స్మార్ట్ సిటీ@నీలగిరి..! | Sakshi
Sakshi News home page

స్మార్ట్ సిటీ@నీలగిరి..!

Published Sat, May 2 2015 10:15 AM

smart city @neelagiree

  •     నల్లగొండ మున్సిపాలిటీకి మహర్దశ
  •      ఐదేళ్ల పాటు ఏటా రూ.100 కోట్లు వచ్చే అవకాశం
  •       ఇక నూరు శాతం మౌలిక సదుపాయాలు
  •       సెంట్రల్ గవర్నమెంట్ మానిటరింగ్ కమిటీ ద్వారా అభివృద్ధి పనులు
  •  నల్లగొండ: జిల్లా కేంద్ర మున్సిపాలిటీకి మహర్దశ పట్టనుంది. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయనున్న స్మార్ట్ సిటీలలో నీలగిరి మున్సిపాలిటీ ముందంజలో ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే నీలగిరి మున్సిపాలిటీని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా ఎంపిక చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన జీఓ అధికారికంగా వెలువడడమే తరువాయిగా మిగిలింది. ఇటీవల కాలంలో జిల్లాలోనే  ఈ మున్సిపాలిటీ అత్యంత వేగంగా విస్తరించింది. నల్లగొండ మున్సిపాలిటీ మొత్తం 105 స్క్వైర్ కిలోమీటర్ల వరకు విస్తరించింది.
     ప్రతి ఏడాది రూ.100 కోట్లు విడుదల
     నీలగిరి మున్సిపాలిటీ స్మార్ట్ సిటీగా ఎంపికైతే దీని రూపు రేఖలు పూర్తిగా మారనున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో వంద శాతం అన్ని రకాల మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక కార్యచరణ తయారు చేయనున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఏడాది పాటు సర్వే చేసి పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనలు తయారు చేయనున్నారు. పట్టణంలో ఏఏ అభివృద్ధి పనులు చేపట్టాలనే దానిపై పూర్తి నివేదిక రూపొందించుకుని దాని ప్రకారం ముందుకు సాగే అవకాశం ఉంది. పట్టణంలో ఎక్కడ ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మించాలి ... 24 గంటల పాటు తాగునీరు ఎలా అందించాలి ... రోడ్లు, పట్టణ శివారు నుంచి ఔటర్ రింగ్ రోడ్ లాంటి పనులు చేపట్టడానికి కార్యచరణ తయారు చేయనున్నారు. ఈ అభివృద్ధి పనులు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు విడుదల చేయనుంది. ఐదేళ్ల పాటు ఈ నిధులు విడుదల చేసి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు వంద శాతం మౌలిక వసతులు కల్పించనున్నారు.
     అక్రమాలకు చెక్ ...
     స్మార్ట్ సిటీగా మారగానే మున్సిపాలిటీ కార్యాలయంలో కోట్ల రూపాయల అవినీతి అక్రమాలకు చెక్ పడనుంది. ప్రతి ఒక్కటి ఆన్‌లైన్ చేసి మున్సిపాలిటీ ఆదాయం పెంచడంతో పాటు పారదర్శకతకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. నల్లా కనెక్షన్లు, ఆస్తిపన్నుల రికార్డులు, పన్నుల వసూళ్లు, ఇంజనీరింగ్ విభాగం పనుల వివరాలు ఇలా అన్ని ప్రతి ఒక్కటి ఆన్‌లైన్ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే కోట్ల రూపాయల నిధులు పారదర్శకతతో చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా ఒక మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీ అంతా రాష్ట్ర ప్రభుత్వ కో ఆర్డినేషన్‌తో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేయనున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement