‘రైతుల మేలుకే కొత్త విధానం’

22 May, 2020 14:17 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి: రైతులకు మేలు కలిగించేందుకు కొత్త వ్యవసాయ విధానం అమలు చేస్తున్నామని,  వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని మంత్రి హరీష్‌ రావు అన్నారు. శుక్రవారం ఆయన మంత్రి నిరంజన్‌ రెడ్డితో పటాన్‌చెరువు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ... పదవి రావడం గొప్పకాదు, పదవి నిర్వహించడం గొప్ప. రైతులకు మేలు జరిగేందుకు కొత్త వ్యవసాయం విధానం అమలు చేస్తున్నాం. వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత సంగారెడ్డి జిల్లాలో కొత్తగా రెండు వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేశాం అని తెలిపారు. 

(కందిపప్పు.. ఇక్కడ నచ్చకుంటే అమరావతికి వెళ్లు!)

ఇక మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్‌ మహానగర అవసరాలు తీర్చేలా పటాన్‌ చెరువు మార్కెట్‌ను అభివృద్ధి చెయ్యాలి. దేశంలోనే అత్యుత్తమ మార్కెట్‌గా పటాన్‌ చెరువు మార్కెట్‌ను మార్చాలి. మార్కెట్‌ వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంట్లో కూర్చొనే కావల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నాం.మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టంలోని నిబంధనలు సైతం మార్చుతాం. ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్రజలకు సౌకర్యవంతంగా మారింది. హైదరాబాద్‌ మహానగరానికి నలుదిక్కులా సమీకృత మార్కెట్లు అభివృద్ధి చేస్తాం. సిద్ధిపేట మార్కెట్లు రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నాయి. సిద్దిపేట మార్కెట్లను చూసే నా నియోజకవర్గంలో  మార్కెట్లను అభివృద్ధి చేశాను. రాబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చాం.  ఒకప్పుడు తినడానికి సరిపోయే పంట కూడా పండని పరిస్థితి రాష్టంలో ఉండేది. అరేళ్లలో ఆ పరిస్థితిని అధిగమించాం.  ప్రస్తుతం నిల్వ చేయడానికి గోదాముల లేని స్థాయిలో పంటలు పండుతున్నాయి.  ఈ సంవత్సరం 39 లక్షల 40 వేల ఎకరాల్లో వరి పంట పండింది. జనాభా అవసరాలకు అనుగుణంగా ఏ పంటలు ఏ స్థాయిలో అవసరమో, విశ్వవిద్యాలయాలతో సర్వే చేయించాం.  ప్రస్తుతం కేరళ, తమిళనాడు మాత్రమే బియ్యం కోసం మనపై ఆధారపడ్డాయి.  కొత్త వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు, పండిన పంటకు కొనుగోలుకు హామీ ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితి కంటే మెరుగైన పరిస్థితి రావాలి అన్న లక్ష్యంతో కొత్త విధానం రూపొందిస్తున్నాం.  ఒక పంట పండిన తర్వాత అది ఆహారంగా మారే వరకు వందల మందికి ఉపాధి దొరుకుతుంది.  జిన్నారం, గుమ్మడిదళ గోదాములకు నిధులు మంజూరు చేశాం అని తెలిపారు. (మీ బిడ్డలకోసమైనా.. తీరు మార్చుకోండి)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా