నగరానికి ఇవాంకా.. బిచ్చగాళ్లు ఆ వంక!

9 Nov, 2017 01:16 IST|Sakshi
హబీబ్‌నగర్‌ నుంచి యాచకులను తరలిస్తున్న పోలీసులు

వాణిజ్య సదస్సు నేపథ్యంలో బిచ్చగాళ్ల కోసం పోలీసుల గాలింపు

ఆనందాశ్రమాలకు 126 మంది తరలింపు

బాండ్‌ ఇచ్చిన వారిని విడిచిపెడుతున్న జైళ్ల శాఖ

సాక్షి, హైదరాబాద్‌: బిచ్చగాళ్ల కోసం గాలింపు మొదలైంది. కనిపించిన వారి నల్లా పోలీసులు అదుపులోకి తీసుకుం టున్నారు. నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో యాచనను నిషేధిస్తూ మంగళవారం వెలువడిన ఉత్తర్వులు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై బిచ్చగాళ్ల కోసం గాలించడం, చిక్కిన వారిని ఆనందాశ్రమాలకు తరలించడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ వాణిజ్య సదస్సు, అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్‌ రాక నేపథ్యంలో ఆపరేషన్‌ ‘బెగ్గర్‌ ఫ్రీ సిటీ’ సాగుతోంది. బుధవారం నగర పోలీసులు దాదాపు 70 మంది బిచ్చగాళ్లను పున రావాస కేంద్రాలకు తరలించారు. మరికొందరికి స్థాని కంగా కౌన్సెలింగ్‌ ఇచ్చి వారి స్వస్థలాలకు పంపారు.

ప్రత్యేక నిఘా...
ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసులు బహిరంగ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. రహదారులు, జంక్షన్లు, పార్కులు, ప్రార్థనామందిరాల వద్ద బిచ్చగాళ్ల కదలికల్ని గమనిస్తున్నారు. రహదారులపై కనిపించిన బిచ్చగాళ్ల వివరాలను ట్రాఫిక్‌ పోలీసులు శాంతిభద్రతల విభాగానికి అందిస్తున్నారు. ఆయా చోట్ల చిక్కిన బిచ్చగాళ్లకు పోలీసులు తొలుత కౌన్సెలింగ్‌ ఇస్తూ ప్రతిఘటన ఎదురుకాకుండా చూస్తున్నారు. ప్రస్తుతం శీతాకాలం కావడంతోపాటు వాతావరణ మార్పుల నేపథ్యంలో కొందరు బిచ్చగాళ్లు అనారోగ్యానికి గురై కన్నుమూశారని, ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారిపై దాడులు, హత్యలు సైతం జరిగాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలోని ఆనందాశ్రమాలకు తరలిస్తున్నామంటూ నచ్చజెబుతున్నారు. 

పని చేస్తే నగదు చెల్లింపు...
బిచ్చగాళ్లు మాత్రం ఈ నోటిఫికేషన్లు, ఆపరేషన్లు, సదస్సుల విషయం తమకు తెలియదని వాపోతు న్నారు. భిక్షమెత్తుకోనివ్వకపోతే తమ కడుపు నిండేది ఎలాగంటూ పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఆ ఆశ్రయాల్లో వీరికి ఆహారం, వస్త్రాలు, వైద్యం తదితర సౌకర్యాలు కల్పించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. కర్మాగారాల్లో పని చేయడానికి ఆసక్తి చూపినవారికి ఎనిమిది గంటలకు రూ.400 చొప్పున చెల్లిస్తున్నారు.

బాండ్‌ రాసి ఇస్తే ఇళ్లకు
ఆసక్తి ఉన్న బిచ్చగాళ్లకు విద్య, వృత్తివిద్యల్లో శిక్షణలు ఇచ్చి నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల జీతం వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఎవరైనా తమ ఇళ్లకు వెళ్లిపోవాలని అనుకున్నా, వారికోసం సంబంధీకులు వచ్చినా మరోసారి బిక్షాటన చెయ్యమంటూ బాండ్‌ రాయించుకుంటున్నాం. ఈ రకంగా ఇప్పటికే 40 మందిని వారి ఇళ్లకు పంపాం. ఇలా వెళ్లినవారు మళ్లీ నగరంలో బిచ్చమెత్తుతూ చిక్కితే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు.
– వీకే సింగ్, జైళ్ళ శాఖ డీజీ

మరిన్ని వార్తలు