ఫిర్యాదా? మేమే వస్తాం..

6 Jan, 2019 02:04 IST|Sakshi

బాధితుల ఇంటికే పోలీసులు 

కొత్త ఏడాదిలో  పోలీస్‌ శాఖ వినూత్న ప్రయోగం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు పోలీస్‌ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రజల వద్దకే పోలీస్‌ సేవల పేరుతో ఏకరూప పోలీసింగ్‌ సేవలను విస్తరించాలని నిర్ణయించింది. ప్రజల వద్దకు పోలీస్‌ పేరుతో 15 రోజుల పాటు అన్ని గ్రామాలు, పల్లెలు, కాలనీలు, అపార్ట్‌మెంట్లు, వ్యాపార సముదాయాలు.. ఇలా అన్ని ప్రాంతాల్లో సంబంధిత శాంతి భద్రతల విభాగం పోలీసులు పర్యటిస్తారు. అక్కడి ప్రజలతో సమావేశాలు ఏర్పాటుచేసి ఇంకా పోలీస్‌ శాఖ నుంచి ఎలాంటి సేవలు కావాలో ఆరా తీయనున్నారు. సంబంధిత సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తారు. ఇలా ప్రజల నుంచి గుర్తించిన సమస్యలపై ఆయా జిల్లాల బాధ్యులుగా ఉన్న ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీలతో సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, కమిషనరేట్ల నుంచి వచ్చిన అంశాలపై డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.  

నేరుగా ఇంటి నుంచే: పోలీస్‌ సేవలను యాప్స్‌ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన పోలీస్‌ శాఖ మరో అడుగు ముందుకు వేసి బాధితుల ఇంటి నుంచే ఫిర్యాదులు తీసుకోనుంది. అదే విధంగా అక్కడి నుంచే టెక్నాలజీ సహాయంతో ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేసేందుకు చర్యలు చేపట్టనుంది. ప్రస్తుతం మహిళా సంబంధిత నేరాల్లో బాధితుల ఇంటికే పోలీసులు వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇప్పుడదే రీతిలో టీఎస్‌ కాప్‌ యాప్‌ ద్వారా సంఘటనా స్థలంలోనే కేసులు నమోదు చేసే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.

ఎస్పీలు, కమిషనర్లతో  డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌.. 
ఏకరూప పోలీసింగ్, ఏకరూప సర్వీస్‌ డెలివరీ విధానంపై డీజీపీ మహేందర్‌రెడ్డి జిల్లా ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీలతో శనివారం ఆయన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినందుకు సంబంధిత అధికారులందరినీ డీజీపీ అభినందించారు. ఈ ఏడాది చేపట్టబోతున్న ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఏకరూప పోలీసింగ్‌ విధానం అమలు కోసం ప్రతీ ఒక్కరు అంకితభావంతో పనిచేయాలని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే అందజేస్తామని డీజీపీ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు