పూడిక తీయించిండ్లు.. ప్రాజెక్టులు కట్టించిండ్లు..

26 Mar, 2019 08:29 IST|Sakshi

బాతాఖానీ

ఏమోయ్‌ రాములు.. ఇంట్లున్నవానోయ్‌.... ఏంజేత్తన్నవేంది అనుకుంట రాములు ఇంట్ల అడుగు బెట్టిండు ఆయనకు బావ వర్సయ్యే ఎంకటి. గల్మ లోపల్కి అడుగుబెట్టి తొంగి చూసిన ఎంకటికి మంచంల పడ్కొనున్న రాములు కన్పించిండు. ఎంటనే ఎంకటి మంచం కాడికి పోయి ‘బారెడు పొద్దెక్కి ఎండ సుర్రుసుర్రు అంటంది, నీకింకా తెల్లారలేదానోయ్‌.. ముస్కేసుకుని కాళ్లు నిర్రదన్ని పడుకున్నవ్‌ అనుకుం’టా నిర్ధపోతున్న రాములును భుజం తట్టి లేపిండు ఎంకటి.

ఆ.. ఆ.. ఎవలాళ్లు.. అనుకుంటా నిర్ధకు మూస్కపోయిన రెండు కండ్లను చేతులతోని తడుముకుంటా ఆవులింపు తీస్కుం టా ఒక్కసారిగా కండ్లు దెర్సి సూసిండు రాములు.
ఎదురుంగ ఎంకటి బావ కనిపించే సరికి ‘శెనార్తోయ్‌ బావ, ఎప్పుడచ్చినవేంది’ అని పల్క రించుకుంటా మంచంలకెళ్లి లేచిండు రాములు. అంతట్లనే అంతా మంచిదేనానోయ్‌ బావ, ఏందో గిట్ల పొద్దుగాల్నే అచ్చినవేందని అడ్గుతుండంగనే ఇరుగుపొరుగోళ్లు చంద్రయ్య, సీతయ్య, పరశురాము ముగ్గురు మోపై అప్పుడే రాములింటి కచ్చిండ్లు. ఆళ్లను సూడంగనే రాములు, ఎంకటి ఒకలకొకలు శెనార్థులు పెట్టుకుని ఇంటి గల్మ అర్గు మీద కూసున్నరు.

‘ఏంది ఎంకన్న పొద్దుగాళ్లనే నీ బామ్మర్ది రాములింటికచ్చినవ్‌ ఏందీ? ఏందైనా దావత్‌కు పిల్వడానికి అచ్చినవా?’ అని అడిగిండు పరశురాము.
‘గదేం లేదు పరశురాము. ఎంపీ ఎలచ్చన్లు అచ్చినయ్‌ గదా, దేవుసం మీది ముచ్చట్లు అడ్గి తెల్సుకుందామని అచ్చిన. నాకేమో సదువు రాదాయే. నాలుగక్షరాలు నేర్సుకున్న బుద్ధి్దమంతుడు, నల్గుట్ల తిర్గేటోడు, రాముల్నడిగితే మంచిచెడ్డలు తెలుస్తయని అచ్చిన’ అన్నడు ఎంకటి.

‘గట్లన. ఆ ముచ్చట్లు మేము సుత ఇంటం జెర జెప్పు’ అని చంద్రయ్య, సీతయ్య అడిగిండ్రు.
అది సరే గని ఏమడుగుతరో అడుగుండ్లని ఇంటిసూరుకున్న ఏప పల్కర తీసి నోట్ల బెట్టుకుంట అన్నడు రాములు.
‘గా ఢిల్లీలున్న రెండు పెద్ద పార్టోళ్లు అదిజేత్తం, ఇది జేత్తం మమ్ముల గెలిపియ్నుండ్లి అని చెప్తండ్లు గదా, గాళ్ల ముచ్చటేందో జెర జెప్పరాదా?’ అని అడిగిండు ఎంకటి.
‘ఇగో సూడుండ్లి. ఇన్నాళ్లు దేశాన్ని ఆ రెండు పెద్ద పార్టోళ్లు ఏలి మన రాష్ట్రానికి ఏమైన జేసిండ్లా?. ఏం జెయ్యలే. ఐదేండ్ల కిందట కొట్లాడి రాష్ట్రాన్నీ దెచ్చుకున్నంకనే కదా మన రాష్ట్రానికి, మనకు ఇప్పుడిప్పుడే మేలు జర్గుతంది’  అని వివరించిండు రాములు.

‘అవును గని రాములు.. గా రెండు పెద్ద పార్టోళ్లేనట గదా మన వరంగల్లు జిల్లాకు ప్రాజెక్టులు గట్టించిండ్లట. గట్లనే పెచారం చేసుకుంటండ్లు’ అని అమాయకంగా అడిగిండు సీతయ్య.
‘గదేం లేదు సీతయ్యా, ఏండ్ల సంది సూస్కుంటత్తన్నం. ఎట్లున్న చెరువులు అట్లనే ఉండే, కనీసం పూడిక సుత తీపీయకపాయిరి మీకు దెల్వదా ఏందీ, గాళ్లు చెప్తే నమ్ముతర’ అన్నడు రాములు.
‘పాపం గాలి మోటరు కూలి సచ్చిపోయిన ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సార్‌ వచ్చినంక మన మీద జెర చూపు బెట్టిండు గానీ కలవలే. ఇంతల తెలంగాణ వచ్చింది.. ఇగసూడుండ్రీ రాష్ట్రం ఏర్పడ్డంక మన రాష్ట్ర సర్కారు మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువులల్ల పూడిక తీయించింది. ఆ సంగతి మీకెర్కే. గట్ల జేయబట్టి చెరువులకు జలకళ అచ్చింది. ఉమ్మడి జిల్లాల ఏమంత తక్కువ 1,200 చెరువులల్ల పూడిక తీయించిండ్లు, మిషన్‌ భగీరథ పథకం కింద 1227 ఊళ్లకు మంచినీళ్లు ఇంటింటికి అందించడాన్కి అంతా సిద్ధం చేసిండ్ల’ని లెక్కలతోని పూస గుచ్చినట్లు వివరించిండు రాములు.
‘గట్లనా. ఇంకేమేం రాష్ట్ర సర్కారు జేసిందో జెర జెప్ప’ని ఆత్రుతగా అడిగిండు చంద్రయ్య.

అందరు మంచిగినుండ్లి అనుకుంట సర్కారు జేసిన అభివృద్ధి పనుల గురించి ఇడమర్సి చెప్పిండు రాములు. ‘కొత్తగా రాష్ట్ర సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు కడ్తాంది. గా ప్రాజెక్టుతోని ఉమ్మడి వరంగల్‌ జిల్లాలున్న మెట్ట ప్రాంతాలు ఇంకొన్నాళ్లకు పంటలతో కళకళలాడబోతున్నయ్‌. గా ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ–2 లింకు కలిపి 5 లచ్చల 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతది. పాకాల, లక్నవరం, మల్లూరు వాగు ఇంకా కొన్ని పెద్ద చెరువులతోని ఇంకొన్ని వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వత్తది. అంతేకాదు కంతనపల్లి ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాజెక్టు కింద అగ్గువల అగ్గువ ఇంకో 4 లచ్చల 68 వేల 500 ఎకరాల బీడు భూములల్ల పంటలు సాగవుతయ్‌. ఇంతకుముందుగాల్నే దేవాదుల ప్రాజెక్టు కింద 300 చెరువులల్ల నీళ్లు నింపి పంటల సాగుకు ఢోకాలేకుండా జేసిండ్లు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు కింద వంద మీటర్ల లోతుల్నే నీళ్లున్నయ్‌. గిట్ల భూముల సాగుకు ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్ల తక్లీబ్‌ రాకుండా రాష్ట్ర సర్కార్‌ ఇసారం జేత్తంది.

‘అబ్బా.. గిన్ని మంచి పనులు, గిట్ల ఎవుసందార్ల కోసం ఇద్వారకు ఏలినోళ్లు ఎవ్వలు సుత చేయలేద’న్నడు చంద్రయ్య.
‘అవుమల్ల చంద్రయ్య. ఇంకా ఎన్నో పనులు ముందు బెట్టుకున్నది రాష్ట్ర సర్కార్‌’ అని రాములు ఇంకింత ఇడమర్సి చెప్పిండు.
వరంగల్లు మామునూర్‌ కాడ ఇమానం దిగే ఎయిర్‌పోర్టు కట్టిత్తరట. రేయాన్స్‌ ఫ్యాక్ట్రీ సమస్య తీరుస్తరట. టెక్స్‌టైల్‌ ఫ్యాక్ట్రీ సుత కట్టియ్యడాన్కి సెద్ద పెట్టింది, ఇంకా ఐదారు ఫ్యాక్ట్రీలు పెట్టించి సదువుకున్న పోరగాండ్లకు కొలువులు అచ్చేటట్టు చేత్తాండ్లు. ఇప్పటిదాక 36 ఫ్యాక్ట్రీలు పెట్టుకోడాన్కి మంజూరు ఆర్డర్లు ఇచ్చిండ్లు. బీడీ కార్మికుల కోర్కెలు తీరుస్తరట, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కట్టిచ్చుట్ల మన ఉమ్మడి వరంగల్లు జిల్లా ముందున్నది తెల్సా’.

‘అట్లనా రాములు. నీ దగ్గరికత్తే గిన్నీ సంగతులు, రాష్ట్ర సర్కారు చేస్తున్న పనులేందో, ఆ పనులు ఎట్లెట్లా జర్గుతున్నయో మాకు పూసగుచ్చినట్లు ఎర్కజేసినవ్‌. నీకాడత్తెనే మా గిన్నీ ఇసయాలు దెల్సినయ్‌. మళ్లో దినాం గిట్లనే పొద్దుగాల్న అచ్చి కలుత్తం’ అనుకుంట ఎవల పనులకు ఆళ్లు ఎళ్లిపోయిండ్లు.– గడ్డం రాజిరెడ్డి, వరంగల్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు