ఒకవైపు కరోనా.. మరోవైపు స్వైన్‌ఫ్లూ..

4 Feb, 2020 08:39 IST|Sakshi

వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ

వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

సాక్షి, రామగుండం: ‘ఒకవైపు కరోనా.. మరోవైపు స్వైన్‌ఫ్లూ..’ ప్రాణాంతకమైన వైరస్‌లు ప్రజలను వణికిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఎక్కువగా మాస్క్‌లు ధరించినవారే కనిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్ట్‌ల వద్ద వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఓ కుటుంబానికి కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు అనుమానంతో పరీక్షలు చేసిన వైద్యులు చివరికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఈ కుటుంబం ఇటీవల చైనా నుంచి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అధికారులు మాత్రం బాధిత కుటుంబ వివరాలను గోప్యంగా ఉంచారు. 

చైనాలో తొలిసారిగా..
చైనాలో తొలిసారి వెలుగు చూసిన కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ మనదేశంలోకి సైతం ప్రవేశించింది. ఈ వైరస్‌ సోకిన వ్యక్తికి వ్యాధి తీవ్రత అధికంగా ఉండడంతోపాటు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అధికంగా ఉంటుంది. దీని ప్రభావంతో ఇప్పటికే చైనాలో చాలా మంది మరణించారు. 

అలాంటి వారిని  ముట్టుకోవద్దు..
విదేశీ ప్రయాణాలు చేసేవారు తమ సహ ప్రయాణికులతో జాగ్రత్తగా ఉండాలి. జలుబు, గొంతులో గరగర, జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి.. ఎవరికైనా జలుబు చేసినట్టుగా అనిపిస్తే వారిని ముట్టుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. తొలుత ఈ వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకినట్లుగా భావిస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు నాణ్యత గల మాస్క్‌లను వాడడం మంచిది.

వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి..
ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించాలి. తుమ్మినా, దగ్గినా చేతి రుమాలను అడ్డుగా పెట్టుకోవాలి. జలుబు చేసిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే ప్రమాదం ఉంది. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అపరిశుభ్ర చేతులతో ముక్కు, నోరు తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణం చేసేవారు తరచూ సబ్బుతో చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండడం మంచిది. అంతేకాక, ప్రజా బాహుళ్యం ఎక్కువగా ఉన్న చోట్ల అనవసరంగా ఏ వస్తువులను పడితే వాటిని తాకకూడదు.

లక్షణాలు ఇవే.. 
కరోనా వైరస్‌ సోకితే జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, ఛాతిలో నొప్పి, వాంతులు తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షణాలు తీవ్రమైన న్యుమోనియోకు దారి తీసి ఊపిరాడక మనిషి మరణించే ప్రమాదమూ ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారికి జలుబు ఎక్కువగా ఉండి, ముక్కు కారుతూనే ఉంటుంది. తలనొప్పి, జ్వరం, దగ్గు, గొంతులో మంట ఉంటాయి. ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది. అంతకు మించి ఈ వైరస్‌ సోకినా వారికి వేరే ఏ లక్షణాలు కనిపించవు. ఇక ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. రెగ్యులర్‌గా సబ్బు, నీటితో చేతులు కడుక్కోవాలని చెబుతున్నారు. ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని ఎవరూ చేతులతో టచ్‌ చేయవద్దని, రోగులకు దగ్గరగా ఉండొద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు.

ఈ దేశాల్లోనూ వైరస్‌ ప్రభావం..
చైనాలోని బీజింగ్, షాంఘై, సౌత్‌ గాంగ్‌ డాంగ్‌ ప్రావిన్స్‌లోనూ చాలా మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. దక్షిణకొరియా, జపాన్, థాయ్‌లాండ్‌లోనూ ఈ వ్యాధి కేసులు వెలుగు చూశాయి. చైనాలో అనేక కేసులు అధికారికంగా నమోదైనా ఇంకా వెలుగులోకి రాని కేసులు చాలా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా