గృహనిర్మాణ సంస్థలో కుర్చీలాట

19 Jun, 2017 02:46 IST|Sakshi

► ‘సొంత’ అధికారి గాలిలో.. మరో శాఖ అధికారికి పోస్టింగ్‌
► రాజకీయ ఒత్తిళ్లే కారణమని ప్రచారం


 హైదరాబాద్‌: ఆ శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ అకస్మాత్తుగా సెలవుపై వెళ్లారు. దీంతో మరో శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన చీఫ్‌ ఇంజినీర్‌కు రెండు సంవత్సరాల పొడిగింపు ఇచ్చి ఇక్కడ కుర్చీ వేసి కూర్చోబెట్టారు. సీఈ సెలవు ముగిసి తిరిగి విధుల్లో చేరినా కూర్చోడానికి కనీసం కుర్చీ లేదు. ఇది గృహనిర్మాణ శాఖలో నెలకొన్న అయోమయం.     

గృహనిర్మాణ సంస్థ చీఫ్‌ ఇంజినీర్‌గా ఉన్న ఈశ్వరయ్య 4 నెలలక్రితం ఉన్నట్టుండి సెలవుపై వెళ్లారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకే ఆయన సెలవు పెట్టినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ తర్వాత మరో నెలపాటు ఆయన సెలవును పొడిగించారు. 2 నెలల క్రితం గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌కు రిపోర్టు చేసి తిరిగి విధుల్లో చేరారు. కానీ, అప్పటికే ప్రభుత్వం పంచాయతీరాజ్‌ శాఖలో సీఈగా పనిచేస్తున్న సత్యమూర్తికి గృహనిర్మాణ శాఖ సీఈ బాధ్యతను అప్పగించింది. గత నెలాఖరున సత్యమూర్తి పదవీ విరమణ చేసినప్పటికీ, రెండేళ్ల పొడిగింపు ఇస్తూ ఆయనను గృహనిర్మాణ శాఖ సీఈగా నియమించారు. దీంతో ఈశ్వరయ్య పరిస్థితి గందరగోళంగా మారింది. ఆయన కూర్చోడానికి కుర్చీ కూడా లేకపోవటంతో ఇంటికే పరిమితమయ్యారు. ఇక్కడ పోస్టింగు కూడా ఇవ్వకపోవటంతో గందరగోళం నెలకొంది.

రాజకీయ కారణాలతోనే..?
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సీఎం కేసీఆర్‌ చెప్తూ వస్తున్నారు. ఆ మేరకు ఆయన 2014లోనే సీఐడీ విచారణకు ఆదేశించారు. కానీ విచారణ నివేదికను బహిర్గతం చేయలేదు.  ఏకంగా గృహ నిర్మాణ సంస్థను రద్దు చేస్తున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఇదే సమయంలో ఈశ్వరయ్య సెలవు అంశం చర్చనీయాంశంగా మారింది. సీఐడీ నివేదిక ప్రకారమే ఆయనపై చర్య తీసుకున్నారా అంటే.. అసలు ఆ నివేదికే బహిర్గతం కాలేదు. మరి ఈశ్వరయ్యను ఎందుకు సెలవులో పంపారో, ఇప్పుడు ఎందుకు పోస్టింగ్‌ ఇవ్వలేదో కారణాలు వెలుగులోకి రానప్పటికీ, దీనికి రాజకీయ ఒత్తిళ్లే కారణమన్న ప్రచారం అధికారుల్లో ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఈశ్వరయ్య కొందరు టీఆర్‌ఎస్‌ నేతల మాటలను పట్టించుకోలేదని ఆ కారణం తోనే ఆయనకు ఆ సంస్థలో సీటు లేకుండా పోయిందన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై మాట్లాడ్డానికి ఈశ్వరయ్యసహా ఉన్నతాధికారులెవరూ ఇష్టపడటం లేదు. ఆయన డిప్యుటేషన్‌ ఫైలు ఆర్థిక శాఖలో మూలుగుతున్నట్టు సమాచారం.
 

మరిన్ని వార్తలు