'మధురం' మాటున విషం

2 May, 2015 10:40 IST|Sakshi
'మధురం' మాటున విషం

 

  •      కాల్షియం కార్బైడ్‌తో మామిడిపండ్లను మగ్గిస్తున్న వ్యాపారులు
  •      సహజ రుచిని కోల్పోతున్న రాజఫలం
  •      అనారోగ్యం ఖాయమంటున్న వైద్యులు

 ఘట్‌కేసర్ టౌన్: ఫలరాజంగా పేరుగాంచిన మామిడిపండ్లు మాధుర్యానికి మారుపేరు. జనాలు డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తూ ఇష్టంగా తింటుంటారు. వేసవిలో మార్కెట్‌ను ముంచెత్తే మామిడి పండ్లు.. వ్యాపారుల కక్కుర్తితో విషమయమవుతున్నాయి. ఈవిషయమై చాలామందికి తెలియదు. కొందరు వ్యాపారులు లాభాపేక్షతో మామిడికాయలు త్వరగా పక్వానికి వచ్చేందుకు రసాయనాలు ఉపయోగిస్తున్నారు. సహజ పద్ధతులను విడిచిపెట్టి ఫలరాజాన్ని కాల్షియం కార్బైడ్‌తో మగ్గిస్తున్నారు. దీంతో మామిడిపండ్లు చూడడానికి ఆకర్షణగా కనిపించినా రుచిలో మాత్రం తేడా కనిపిస్తుంది.  
 ముందే మార్కెట్‌ను ముంచెత్తిన పండ్లు..
 వ్యాపారుల లాభాపేక్ష కారణంగా నేడు మామిడిపండ్లు విషపూరితమవుతూ జనాలకు అనారోగ్యాన్ని పంచుతున్నాయి. మామిడిపండ్లు పక్వానికి రాకముందే తెంపడం, గాలులకు రాలిన కాయలను కాల్షియం కార్బైడ్‌తో పక్వానికి వచ్చేలా చేస్తున్నారు. రసాయనాల ద్వారా మామిడికాయలను 24 గంటల్లోనే పండ్లుగా మారుస్తున్నారు. దీంతో మామిడిపండ్లు ఆకర్షణగా కనిపిస్తాయి.  లోపల మాత్రం తెలుపురంగులో పుల్లగా రుచిలేకుండా ఉంటాయి. కొందరు వ్యాపారులు కాల్షియం కార్బైడ్ ఉపయోగిస్తూ సొమ్ము చేసుకుంటూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అసహ జ పద్ధతుల ద్వారా మగ్గిన పండ్లను తింటే ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం కాల్షియం కార్బైడ్ వినియోగాన్ని నిషేధించింది. అయినా వ్యాపారులు యథేచ్ఛగా వినియోగిస్తూ నిబంధనలకు ఉల్లంఘిస్తున్నారు. పర్యవేక్షించవలసిన సంబంధిత అధికారులు చేష్టలుడిగి వ్యవహరిస్తున్నారు. మండల పరిధిలోని అన్నోజీగూడ, నారపల్లి, జోడిమెట్ల తదితర ప్రాంతాల్లో జాతీయ రహదారిపై కొందరు వ్యాపారులు కాల్షియంతో మగ్గించిన మామిడిపండ్లను విక్రయిస్తున్నారు.
 ఆరోగ్యం గుల్ల..  
 కాల్షియం కార్బైడ్‌తో మగ్గించిన పండ్లను తినడం వల్ల ప్రధానంగా గర్భిణులు, చిన్నారులను పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నారుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, గర్భిణులకు విరేచనాలు, కంటి సంబంధ వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. కాన్సర్, అల్సర్, లివర్, మూత్రపిండాల వ్యాధులు వస్తాయి. కార్బైట్ ద్వారా వెలువడే ఎసిటలిన్ వాయువు కారణంగా నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలికంగా తలనొప్పి , జ్ఞాపక శక్తి కోల్పోయే ప్రమాదముంది.
 -ప్రసాద్, కమ్యూనిటీ ఆస్పత్రి వైద్యాధికారి

మరిన్ని వార్తలు