వందేళ్ల కాలంలో ఇంత వర్షం ఎప్పుడూ లేదు :కేటీఆర్‌

26 Sep, 2019 08:49 IST|Sakshi
హైదరాబాధలు: బుధవారం రాత్రి కురిసిన వర్షానికి నడుము లోతు నీటిలో ఉస్మాన్‌గంజ్‌ ఫీల్‌ఖానాలోని ఓ వీధి

వరుస వర్షాలతో అతలాకుతలం

పలు ప్రాంతాలు జలమయం, నీట మునిగిన కాలనీలు

అడ్డగుట్టలో పెంకుటిల్లు శిథిలాలు పడి ఒకరికి గాయాలు

నాచారం పోలీస్‌ స్టేషన్‌లోకి వరద నీరు

నాగమయ్యకుంట, పద్మాకాలనీల్లో భయంభయం

నాగోల్‌లో వరద నీటిలో కొట్టుకుపోయి వ్యక్తి మృతి  

బుధవారం సాయంత్రం వానకు ట్రాఫిక్‌ జామ్‌

మరో 48 గంటలు భారీ వర్షం కురిసే అవకాశం

సాక్షి,సిటీబ్యూరో: క్యుములోనింబస్‌ మేఘాలు మహానగరాన్ని వణికిస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు నగరంలో పలు చోట్ల భారీవర్షం కురిసింది. మంగళవారం తెల్లవార్లూ సరాసరిన 11 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మల్కాజిగిరి, తిరుమలగిరి, ఉప్పల్‌లో 13 సెం.మీ కుంభవృష్టి కురిసింది. నాచారం పోలీస్‌స్టేషన్, లాలాగూడ రైల్వే ఆస్పత్రుల్లోకి    వరద నీరు చేరింది. బుధవారం సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు శ్రీనగర్‌కాలనీ, ఖైరతాబాద్, విజయనగర్‌ కాలనీ, కవాడిగూడ, సర్దార్‌ మహల్, రెడ్‌హిల్స్, బాలానగర్‌ తదితర ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.

లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులపై వరదనీరు పోటెత్తింది. పలు బస్తీల్లో ఇళ్లలోకి చేరిన వర్షపునీటిని తొలగించేందుకు స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రధాన రహదారులపై ఎక్కడికక్కడే ట్రాఫిక్‌ నిలిచిపోయి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి బయలుదేరిన ఉద్యోగులు, విద్యార్థులు ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుపోయారు. కొండాపూర్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, పంజగుట్ట, కూకట్‌పల్లి, ఎస్‌ఆర్‌నగర్, హిమాయత్‌నగర్, కొత్తపేట్, చైతన్యపురి, అబిడ్స్, కోఠి తదితర ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలోకి వర్షపునీరు చేరడంతో తాత్కాలికంగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. మరో 48 గంటలు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

శివారు ప్రాంతమైన జిల్లెలగూడలోని మిథిలానగర్, సత్యసాయినగర్‌ కాలనీలను స్థానిక మంత్రాల చెరువు వరదనీరు పూర్తిగా ముంచెత్తింది. నివాసాల్లోకి నీరు చేరడంతో కాలనీవాసులు ఇళ్లకు తాళాలు వేసుకుని బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు.  
కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలకు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. గుడిమల్కాపూర్, అహ్మద్‌నగర్, గోల్కొండ, కార్వాన్, నానల్‌ నగర్, షేక్‌పేట్‌ డివిజన్లలో డ్రైనేజీ మ్యాన్‌హోళ్లు పూర్తి గా ధ్వంసమయ్యాయి. గోల్కొండ రేతిగల్లి, నయాఖిలా, తఖత్‌ బౌలి తదితర ప్రాంతాల్లో వీధుల్లో రెండు అడుగుల మేరకు వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ ప్రాంతాల్లో నివాసితులు అతికష్టం మీద బయటకు వెళ్తున్నారు.   
అడిక్‌మెట్‌ డివిజన్‌ నాగమయ్యకుంట, పద్మాకాలనీలు నీట మునిగాయి. ఇక్కడి ఇళ్లల్లో నడుములోతు నీరు చేరింది. దీంతో రాత్రి జనం కట్టుబట్టలతో రోడ్లపైకి చేరుకున్నారు. రాంనగర్‌ నాలా ప్రమాదకరంగా మారింది.  
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని సుభాష్‌నగర్, భాగ్యలక్ష్మి కాలనీల్లో మురుగునీరు రోడ్లపైకి చేరింది. సూరారం ప్రధాన రహదారిపై వరదనీరు పోటెత్తడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  
సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. నాలాల్లో పొంగిన వరదనీరు పరివాహక ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. లాలాపేట, చిలకలగూడ, బౌద్ధనగర్‌లోని బాధిత ప్రాంతాలను బుధవారం ఉదయం శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. అడ్డగుట్ట డివిజన్‌ కమ్యూనిటీ హాలు వెనుకనున్న ఓ పెంకుటిల్లు పెచ్చులూడి ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలిపై పడడంతో తీవ్ర గాయపడింది. చంద్రబాబునాయుడునగర్‌ ప్రాంతం జలమయమైంది. సీతాఫల్‌మంది డివిజన్‌ శ్రీనివాసనగర్‌ శాంతిశ్రీ అపార్ట్‌మెంట్‌ వద్ద నాలా ప్రహరీ కూలడంతో నాలాకు ఆనుకుని ఉన్న బస్తీలను వరద ముంచెత్తింది.  

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మాదాపూర్, బయో డైవర్శిటీ పార్కు కూడలి, హఫీజ్‌పేట్, చందానగర్, దీప్తిశ్రీనగర్, అల్విన్‌కాలనీ కూడలి రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. ముఖ్యంగా దీప్తిశ్రీనగర్‌ నుంచి పీజేఆర్‌ ఎన్‌క్లేవ్‌ వెళ్లే రోడ్డు చెరువును తలపిస్తోంది. రేగులకంట చెరువు నిండిపోయి పొంగి ప్రవహిస్తోంది.  
నాచారం పోలీస్‌స్టేషన్‌లోకి వరదనీరు చేరడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎర్రకుంట చెరువు పొంగడంతో నాచారానికి వచ్చే మార్గం మూసుకుపోయింది. రామంతాపూర్‌ ప్రధాన రహదారిపై ఉన్న ఇందిర ఇంపీరియల్‌ షాపింగ్‌మాల్‌ వెనుక ఉన్న ప్రహరీ కూలడంతో పక్కనే ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసమైంది.  
కంటోన్మెంట్‌ మడ్‌ఫోర్ట్‌ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలోని గదుల్లోకి నీరు చేరింది. స్లా బ్‌ లీకై బేంచీలు, టేబుళ్లు తడిచిపోయాయి. కంటోన్మెంట్‌ రేసుకోర్సు పంప్‌హౌజ్‌ చౌరస్తా నుంచి బాలంరాయి జగ్జీవన్‌రాం విగ్రహం చౌరస్తా వరకు తారు కొట్టుకుపోయి రోడ్డు గుంతలమయంగా మారింది.  
మంగళవారం రాత్రి నాగోలు ఆదర్శనగర్‌ వద్ద వరద నీటిలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. ఎల్‌బీనగర్‌ పోలీస్‌లు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది వర్షపునీటిలో అతడి కోసం వెతకగా నాగోలు భారత్‌ పెట్రోల్‌ బంకు, నిస్సాన్‌ షోరూం వద్ద  మోరీలో శవమై తేలాడు.   

ముంపు చీకట్లు
సాక్షి, సిటీబ్యూరో: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలతో సహా పలు అపార్ట్‌మెంట్ల సెల్లార్లు వరదనీటితో నిండిపోయాయి. విద్యుత్‌ మీటర్లన్నీ ఆయా అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోనే ఉండటం, వీటి నిండా నీరు చేరడంతో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ముందస్తు జాగ్రత్తగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేసింది. మంగళవారం రాత్రి నుంచి ఆయా అపార్ట్‌మెంట్లలోని నివాసితులంతా అంధాకారంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్యాంకుల్లోని నీరు ఖాళీ కావడం, సంపులోని నీరు కలుషితమవడం, తాగేందుకు కనీసం శుభ్రమైన నీరు లేకపోవడంతో పాటు ఇంట్లో కరెంట్‌ కూడా లేక చాలా మంది తమ ఇళ్లకు తాళాలు వేసి, ఇతర ప్రాంతాల్లో ఉన్న బంధువుల ఇళ్లకు చేరుకున్నారు. పాతబస్తీ సహా సికింద్రాబాద్, సైబర్‌సిటీ సర్కిళ్ల పరిధిలోని అపార్ట్‌మెంట్లలో చీకట్లు అలముకున్నాయి. ఇదిలా ఉంటే బుధవారం సాయంత్రంకురిసిన భారీ వర్షానికి కొండాపూర్‌కు చెందిన ఆడం మార్క్‌(23) కరెంట్‌షాక్‌తో చనిపోయాడు. కొండాపూర్‌ సహా మాదాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్‌పేట్, అబిడ్స్, కోఠి, ఎస్‌ఆర్‌నగర్, హిమాయత్‌నగర్, కొత్తపేట్, తదితర పాత్రాల్లోని లోతట్టు ప్రాంతాలు, కాలనీలు వరదనీటిలో చిక్కుకున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కాలనీల్లో పోటెత్తుతున్న వరదల నేపథ్యంలో ఎలాంటి విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా డిస్కం ముందస్తు చర్యలు చేపట్టింది. విద్యుత్‌ ప్రమాదాలు, కరెంట్‌ సరఫరాలో అంతరాయం నివారించేందుకు 25 అత్యవసర విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దింపింది. 7382072104/ 7382072106/ 73820 71574/9192/100 హెల్ప్‌లైన్‌ నెంబర్లను ఏర్పాటు చేసింది. 
 
నివారణలో బల్దియా
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్టు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. విపత్తులను తక్షణం ఎదుర్కొనేందుకు 384 ప్రత్యేక బృందాలతో పాటు ఈవీడీఎం విభాగం నుంచి 13 డిజాస్టర్‌ రెస్కూబృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని బుధవారం ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లోని సీసీ కెమెరాల ద్వారా, బుద్ధభవన్‌లోని కంట్రోల్‌ రూమ్‌ ద్వారా నగరవ్యాప్తంగా పరిస్థితుల్ని సమీక్షిస్తూ అధికారులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఇంజినీరింగ్‌ డివిజన్‌కు ఒక మొబైల్‌ మాన్సూన్‌ బృందాన్ని, డీసీఎం వ్యాన్‌ను అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. ఈ బృందంలో ఐదుగురు కార్మికులు, జనరేటర్, నీటిని తోడే పంపులు, చెట్లను నరికే మెషిన్లు ఉన్నాయి. ఇవికాక సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌లో 15 ఎమర్జెన్సీ బృందాలను అందుబాటులో ఉంచారు. రోడ్లపై నీటినిల్వలను తొలగించేందుకు 255 మోటార్‌ పంపులు సిద్ధంగా ఉంచారు.  అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్‌ 100, జీహెచ్‌ంఎసీ కాల్‌ సెంటర్‌ 040–21111111 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చునని  జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు.

కేటీఆర్‌ ట్వీట్‌
వందేళ్ల పైచిలుకు కాలంలో నగరంలో సెప్టెంబర్‌లో ఇంతటి భారీ వర్షం ఎప్పుడూ కురవలేదని మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంకితభావంతో, కష్టపడి పనిచేసిన జీహెచ్‌ఎంసీ, తదితర ప్రభుత్వ విభాగాల కృషికి కృతజ్ఞతలు తెలిపారు.   

మేయర్‌ అర్ధరాత్రి పర్యటన
నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మంగళవారం రాత్రి జీహెచ్‌ఎంసీ కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి పరిస్థితుల్ని సమీక్షించారు. వర్షాల వల్ల ఏవిధమైన ఇబ్బందులు లేకుండా పోలీసు, ట్రాఫిక్, జలమండలి, అగ్నిమాపక, రెవెన్యూ తదితర విభాగాలను సమన్వయం చేస్తూ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా తగు ఆదేశాలు జారీ చేశారు. అర్ధరాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కాంపాటితో కలిసి ఖైరతాబాద్‌ రైల్వే స్టేషన్, లక్డీకాపూల్, పంజగుట్ట సర్కిల్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. బుధవారం రాత్రి పంజగుట్ట నాగార్జున సర్కిల్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పరిస్థితుల్ని పరిశీలించారు. వర్షపునీరు వెళ్లకుండా అక్రమంగా పార్కింగ్‌ చేసిన వైన్స్‌ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో అక్రమ పార్కింగ్‌ను తొలగించారు. డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ సికింద్రాబాద్, సీతాఫల్‌ మండి, మోండా, రాణిగంజ్‌లలో పర్యటించి పరిస్థితులను పర్యవేక్షించారు. నాగోల్‌లోని మ్యాన్‌హోల్‌లో ఒక వ్యక్తి పడ్డట్లు సమాచారం అందడంతో మాన్సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు అక్కడకు  చేరుకొని నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు. కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ జోనల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి అప్రమత్తం చేశారు.

మరిన్ని వార్తలు