుసార్లు ప్రకటించటం, కనీస అర్హత సాధించని అభ్యర్థులు పేర్లు ఎంపిక జాబితాలో ఉండడంతో మిగిలిన వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల వారీగా ర్యాంకులను ప్రకటించకుండానే మెరిట్‌ జాబితాను వెల్లడించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో 1:3 పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేయలేదన్న ఆరోపణలు సైతం వస్తున్నాయి.

రిజర్వేషన్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 50 శాతానికి మించి పోస్టులు కేటాయించడాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టినట్టు తెలుస్తోంది. ఫలితాల ప్రకటనలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ అనంతరం ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడంతో అర్హత సాధించిన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. నిబంధన ప్రకారం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన అభ్యర్థులనే నియమించాల్సి ఉంటుంది. కానీ ఈ విషయమై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో  గిరిజన అభ్యర్థులు సైతం ఆందోళనకు గురవుతున్నారు.
 
ఎంపిక ప్రక్రియ మరింత జాప్యం..  
మొదట నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 25న ఎంపికైన అభ్యర్థులకు కలెక్టర్‌ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందించాల్సి ఉంది. కానీ కోర్టు ఆదేశాలతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో 15 రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడితే ఈ ఉద్యోగాల భర్తీ ఇంకా జాప్యం జరిగే అవకాశం ఉంది. కొత్త పంచాయతీల పాలకవర్గం వచ్చే లోపైనా ఈ నియామక ప్రక్రియ పూర్తవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

హైకోర్టు ఆదేశాల ప్రకారంనడుచుకుంటాం 
జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల విషయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం నియామక ఉత్తర్వులను నిలిపివేసి ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని పూర్తి చేశాం. మళ్లీ కోర్టు ఆదేశాల ప్రకారం నియామక ఉత్తర్హుల ప్రక్రియ కొనసాగిస్తాం. జిల్లాలో ఎలాంటి అవకతవకలు జరిగిన దాఖలాలు లేవు. ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – ఆర్‌ ఆశాలత:డీపీఓ 

మరిన్ని వార్తలు