లెక్కింపు వేళ జాగ్రత్తగా ఉందాం

17 May, 2019 00:32 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ కౌంటింగ్‌ ఏజెంట్లకు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కీలక సూచనలు

ఇది పదేళ్ల పోరాట ఫలితం.. వృథా కానివ్వొద్దు 

విజయం ముంగిట్లోకి చేరుకున్న తరుణంలో ఏమరుపాటు వద్దు

చంద్రబాబు కుట్రల పట్ల ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి

సాక్షి, అమరావతి:  ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని తీవ్ర నిరాశ, నిççస్పృహల్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఓట్ల లెక్కింపు సమయంలో చేసే కుట్రలు, కుతంత్రాల పట్ల అప్రమతంగా ఉండాలని వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఇన్నేళ్ల కష్టాన్ని వృథా కాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. వైఎస్సార్‌ 2009లో మరణించిన తరువాత పదేళ్ల పాటు మహాభారత యుద్ధంలో పాండవుల్లాగా పోరాడామని, వైఎస్సార్‌ సీపీ విజయపథంలో దూసుకెళుతున్న తరుణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గురువారం విజయవాడలోని ఏ–1 కన్వెన్షన్‌ సెంటర్‌లో వైఎస్సార్‌ సీపీ ఎన్నికల ఏజెంట్ల కౌంటింగ్‌ శిక్షణా శిబిరంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసిన అసెంబ్లీ అభ్యర్థులు, లోక్‌సభ అభ్యర్థులు, ఏజెంట్లు, పార్లమెంట్‌ జిల్లాల అధ్యక్షులు, పరిశీలకులు హాజరైన ఈ శిక్షణా శిబిరంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం, మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శామ్యూల్‌ తదితరులు పాల్గొని మాట్లాడారు. అజేయ కల్లంతోపాటు ఎన్నికల నిర్వహణలో అనుభవజ్ఞులైన పలువురు మాజీ అధికారులు ఈ సందర్భంగా సందేహాలను నివృత్తి చేశారు. తొలుత జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో విజయవాడకు చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణుతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.  

కార్యకర్తలు కష్టాలకు  ఎదురొడ్డి పోరాడారు: విజయసాయిరెడ్డి 
పదేళ్లుగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పడ్డ కష్టాలు వర్ణనాతీతమని, వేలాది మందిపై ప్రభుత్వం కేసులు పెట్టి వేధించినా ఎన్నికల్లో పార్టీ కోసం తెగించి పని చేశారని విజయసాయిరెడ్డి చెప్పారు. పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తానని అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు. పరాజయం పాలవుతున్నానని స్పష్టంగా తెలుసుకున్న చంద్రబాబు ఈవీఎంలపై లేనిపోని నిందలు వేస్తున్నారని దుయ్యబట్టారు. ఓట్ల లెక్కింపు సమయంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ఆధిక్యతతో ఉన్న చోట్ల సాధ్యమైనన్ని ఎక్కువ అభ్యంతరాలు, అనుమానాలు లేవనెత్తి కౌంటింగ్‌ ప్రక్రియకు అవాంతరాలు సృష్టించాలని చంద్రబాబు తన పార్టీ కౌంటింగ్‌ ఏజెంట్లను ఆదేశించారంటే ఆయన ఎంత దుర్మార్గమైన ఆలోచనలతో ఉన్నారో బోధపడుతోందన్నారు.  

మన ఏజెంట్లను అపహరించే ప్రమాదం: ఉమ్మారెడ్డి 
ఓట్ల లెక్కింపు రోజు వైఎస్సార్‌ సీపీ కౌంటింగ్‌ ఏజెంట్లను అపహరించాలని టీడీపీ పథకం వేస్తోందని, చివరి నిమిషంలో ఇలాంటి దుర్మార్గాలు జరిగితే కొత్త ఏజెంట్లను నియమించుకునే అవకాశం ఉండదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ శ్రేణులను హెచ్చరించారు. వైఎస్సార్‌ సీపీ లోక్‌సభ, శాసనసభ అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించి పార్టీ కౌంటింగ్‌ ఏజెంట్లను ఒక రోజు ముందుగానే పిలిపించుకుని రక్షణ కల్పించాలని, ఓట్ల లెక్కింపు కేంద్రం వరకూ వారిని జాగ్రత్తగా తరలించాలని సూచించారు.  

అభ్యంతరాలపై అక్నాలెడ్జ్‌మెంట్‌ తప్పనిసరి: శామ్యూల్‌ 
ఓట్ల లెక్కింపు సందర్భంగా అభ్యంతరాలు, అనుమానాలు ఉంటే వైఎస్సార్‌ సీపీ కౌంటింగ్‌ ఏజెంట్లు రిటర్నింగ్‌ అధికారికి లిఖితపూర్వకంగా అందజేసి కచ్చితంగా అక్నాలెడ్జ్‌మెంట్‌ («ధువీకరణ) పత్రం తీసుకోవాలని మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శామ్యూల్‌ సూచించారు. లిఖితపూర్వకంగా కాకుండా నోటిమాటగా అభ్యంతరం తెలిపితే అది చట్టం ముందు నిలబడవని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంలోనే ఈవీఎంల సెక్యూరిటీని ఏజెంట్లు జాగ్రత్తగా పరిశీలించి ప్రతి రౌండ్‌లోనూ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాదికిపైగా రాష్ట్రమంతా కాలి నడకన తిరిగి చల్లిన విత్తనాలు బాగా పండాయనే వార్తలు వస్తున్నాయని, ఆ పంట ఫలాన్ని అందుకునే కీలకమైన ఓట్ల లెక్కింపు సమయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఓట్ల లెక్కింపు మొదలైన దగ్గరి నుంచి చివరి వరకూ ఏజెంట్లు కేంద్రంలోనే ఉండాలని, మధ్యలో వెళ్లవద్దని, నూరు శాతం ప్రక్రియ పూర్తయ్యాక గానీ బయటకు రావద్దని శామ్యూల్‌ సూచించారు.

లెక్కింపు సమయంలో అతి విశ్వాసం వద్దు: కల్లం
వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఈసారి క్షేత్రస్థాయిలో చాలా బాగా పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేసుకోగలిగాయని, అయితే ఓట్ల లెక్కింపు సందర్భంగా అతి విశ్వాసంతో ఉండవద్దని అజేయ కల్లం సూచించారు. ‘మనీ.. మీడియా... మ్యానిపులేషన్‌’ను తట్టుకుని విపక్ష కార్యకర్తలు పని చేశారని ప్రశంసించారు. లెక్కింపు సందర్భంగా టీడీపీ ఏజెంట్లు అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తే వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, రిటర్నింగ్‌ ఆఫీసర్లదేనని, వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లు పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని సూచించారు. టీడీపీ ఏజెంట్లు రెచ్చగొట్టే చర్యలకు దిగినా సంయమనం కోల్పోవద్దన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ అంతా కెమెరాల్లో రికార్డు అవుతుందని వివరించారు.  

మరిన్ని వార్తలు