పేదల పెన్నిధి పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌ 

4 Apr, 2019 15:08 IST|Sakshi
కేకు కట్‌ చేస్తున్న వైద్యులు

చేయూతనిస్తున‍్న పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌

 ఏడాది పూర్తయిన  సందర్భంగా  వేడుకలు 

సాక్షి, పాలమూరు: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చివరి దశలో ఉన్న క్యాన్సర్‌ నిరుపేదలకు పాలియేటివ్‌కేర్‌ ఎంతో చేయూతను అందిస్తోందని పాలమూరు మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జనరల్‌ ఆస్పత్రి ఆవరణలో పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా పుట్టా శ్రీనివాస్, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకిషన్‌ హాజరై కేకు కట్‌ చేశారు. ఆనంతరం వారు మాట్లాడుతూ ఈ ఏడాదిలో పాలియేటివ్‌ కేర్‌ ద్వారా 782 ఓపీ కేసులు,  276ఐపి రోగులకు, 934 క్యాన్సర్‌ రోగులకు ఇంటికి వెళ్లి చికిత్స అందించినట్లు తెలిపారు. 

చివరి దశలో..
క్యాన్సర్‌ రోగి చివరి దశలో నొప్పి లేని జీవితం గడపటానికి ఈ సేవ కేంద్రం ఉపకరిస్తోందని పుట్టా శ్రీనివాస్, రాంకిషన్‌ అన్నారు. జిల్లాలో కేన్సర్‌ వ్యాధిపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగహన ఉండడం లేదన్నారు. మారిన జీవన పరిస్థితుల కారణంగా అప్పుడే జన్మించిన చిన్నారుల నుంచి పండు ముసలి వరకు ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖ ద్వారా కేన్సర్లు పంజా విసురుతున్నాయన్నారు. వ్యాధి సోకుతున్న వారిలో గ్రామీణ ప్రాంతాల వారే అధికంగా ఉంటున్నారని తెలిపారు. గతంలో గర్భాశయ ముఖద్వారా కేన్సర్‌ 50ఏళ్లపైబడి మోనోపాజ్‌ దశలో ఉన్న వారికే మాత్రమే వచ్చేదని తెలిపారు. 

నోటి క్యాన్సర్‌ ప్రమాదం..
జిల్లాలో  నోటి  క్యాన్సర్‌  ప్రమాదం  ఎక్కువ    ఉందని పుట్టా   శ్రీనివాస్,  రాంకిషన్‌  అన్నారు. ఇక్కడ   బీడీ కార్మికులు,  వ్యవసాయ  కూలీలు  అధికంగా  ఉండడంతో వీరు బీడీ, సిగరెట్లు, గుట్కా, జర్దా, పాన్‌మసాలా  తదితర  విరివిగా  వినియోగిస్తుండడంతో  నోటి  క్యాన్సర్లు  పెరుగుతున్నట్లు  తెలిపారు. ప్రస్తుతం  యువత అధికంగా నోటి కేన్సర్‌ భారిన పడుతున్నట్లు వెల్లడించారు. నాలుక, దవడ, పెదవి, గొంతు తదితర అవయవాలు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు తెలిపారు.

వ్యాధి నివారణకు
క్యాన్సర్‌ వచ్చిన తర్వాత చికిత్స తీసుకునే కన్నా.. వ్యాధి రాకుండా జీవనశైలిలో మార్పు తెచ్చుకోవడం ఉత్తమమని పుట్టా శ్రీనివాస్,  రాంకిషన్‌ అన్నారు. గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ రాకుండా జననావయవాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. లైంగిక సంబంధాలు కలిగి ఉండకపోవడంతో సుఖ వ్యాధులు సోకే ప్రమాదం తప్పుతుందన్నారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని చాలా వరకు  తగ్గించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ జ్యోతి, రవికుమార్, అరుణ్‌కుమార్, ఉషారాణి, భారతి, నిర్మల, చందు, స్వప్న, సుజాత, సంతోష, యాదమ్మ, సత్యమ్మ, రాధ, బాల్‌రెడ్డి పాల్గొన్నారు. 
   

మరిన్ని వార్తలు