ప్రజలకు సేవలందించడం వరం

5 May, 2018 08:23 IST|Sakshi
రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే డీకే అరుణ

గద్వాల : ప్రజలకు సేవలందించే అవకాశం తనకు భగవంతుడు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. శుక్రవారం తన పుట్టిన రోజు సందర్భంగా జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడి ప్రజలకు స్వయంగా సేవలందించే అవకాశం కలగడం వరంగా భావిస్తున్నానన్నారు. అధికారంలో ఉన్నంత కాలం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి, వివిధ అభివృద్ధి పనులను చేపట్టి నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచేందుకు యత్నిస్తున్నానన్నారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ వంతు బాధ్యతగా గ్రామాల్లో సామాజిక సేవలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు బండల పద్మావతి, గద్వాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కృష్ణవేణి, వైస్‌చైర్మన్‌ శంకర్, పార్టీ నాయకులు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, వేణుగోపాల్, సలాం, బండల వెంకట్రాములు, రామంజనేయులు, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డీకే అరుణకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

121 మంది రక్తదానం

మొదట ఇంట్లో పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య ఎమ్మెల్యే డీకే అరుణ కేక్‌ కట్‌ చేసి జన్మదినాన్ని జరుపుకొన్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యేకి పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన స్వగృహ ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో పార్టీ నాయకులతోపాటు పలువురు కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు 121మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరుణ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని రక్తదానంతో కాపాడొచ్చన్నారు. రక్తదానాన్ని ఇతరులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కో–ఆప్షన్‌ సభ్యుడు ఇంతియాజ్‌ ఆధ్వర్యంలో జిల్లా ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

బీచుపల్లిలో ప్రత్యేక పూజలు..

ఇటిక్యాల (అలంపూర్‌) : తన జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ బీచుపల్లి పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆంజనేయస్వామి ఆలయ పూజారి మారుతీచారి, ఈఓ రామన్‌గౌడ్, వాల్మీకి పూజరులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటారు.

మరిన్ని వార్తలు