రెండూళ్ల మధ్య ‘శ్మశాన’ సమస్య

21 Apr, 2018 14:26 IST|Sakshi
కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న అడ్లూర్‌ గ్రామస్తులు

దహన సంస్కారాలనుఅడ్డుకున్న ఇల్చిపూర్‌సులు

ధర్నాకు అడ్లూర్‌ గ్రామస్తులు

కామారెడ్డి రూరల్‌:  రెండు గ్రామాల మధ్య శ్మశానవాటిక సమస్యగా మారింది. తమ గ్రామ పరిధిలో ఉన్న శ్మశాన వాటికలో వేరే గ్రామానికి చెందినవారి అం త్యక్రియలు నిర్వహించడానికి వీలు లేదంటూ ఓ గ్రామప్రజలు అడ్డుకోవడంతో మరో గ్రామ ప్రజలు మృతదేహాన్ని ఇంటివద్దే ఉంచి, ఆందోళనకు దిగారు. వివరా లు.. కామారెడ్డి జిల్లా అడ్లూర్‌ పంచాయతీ పరిధిలోని ఇల్చిపూర్‌ శివారులో శ్మశాన వాటిక ఉంది. అడ్లూర్‌ వాసులు ఎవరైనా మరణిస్తే ఇదే శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. వైకుంఠధామం విషయంలో రెండు గ్రామాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అడ్లూర్‌వాసులు తమ గ్రామ పరిధిలోని స్థలంలోనే అంత్యక్రియలు నిర్వహించుకోవాలని ఇల్చిపూర్‌ వాసులు పేర్కొంటున్నారు. శుక్రవారం అడ్లూర్‌ గ్రామానికి చెందిన ఎల్లవ్వ అనే వృద్ధురాలు మరణించింది. శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగా.. ఇల్చిపూర్‌వాసులు అడ్డుకున్నారు.

అడ్లూర్‌లోనే అంత్యక్రియలు నిర్వహించుకోవాలని సూచించారు. దీంతో మృతదేహాన్ని ఇంటివద్దనే ఉంచి, అడ్లూర్‌వాసులు గ్రామంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డీవో సర్వేయర్‌ సర్వే నిర్వహించి సర్వే నెం 191/1లో శ్మశాన వాటికకు çస్థలాన్ని కేటాయించారన్నారు. ఈ స్థలంలో గతంలో పలువురి దహన సంస్కారాలు నిర్వహించామన్నారు. శుక్రవారం గ్రామానికి చెందిన వృద్ధురాలు మరణిస్తే.. ఆమె అంత్యక్రియలను నిర్వహించకుండా ఇల్చిపూర్‌వాసులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవునిపల్లి ఎస్సై సంతోష్‌కుమార్‌ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని డీసీఎం వ్యాన్‌లో నిరసనకారులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. అనంతరం అడ్లూర్‌ ప్రజలు కలెక్టరేట్‌కు వెళ్లారు. కలెక్టర్‌ ఆర్డీవో కార్యాలయంలో ఉన్నారని తెలియడంతో అక్కడికి వెళ్లి ధర్నా చేశారు. ఆర్డీవో శ్రీను గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామ పంచాయతీ తీర్మానం ఇస్తే శ్మశాన వాటికకు స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. వృద్ధురాలి అంత్యక్రియలను శనివారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆందోళనలో సర్పంచ్‌ రాములు, మండల కోఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌ హాఫీజ్, వీడీసీ అధ్యక్షుడు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు