అటా.. ఇటా..?

25 Mar, 2018 13:04 IST|Sakshi

డోలాయమానంలో నేతలు

భవిష్యత్తు అవకాశాలపై ఆశలు

కొత్త పార్టీల్లో చేరికలపై లెక్కలు

ఎన్నికల వేళ వలసల గోల

ఉమ్మడి జిల్లాలో రసవత్తరంగా రాజకీయం

సాధారణ ఎన్నికలకు పట్టుమని పది నెలలు కూడా లేవు. ఇప్పటికే సహకార సంఘాల పాలక మండళ్ల పదవీ కాలపరిమితి ముగిసింది. రేపో మాపో పంచాయతీ పాలక మండళ్లు కూడా అధికార పీఠాన్ని కోల్పోనున్నాయి. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు మండల, జిల్లా పరిషత్, పుర పాలక సంఘాల పదవీ కాల పరిమితి కూడా ఏడాది లోపే ఉంది. వచ్చే ఎన్నికల్లో ఇదే పార్టీలో ఉంటే అవకాశం దక్కుతుందా..? కొత్త పార్టీలోకి వెళ్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది..? ఒక వేళ పార్టీ మారితే ఎందులోకి వెళ్లాలి..? అక్కడ ఎవరైనా అవకాశాలు దక్కకుండా అడ్డుపడే అవకాశముందా..? ఇవీ పార్టీలకు అతీతంగా జిల్లాలో సగటు రాజకీయ నాయకుడిని వేధిస్తున్న ప్రశ్నలు. ఎన్నికల వేళ జోరుగా రాజకీయ వలసలు సాగుతాయనే ప్రచారం నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు భవిష్యత్తు దారి వెతుక్కునే ప్రయత్నాల్లో ఉన్నారు. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
   

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు గోదావరి అంజిరెడ్డి శనివారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ రాజకీయ గురువు నాగం జనార్దన్‌రెడ్డి బాటలో పయనిస్తామని స్పష్టం చేశారు. నాగం జనార్దన్‌రెడ్డి త్వరలో కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం నేపథ్యంలో గోదావరి, అంజిరెడ్డి దంపతులు సైతం అదే పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే తరహాలో ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో త్వరలో రాజకీయ వలసలు ఊపందుకునేలా ఉన్నాయి.

జిల్లా అంతటా టీఆర్‌ఎస్‌ బలమైన నాయకత్వం, పార్టీ యంత్రాంగాన్ని కలిగి ఉంది. కాంగ్రెస్‌ పార్టీ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల బలహీన లేదా బహుళ నాయకత్వంతో సతమతమవుతోంది. టీడీపీ జిల్లా రాజకీయ చిత్రపటం నుంచి దాదాపు కనుమరుగు కాగా, బీజేపీ ఆశించిన స్థాయిలో పుంజుకోలేక పోతోంది. దీంతో పార్టీ మారాలని అనుకుంటున్న నేతలు ఏ రాజకీయ పక్షం గూటికి చేరాలనే అంశంపై తర్జన భర్జన పడుతున్నారు. టీఆర్‌ఎస్‌లో జహీరాబాద్‌ అసెంబ్లీ స్థానం మినహా మిగతా అన్ని చోట్లా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో తమకు అవకాశం దక్కుతుందనే అంచనాతో కొందరు ప్రయత్నాలు చేస్తున్నా రు. కాగా, నారాయణఖేడ్, జహీరాబా ద్‌ నియోజకవర్గాల్లో కొందరు ఇతర పార్టీల నేతలు ఎన్నికల నాటికి అధికార పార్టీ గూటికి చేరేందుకు అంతర్గతంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

అధికార పక్షమా..? విపక్షమా..?
టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతలు, కార్యకర్తలతో పాటు, వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలతో అన్ని స్థాయిల్లోనూ తీవ్ర పోటీ నెలకొంది. దీంతో వలస నేతలు అధికార టీఆర్‌ఎస్‌తో పాటు, విపక్షంలో ఏ పార్టీ వైపు మొగ్గు చూపాలనే అంశంపై తీవ్ర మీమాంస ఎదుర్కొంటున్నారు. టీడీపీలో శ్రీకాంత్‌గౌడ్‌(పటాన్‌చెరు), శ్రీశైలం (అందోలు), నరోత్తం(జహీరాబాద్‌), విజయపాల్‌రెడ్డి (నారాయణఖేడ్‌), గంగాధర్‌రావు(మెదక్‌), ప్రతా ప్‌రెడ్డి(గజ్వేల్‌) తదితరులు పార్టీలో కొనసాగుతున్నారు. జాతీయ స్థాయి లో బలంగా ఉన్న బీజేపీలోకి జిల్లా స్థాయిలో ఆశించిన రీతిలో వలసలు జరగడం లేదు.

ఏడాదిన్నర క్రితం పటాన్‌చెరు నుంచి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ మినహా చెప్పుకోదగిన నేతలెవరూ పార్టీ వైపు చూడడం లేదు. దీంతో వివిధ పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలు టీఆర్‌ఎస్‌ తర్వాత కాంగ్రెస్‌కు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్‌కు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏక నాయకత్వం లేకపోవడంతో వలస నేతలు ఎవరిని సంప్రదించాలో తెలియక సతమతమవుతున్నారు. పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవల రేవంత్‌రెడ్డి ద్వారా టీడీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు శశికళ యాదవరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.

త్వరలో నాగం ద్వారా గోదావరి అంజిరెడ్డి కాంగ్రెస్‌ బాట పట్టనున్నారు. ఇతర నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు, సమన్వయ లోపం తదితరాలతో ఇతర పార్టీలో పేరున్న నేతలు చేరేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఎన్నికల నాటికి ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలు కాంగ్రెస్‌ వైపునకు వస్తారని పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకత్వం జిల్లాలో ఇతర పార్టీల్లోని అసంతృప్తులు, సొంత పార్టీలోని అసమ్మతివాదులపై ఓ కన్నేసింది. సొంత పార్టీ నేతలను కట్టడి చేస్తూనే ఇతర పార్టీల నుంచి మరింత మందిని చేర్చుకునే ప్రయత్నాల్లో ఉంది.

మరిన్ని వార్తలు