తొలి విడత ఓకే

24 Feb, 2019 09:51 IST|Sakshi

మహబూబ్‌నగర్‌ రూరల్‌: రాష్ట్రప్రభుత్వం రైతుబంధు పథకంతో అన్నదాతలకు అండగా నిలుస్తుండగా.. కేంద్రప్రభుత్వం సైతం తన వంతు ఆసరా ఇవ్వడానికి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతు కుటుంబాలకు ఏటా మూడు విడతలుగా రూ. 6వేల ఆర్థిక సాయం అందనుంది. ఇందులో భాగంగా తొలి విడత నగదు జమ చేసేందుకు అర్హుల గుర్తింపు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు తాజా బడ్జెట్‌లో ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే.

ఈ పథకం కింద రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది. అర్హులైన రైతులను గుర్తించేందుకు వ్యవసాయశాఖ అధికారులు అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి జాబితాలు రూపొందించారు. ఈ జాబితాలను గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించి అనర్హులు ఉంటే పేర్లు తొలగించారు. అదే సమయంలో అర్హుల పేర్లు జాబితాలో లేకపోతే వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఇక అర్హులుగా అధికారులు గుర్తించిన రైతులు బ్యాంకు ఖాతాల వివరాలు అందజేయగా.. ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం ఆదివారం ప్రారంభించనుంది. 

కుటుంబం యూనిట్‌గా... 
ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింద ప్రతీ రైతు కుటుంబాన్ని ఒక యూనిట్‌గా గుర్తించారు. కుటుంబ సభ్యులందరి వ్యవసాయ భూమి ఐదు ఎకరాల్లోపు ఉంటేనే ఈ పథకానికి అర్హులు. తెల్ల రేషన్‌కార్డు ప్రాతిపదికన అర్హులైన రైతుల జాబితాను తయారు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లిస్తున్న వారు ఈ పథకానికి అనర్హులు. మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు, చట్టసభలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారు, నెలకు రూ. 10వేల కన్నా ఎక్కువ పింఛన్‌ పొందుతున్న విశ్రాంత ఉద్యోగులూ అనర్హులే. ఇక వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, ఇతర ప్రొఫెషనల్‌ వృత్తుల వారు దరఖాస్తు చేసుకున్నా ఈ పథకం వర్తించదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైతుల వివరాల నుంచి రెవెన్యూ భూరికార్డులు, రేషన్‌కార్డుల్లోని వివరాలు, ఆదాయపు పన్ను శాఖ వివరాలు, ట్రెజరీ నుంచి వేతనం తీసుకునే వారి వివరాలు తీసుకుని అర్హుల జాబితా రూపొందించారు. 

రెండు జిల్లాల్లో కలిపి..
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని 26 మండలాల్లో తొలి విడతగా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధికి అర్హులైన రైతులు 1,17,451 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని ఆధారంగా గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. గ్రామసభల్లో దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలను వ్యవసాయ విస్తరణాధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయం, కేంద్రం కొత్తగా ప్రకటించిన సాయం వేర్వేరుగానే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా తొలి విడతలోరైతుల వివరాలపై ఏఓలు సర్వే చేయగా అందులో 1,17,451 మందిని అర్హులుగా, 729 మంది అనర్హులుగా గుర్తించారు. అయితే అర్హులుగా ఎంపికైన వారిలో 14,128 మంది రైతులు తమ బ్యాంకు వివరాలను సమర్పించలేదని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని అర్హులైన రైతులకు తొలి విడతగా రూ.2వేల చొప్పున రూ.23.49 కోట్ల సాయం అందనుంది. 

నేటి నుంచి.. 
పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పథకాన్ని ఆదివారం లాంఛనంగా ప్రారంభించనుండడంతో అందుకు అనుగుణంగా జిల్లాలో డివిజన్‌ స్థాయిలో కార్యక్రమం నిర్వహించేం దుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు జిల్లాలోని అదనపు వ్యవ సాయ అధికారులతో జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత శనివారం సమావేశమై పథకంపై చర్చించారు. పథకం తీరుతెన్నులు, అర్హుల ఎంపికలో పాటించాల్సిన అంశాలపై ఆరా తీశారు. 

మరిన్ని వార్తలు