నిర్మల్‌ పై మనసు పెట్టమ్మా.!

5 Jul, 2019 10:03 IST|Sakshi

కలల ‘ప్రయాణం’పై ఏళ్లుగా ఆశలు

‘రైల్వేలైన్‌ ఇకనైనా పూర్తయ్యేనా..?

సాక్షి, నిర్మల్‌: ఈ ప్రాంతవాసుల రవాణా సౌకర్యం మెరుగు పర్చేందుకు ఆదిలాబాద్‌–నిర్మల్‌–ఆర్మూర్‌లను కలుపుతూ రైల్వేలైన్‌ నిర్మించాలని ఉమ్మడి జిల్లాకు చెందిన అప్పటి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, అప్పటి ఎంపీ నగేశ్‌లు కేంద్రాన్ని కోరారు. మూడేళ్ల కిందట ఢిల్లీలో అప్పటి కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభును కలిశారు. ఈ రైల్వేలైన్‌ నిర్మాణంలో సగం వాటా భరిస్తామంటూ సీఎం కేసీఆర్‌ స్వయంగా ఇచ్చిన లేఖను ఆయనకు అందించారు.

రాష్ట్రం సగం ఖర్చుకు ముందుకు రావడంతో కేంద్రం కూడా వెంటనే పచ్చజెండా ఊపింది. దాదాపు రూ.2,720 కోట్లతో నిర్మాణానికి ముందుకు వచ్చింది. కానీ.. ఇప్పటి వరకు రైల్వేశాఖ ఒక్కపని కూడా చేపట్టలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ(మెమోరాండమ్‌ ఆఫ్‌ అండర్‌ స్టాండింగ్‌) కూడా కుదుర్చుకోలేదు. రాష్ట్రంలోని పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులపై ఏడాది క్రితం సికింద్రాబాద్, నాందేడ్‌లలో పలుమార్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులతో రాష్ట్ర ఎంపీలు భేటీ అయ్యారు. ఇందులో ఆర్మూర్‌ – నిర్మల్‌ –ఆదిలాబాద్‌ లైన్‌ నిర్మాణాన్నీ లేవనెత్తారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంటామని అప్పట్లో చెప్పినా.. ఇప్పటికీ ముందడుగు పడలేదు.

ఎప్పటి నుంచో ఉంది..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అగ్రభాగాన ఉన్న ఆదిలాబాద్‌కు హైదరాబాద్‌ నుంచి నేరుగా రైల్వేలైన్‌ నిర్మించాలనే ప్రతిపాదన దశాబ్ధాల క్రితం నుంచి ఉంది. ప్రస్తుత మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడే పీవీ నర్సింహారావు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. రాష్ట్ర రాజధాని సమీపంలోని పటాన్‌చెరువు నుంచి ఆదిలాబాద్‌కు వయా ఆర్మూర్, నిర్మల్‌ మీదుగా పారిశ్రామిక–వెనుకబడిన ప్రాంతాలను కలుపుతూ రైల్వేలైన్‌ వేయాలని నిర్ణయించారు. 2009 రైల్వే బడ్జెట్‌లోనే లైన్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ రహదారి వెంట ఈ లైన్‌ నిర్మించాలన్న ప్రతిపాదనలూ చేశారు. కొన్నేళ్లకు సర్వే కూడా పూర్తిచేశారు. తీరా.. 317 కిలోమీటర్ల దూరభారంగా ఉన్న ఈ లైన్‌ నిర్మాణానికి రూ.3,771కోట్లు పెట్టడం లాభదాయకం కాదేమో.. అంటూ అప్పట్లో రైల్వేశాఖ చేతులెత్తేసింది.

ఆ తర్వాత ఏళ్లు గడిచిపోయాయి. ఈ లైన్‌నిర్మాణం మూలనపడింది. మళ్లీ  రెండున్నరేళ్ల కిందట అప్పటి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, అప్పటి ఎంపీ నగేశ్‌లు పట్టుబట్టి సీఎం కేసీఆర్‌ను సగం వాటా భరించేందుకు ఒప్పించారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి అప్పటి కేంద్రం రైల్వేమంత్రి సురేశ్‌ప్రభుతోనూ పచ్చజెండా ఊపించారు. ఈసారి పటాన్‌చెరు నుంచి కాకుండా పెద్దపల్లి–నిజామాబాద్‌ రైల్వేమార్గంలో ఉన్న ఆర్మూర్‌ నుంచి నిర్మల్‌ మీదుగా ఆదిలాబాద్‌ వరకు 137కి.మీ. రైల్వేలైన్‌ వేస్తే సరిపోతుందని తేల్చారు. కేంద్రం 2017లో పచ్చజెండా ఊపినా రైల్వేలైన్‌ పనులు ప్రారంభం కాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తర్వాత ఈ అంశంపై ఎలాంటి స్పందన కూడా చూపలేదు. ప్రతిసారి కేంద్ర బడ్జెట్‌ వచ్చినప్పుడల్లా రైల్వేలైన్‌ తెరపైకి వస్తూనే ఉంది.

ఈఎస్‌ఐ కూడా..
రైల్వేలైన్‌తో పాటు జిల్లాలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. మూడేళ్ల కిందటే అప్పటి కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయను కలిసి విన్నవించారు. ఈ మేరకు ఆయన నిర్మల్‌లో ఈఎస్‌ఐ ఆస్పత్రితో పాటు భైంసాలో డిస్పెన్సరీ మంజూరు చేస్తామని చెప్పారు. అనంతరం ఈఎస్‌ఐ అధికారులు జిల్లా కేంద్రానికి వచ్చారు. ఇక్కడి అధికారులు స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయ భవనాన్ని చూపించారు. దానిపై ఈఎస్‌ఐ అధికారులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత దత్తాత్రేయ మంత్రి పదవీ నుంచి దిగిపోవడంతో ఫైల్‌ పెండింగ్‌లో పడింది.

మళ్లీ దీనిపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి కొత్తగా బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రి సంతోష్‌ గంగ్వార్‌ను కలిసి ఆస్పత్రి ఏర్పాటుపై వివరించారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించినా ఇప్పటికీ ఈఎస్‌ఐ ఆస్పత్రి కోసం ముందడుగు పడలేదు. దీంతో పాటు బాసర్, భైంసాల మీదుగా బోధన్, బాన్సువాడల నుంచి సరిహద్దులో జాతీయ రహదారి నిర్మాణం పెండింగ్‌లోనే ఉంది. జిల్లాకు రావాల్సిన కేంద్రీయ విద్యాలయం ఇప్పటికీ ఊసు లేదు. ఈసారి ఆదిలాబాద్‌ నుంచి బీజేపీకే చెందిన ఎంపీ సోయంబాపురావు ఉండటంతో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈసారైన కేంద్రం జిల్లాపై కరుణించాలని జిల్లావాసులు కోరుతున్నారు. 

రైల్వేలైన్‌ కోసం కృషి చేస్తా 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు రైల్వేలైన్‌ నిర్మాణం విషయాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తాను. త్వరలోనే రైల్వేలైన్‌ నిర్మాణంపై కదలిక తీసుకువచ్చేలా, రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేయించడంపైనా కృషిచేస్తాను. దీంతో పాటు ఇతర కేంద్ర పథకాలను తీసుకువచ్చేందుకు నావంతు ప్రయత్నం చేస్తాను. 
– సోయం బాపురావు, ఎంపీ, ఆదిలాబాద్‌ 

మరిన్ని వార్తలు